Saturday, April 27, 2024

నాస్తికోద్యమ వీరుడు పెరియార్

- Advertisement -
- Advertisement -

Periyar EV Ramasamy birth anniversary

కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైక్కోమ్ అనే పట్టణం ఉంది. అక్కడి శివాలయం ముందు నాలుగు వీధుల్లో అంటరాని వారు నడవగూడదని, ఆ చుట్టు పక్కల కనిపించగూడదని ఆంక్షలుండేవి. వాటిని ఎత్తివేయాలని అక్కడి సామాజిక కార్యకర్తలు కొందరు సత్యాగ్రహం చేశారు. ప్రభుత్వం వారినందరినీ జైల్లో పెట్టింది. మరి కొంత మంది కార్యకర్తలు పెరియార్ దగ్గరికి వెళ్లి విషయం వివరించారు. కేరళకు వచ్చి, తమ సత్యాగ్రహాన్ని కొనసాగించమని అభ్యర్థించారు. విషయం గ్రహించిన పెరియార్ అక్కడికి వెళ్లి సత్యాగ్రహం కొనసాగించారు. అప్పుడు ఆయన సత్యాగ్రహానికి దేశ వ్యాప్తంగా గుర్తింపూ, పెద్ద ఎత్తున మద్దతూ లభించాయి. పైగా విరాళాలు కూడా వచ్చాయి. పెరియార్ సత్యాగ్రహానికి వస్తున్న స్పందన చూసి, అక్కడి పాలకులు తట్టుకోలేకపోయారు. వారు వెళ్లి గాంధీజీని అభ్యర్థించారు. ఎలాగైనా ఆ సత్యాగ్రహాన్ని ఆపించమని కోరారు. వారు కోరిక మేరకు గాంధీజీ 9 మార్చి 1925న వైక్కోమ్ చేరుకుని, పెరియార్‌ని కలిశారు.

సత్యాగ్రహం విడిచి వెళ్లాలని కోరారు. దానికి పెరియార్ గాంధీజీని ఈ విధంగా ప్రశ్నించారు. “గాంధీ గారూ! సత్యాగ్రహం వదిలి వెళ్లమంటున్నారు సరే నాకు ఒక్క విషయం చెప్పండి. ఈ వైక్కోమ్ వీధుల్లో కుక్కలు వెళుతున్నాయి. పందులు, పశువులూ వెళుతున్నాయి. గాడిదలూ వెళుతున్నాయి. ఇవేవీ సత్యాగ్రహం చేసే వాటి హక్కుల్ని పరిరక్షించుకోలేదే? కానీ, మన సాటి మనుషులు మాత్రం వీధుల్లో నడవడానికి సత్యాగ్రహాలు చేయాలా? పైగా సత్యాగ్రహం వదిలేసి వెళ్లమని మీలాంటి వారు చెప్పాలా? ఇదేమైనా బావుందా? కొంచెం ఆలోచించండి!” జవాబు చెప్పలేని గాంధీజీ కొంత సేపు మాట్లాడలేదు. తర్వాత మళ్లీ అన్నారు. “ఇవ్వాల వీధుల్లో తిరగనిస్తే, రేపు గుళ్లోకే వస్తామంటారేమో అప్పుడెలా” అని ! మహాత్ముడిగా పిలవబడుతున్న గాంధీజీ ఖచ్చితంగా దళిత వ్యతిరేకి అనే విషయం పెరియార్‌కి స్పష్టమైంది. అదే విషయం బహిరంగంగా కూడా ప్రకటించారు. చివరికి ఎలాగైతేనేం ! వైక్కోమ్ వీధుల్లో శూద్రులు, దళితులు స్వేచ్ఛగా తిరిగే హక్కును పెరియార్ సాధించి పెట్టారు. అది దక్షిణ భారత దేశంలో తొలి మానవ హక్కుల విజయంగా చరిత్ర పుటలకెక్కింది.

