Wednesday, May 8, 2024

పల్లెవించిన ప్రగతి

- Advertisement -
- Advertisement -

Palle Pragathi

 

ప్రజల విశేష భాగస్వామ్యంతో ముగిసిన పల్లెప్రగతి-2

రూ.147కోట్లతో అమలైన అభివృద్ధి కార్యక్రమాలు
పాలుపంచుకున్న 7లక్షల మంది ప్రజలు
గుర్తించిన పనుల్లో 94.8% పూర్తి

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రజలు నీరాజనం పలికారు. ప్రజల భాగస్వామ్యం కూడా పెరిగింది. ఈ నెల 2 నుంచి ఆదివారం వరకు పది రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో 12,749 గ్రామ సభలను నిర్వహించారు. ఇందులో 7,02,563 మంది ప్రజలు భాగస్వాములు అయ్యారు. కాగా పది రోజుల్లో మొత్తం 6,654 పనులు గుర్తించగా, వాటిల్లో 6,308 పనులను పూర్తి చేశారు. దీంతో 94.80శాతం పనులు పూర్తి అయ్యాయి.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 339 కోట్ల నిధుల్లో రూ.147 కోట్లను వెచ్చించారు. దీంతో పల్లె ప్రగతిలో గ్రామాల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. 80 శాతం గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రత సంతరించుకున్నాయి. 5 లక్షల మందికి పైగా శ్రమదానం చేశారు. రెండవ విడతలోనూ పారిశుద్ధ్యం, మొక్కల పెంపకాన్ని ప్రధానాంశాలుగా తీసుకున్నారు. ప్రజల సహకారంతో వీటిని సమర్థంగా అమలు చేయడంతో పల్లెలు పచ్చదనాన్ని సంతరించుకొన్నాయి.

విజయవంతంగా సాగిన ప్రగతి పనులతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. ఖాళీ ప్రదేశాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, సర్కారు తుమ్మ, పొదలను తొలగించారు. ప్రమాదకర బావులను పూడ్చి వేశారు. బోర్లను మూసివేశారు. మిగిలినవాటిని కూడా త్వరలోనే పూడ్చివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 94,165 కిలోమీటర్ల మేర రోడ్లను శుభ్రం చేశారు. 72,427కిలోమీటర్ల మేర కాలువల్లో పూడిక పనులు నిర్వహించారు. 46,895 బహిరంగ ప్రాంతాల్లో మట్టికుప్పలను తొలగించారు. 1,20,793 ప్రాంతాల్లో సర్కార్ తుమ్మ చెట్లను, పిచ్చిమొక్కలను తొలగించారు. చెడిపోయిన 9,317 బావులను పూడ్చివేశారు. 53,178 రోడ్లపై పడిన గుంతులను పూడ్చడంతో పాటు 6,308 మార్కెట్లలో పారిశుద్ధ్ పనులను చేపట్టారు.

అలాగే 12,750 గ్రామ పంచాయతీల్లో శ్రమదానం చేసి అనేక పనులను పూర్తి చేశారు. పాత విద్యుత్ స్థంబాల స్థానంలో కొత్తగా 1,21,924 ఏర్పాటు చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 15,739 మంది దాతలను గుర్తించారు. వారి నుంచి సుమారుగా రూ.1.16 కోట్లను విరాళ రూపంలో సేకరించారు. మొత్తం 12,751 శ్మశాన వాటికలను గాను ఇప్పటికి 5,487 ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మరో 4,837 శ్మశాన వాటికల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

పల్లెప్రగతిలో రాష్ట్రంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా శ్రమదానాలు చేశారు. గ్రామసభల్లో భాగస్వాములైన ప్రజలు గ్రామాభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకున్నారు. జన్మనిచ్చిన ఊరికి ఏమేం చేయాలో తీర్మానించుకుని.. సమిష్టిగా శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కెటిఆర్, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, అల్లోల ఇంద్రకరణ్‌రెడి తదితరులు తదితరులు పాల్గొని పల్లెప్రగతిలో పాల్గొని ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఇదే స్ఫూర్తిని
ఇకపై కూడా కొనసాగించాలని గ్రామస్థులకు దిశానిర్దేశం చేశారు.

Palle Pragathi Program 2 ended
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News