Monday, May 6, 2024

ధన్య తెలంగాణం… ధాన్య మాగాణం

- Advertisement -
- Advertisement -

Paddy yield

 

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గ్రామాల్లో గుట్టలను తలపించేలా ఎక్కడా చూసినా ధాన్యం రాశులే.. పుడమితల్లి పులకించింది. రైతు కష్టానికి చలించింది. గింజను చల్లితే గుప్పెడు గింజలుగా మార్చింది. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా ఈసారి వరి దిగుబడి, ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. నిరంతర విద్యుత్ సరఫరా.. సమృద్ధిగా సాగునీరు.. సకాలంలో ఎరువులు.. విత్తనాలు.. పెట్టుబడికి రైతుబంధు పథకం వెరసి తెలంగాణలో సిరుల పంట పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి వచ్చింది. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.41 లక్షల ఎకరాలు కాగా ఈసారి ఏకంగా 39.24 లక్షల ఎకరాలకు పెరిగింది.

కోటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం వాటిల్లకూడదని.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు పంటకు మద్ధతు ధరనిస్తూ.. లాక్‌డౌన్ ఉన్నా గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ధాన్యం సేకరణకు గోనె సంచులు, హమాలీల కొరత అవరోధంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కటి అధిగమించుకుంటూ ముందుకు వెళ్తోంది. 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కోటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు తీసుకుంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తోంది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.

సమస్యలను అధిగమించకుంటూ..
లాక్‌డౌన్‌తో వరికోతలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సిఎం కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో అధికార యంత్రాంగం ముందే అప్రమత్తమైంది. వరికోత యంత్రాలను అందుబాటులో ఉంచడంతో పాటు గన్నీ బ్యాగుల కొరతపై దృష్టిసారించింది. ఇంకో 20 రోజులు వరి కోతలు జరగనున్నాయి. ఇప్పటికే కోతలు పూర్తయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరమవుతున్నాయి. ఇంతవరకు 4380 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 6.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.

కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సుమారు 20 కోట్ల గోనె సంచులు(గన్నీ బ్యాగులు) కావాలి. ఇందులో 10 కోట్ల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాటి కోసం పాత గన్నీ బ్యాగులు కొనుగోలు చేస్తున్నారు. వీటికోసం అధికారులు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సంచులు ఏప్రిల్ నెలాఖరు వరకు సరిపోతాయని, తరువాత చేసే కొనుగోళ్లకు వాటిని సమకూర్చుకుంటుంది.

హమాలీల కొరత తీర్చేందుకు బిహార్‌తో సంప్రదింపులు
ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పుంజుకుంటుండటంతో ఇకపై సేకరణ మరింత ముమ్మరం కానుంది. కొనుగోలు కేంద్రాల్లో పరిమిత దూరం పాటించాలని రైతులకు సూచిస్తున్నారు. హమాలీల కొరత తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వలస కూలీలను వినియోగించుకుంటుంది. ప్రస్తుతానికి ధాన్యాన్ని రైతులు, స్థానికుల సహాయంతో లారీల్లోకి ఎక్కిస్తున్నారు. అయితే తేమను తగ్గించేందుకు రైతులు ధాన్యాన్ని ముందే ఆరబోసి తేవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో రైతులు పొలాల్లో, రోడ్లపై ఎక్కడ వీలైతే అక్కడ ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ఏ మాత్రం వాన పడినా తేమ మరింత పెరిగి ధాన్యం పాడవుతున్నాయి. చిన్న, సన్నకారు రైతుల వద్ద పరదాలు లేక ఆరబోసిన ధాన్యం తడిసిపోకుండా ఎక్కడా ఆరబోయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

పెరిగిన దిగుబడి
ప్రాజెక్టుల్లో నీటి లభ్యత మెరుగ్గా ఉండటం, కాళేశ్వరం జలాలతో నీటి ఎత్తిపోతలు పెరగడంతో గోదావరి పరివాహక జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌తో పాటు కృష్ణా పరివాహకంలోని నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో గణనీయంగా పంటలు సాగయ్యాయి. అర్థగణాంక రెండో ముందస్తు అంచనాల ప్రకారం హెక్టారుకు 53.43 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. గత ఐదేళ్లలో ఇదే అధికం. ఇందుకు విత్తన ఎంపికలే కారణం. 201415లో హెక్టారుకు 48.16 క్వింటాళ్లు దిగుబడి ఉంది. అంటే ఆరేళ్లలోనే 7 క్వింటాళ్ల దిగుబడి పెరిగింది.

ఖరీఫ్‌లో చెల్లించిన మద్దతు ధర మాదిరే ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1,835, సాధారణ రకానికి రూ.1,815గా చెల్లిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు రూ.32 వేల కోట్లకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే రూ.600 కోట్ల మేర చెల్లింపుల ప్రక్రియ పూర్తయింది. ఇక కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ కేంద్రాలకు తరలించేలా రవాణా ఏర్పాట్లు చేశారు. గడిచిన ఖరీఫ్‌లో అర్థ గణాంక శాఖ లెక్కల ప్రకారం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. ప్రభుత్వం 44.80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది.

గత ఆరేళ్లుగా ఖరీఫ్, రబీలలో కలిపి రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి లక్షల మెట్రిక్ టన్నులలో ఇలా

ఏడాది ఉత్పత్తి మొత్తం
ఖరీఫ్                                                                       రబీ
201415 42.85 25.35 68.17
201516 32.95 12.75 45.71
201617 45.43 53.56 98.98
201718 44.19 49.76 93.95
201819 62.01 38.01 100.02
201920 89.49 100.05 189.54 (అంచనా)

 

Paddy yield increased significantly
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News