దేశంలో అధిక సంఖ్యాకులైన బహుజనుల పట్ల కాంగ్రెస్ పార్టీకి సరైన విధానమేదీ లేదని, దానితో విభేదించి పెరియార్ బయటికి వచ్చారు. ‘ద్రవిడార్ కజగం’ స్థాపించారు. ద్రవిడ ఉద్యమానికి బీజం వేశారు. అది ‘స్వాభిమాన ఉద్యమ’మని (Self Respect Movement) ప్రకటించారు. అందువల్ల ఆయనకు ద్రవిడ ఉద్యమ పితామహుడుగా గుర్తింపు లభించింది. స్వాభిమాన ఉద్యమంలో భాగంగా కొన్ని వేల కుల వ్యతిరేక వివాహాలు జరిపించారు. ఈ ఉద్యమం విజయవంతం కావాలంటే మహిళల తోడ్పాటు చాలా అవసరమని పిలుపునిచ్చారు. సమాజంలో సగభాగమైన మహిళలకు పురుషులతో సమానమైన స్థాయిలో అవకాశాలుండాలన్నారు. స్త్రీలు స్వేచ్ఛ కోల్పోవడం, అణచివేతకు గురి కావడం వంటి వాటికి ముఖ్య కారణం మత విశ్వాసాలు, దైవభక్తి అని వాటిని వారు వదులుకుంటే భర్తలు దైవ స్వరూపులుగా కాక, తోటి మనుషులుగా కనపడతారనీ అన్నారు. బానిస మనస్తత్వం వదిలినప్పుడే పురుషాహంకారాన్ని ఎదుర్కోగలరని పెరియార్ కుటుంబ సభ్యులతో ఆచరణాత్మకంగా ఉద్యమం సాగించారు. అందుకాయన ఒక సులభమైన వివరణ ఇచ్చారు.

అది ఇలా ఉంది. “పిల్లి నుండి ఎలుకకు స్వాతంత్య్రం దొరుకుతుందా? యజమాని నుండి పనివాడికి బ్రాహ్మణుల నుండి బ్రాహ్మణేతరులకు ఎక్కడైనా సమానత్వం దొరుకుతుందా? అలాగే పురుషుల నుండి స్త్రీలకు ఎప్పటికీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు దొరకవు. అవి సంఘర్షించి సాధించుకోవాల్సిందే! తన పురుషుడు లేకుండా తను బతకలేనని తను లేకుండా కూడా అతను బతకగలడని ప్రతి స్త్రీ అనుకున్నంత కాలం స్త్రీ పురుషు సమానత్వం సాధ్యం కాదు” అని అన్నారు పెరియార్. బ్రాహ్మణులను దైవాంశ సంభూతులుగా భావించకుండా, మామూలు మనుషులుగా భావిస్తే మనుషులంతా ఒక్కటే అనే భావనకు బలం చేకూరుతుంది. అటు బ్రాహ్మణేతరులు, ఇటు స్త్రీలు తమతమ బానిస మనస్తత్వం విడనాడినప్పుడే సమాజంలో సమానత్వం సాధించగలం అని తన ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా ఉద్బోధించారు పెరియార్! స్త్రీ సమానత్వం కోసం ఇవి రామసామి చేసిన పోరాటానికి 12 నవంబర్ 1938న ఐదు వేల మంది మహిళలు మదరాసు (చెన్నై)లో పెద్ద ఊరేగింపుగా ఆయనను తీసుకు వెళ్లి, ఒక మహాసభలో ‘పెరియార్’ అనే బిరుదు ప్రదానం చేశారు.

‘పెరియార్ వర్ధిల్లాలి’ అని నినాదాలు ఇచ్చారు. అప్పటి నుండి అందరూ రామసామిని ‘పెరియార్’గా వ్యవహరించాలని తీర్మానించారు. పెరియార్ అంటే ఎండిపోకుండా నిరంతరం సజీవంగా పారుతూ ఉండే నదీ ప్రవాహం అని అర్థం. మహాత్ముడనే భావన కూడా అందులో ఉంది. ఈరోడ్ వెంకటప్పరామసామి నాయకర్‌గాపుట్టి పెరిగిన వ్యక్తి కుల నిర్మూలనలో భాగంగా ‘నాయకర్’ అనే కుల సూచికను ఆయనే వదిలేశారు. మిగిలిన ఇవి రామసామిని ప్రజలు పెరియార్‌గా గుర్తించుకున్నారు. గుర్తుఉంచుకున్నారు.

‘వైజ్ఞానిక అవగాహన తప్పనిసరి’ అని ఉద్బోధించిన పెరియార్, యూరోప్, రష్యా, మలేసియా దేశాలు పర్యటించి తన భావజాలాన్ని ప్రచారం చేశారు. 1938లో హిందీ వ్యతిరేకోద్యమం నడిపారు. 1939-44 మధ్య కాలంలో జస్టిస్ పార్టీ అధినేతగా ఉన్నారు. పలు రంగాలలో పెరియార్ నిరాడంబర, నిస్వార్థ సేవలను ఐక్యరాజ్యసమితి (యుఎన్‌ఇఎస్‌సిఒ) గుర్తించి, భారత ప్రభుత్వం ద్వారా ఒక ప్రశంసా పత్రాన్ని అందించింది. అది చాలా విలువైనది. ఎందుకంటే అందులో ఉన్న విశేషణాలు చాలా గొప్పవి. “ఆగ్నేయాసియా దేశాల సోక్రటీస్ అని, నూతన యుగానికి ప్రవక్త అని, సంఘ సంస్కరణోద్యమానికి పితామహుడని, మూఢ నమ్మకాలకీ, అర్థ రహిత సంప్రదాయాలకి, బద్ధశత్రువని, అజ్ఞాన విచ్ఛేదకుడని” ఆ ప్రశంసా పత్రంలో యునెస్కో కీర్తించింది. అంటే ఆయన నడిపిన ఉద్యమాల ప్రభావం ప్రపంచ వ్యాప్తమైంది. ఈ దేశంలో సమానత్వం రావాలంటే దోపిడీ వర్గ నిర్మూలన జరగాలి. అది జరగాలంటే కుల నిర్మూలన జరగాలి.

సాంస్కృతిక విప్లవం విజయవంతమైతే కుల నిర్మూలన సాధ్యమవుతుంది. అందుకోసం సామాజిక ఉద్యమకారులు పెరియార్‌ని ఆదర్శంగా తీసుకుని, నాస్తికత్వాన్ని ఆయుధంగా వాడుకుంటూ వైజ్ఞానిక అవగాహనతో ఉద్యమాలు చేయాల్సి ఉంది. మొదటి సారి రాజ్యాంగ సవరణ చేయించి రిజర్వేషన్లు కొనసాగే విధంగా పెరియార్ చేసిన కృషి ఈ దేశంలోని బహుజనులకు స్ఫూర్తిదాయం. నవంబర్ 26ను “కుల నిర్మూలన దినం”గా ప్రకటించి బ్రాహ్మణ హోటళ్ల బోర్డుల పై నుండి ‘బ్రాహ్మణ’ అనే పేరును తొలగించే ఉద్యమం చేసి సమానత్వ భావనను తీసుకొచ్చారు. కుల వ్యవస్థను, అంటరాని తనాన్ని ప్రబోధిస్తున్న రామాయణం, మనుస్మృతి ప్రతులను తగులబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల చేత రాముని చిత్ర పటాలను దగ్ధం చేయించారు. రాముడు, సీత, లక్ష్మణుల దిష్టి బొమ్మల్ని తగుల బెట్టించారు.

వినాయక విగ్రహాలు పగులగొట్టించారు. వినాయక విగ్రహాల విషయమై ఒకరు కోర్టు కెక్కారు. న్యాయమూర్తి ముందు పెరియార్ ధైర్యంగా తన అభిప్రాయం వెల్లడించారు. నిమజ్జనం పేర వినాయకుడి విగ్రహాల్ని మంచి నీటి సరస్సుల్లో వేసి జనం కాలుష్యం పెంచుతున్నారనీ, అందుకు విరుద్ధంగా పర్యావరణాన్ని రక్షించే విధంగా తాను విగ్రహాల్ని పగుల గొట్టిస్తున్నానని నీటిలో వేసినా, పగులగొట్టినా ఫలితం ఒకటేనని చెప్పారు. సంతృప్తి చెందిన న్యాయమూర్తి కేసు కొట్టేశాడు. ప్రజలు తాకితేనే విగ్రహాలు మైలపడితే అలాంటి దేవుళ్లు మనకెందుకూ? అని ప్రశ్నించిన పెరియార్, అలాంటి విగ్రహాల్ని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాలి. లేదా చెరువు గట్టున పడేస్తే, అది బట్టలు ఉతుక్కోవడానికైనా పని కొస్తుంది అనే సూచన చేశారు.

పెరియార్ ఉద్యమ కృషి ఫలితంగా 1967లో తమిళనాడులో బహుజనుల రాజ్యం ఏర్పడింది. ‘దేవుడు లేడు లేనేలేడు’ అనే నినాదాలు సభల్లో తమిళనాడు అంతటా విరివిగా వినిపించేవి. ఆ విషయం మీద ధైర్యంగా మాట్లాడ గలిగేవారు. అంటే పెరియార్ బోధనల ప్రభావం ఎంత బలంగా పడిందో అర్థం చేసుకోవాలి. తర్వాత కాలంలో వచ్చిన వారు పెరియార్ విధానాలను కొనసాగించకపోవడం వల్ల మళ్లీ అక్కడ మనువాదులు బలపడ్డారు. పెరియార్ కాలంలోనే స్వాభిమాన్ పెళ్లి చట్టం అమలయ్యింది. నాస్తిక, హేతువాద, వైజ్ఞానిక ఉద్యమాల స్ఫూర్తితో పెరియార్, ఫూలే, అంబేడ్కర్‌ల బోధనల ప్రభావంతో జీవిస్తున్న నేటి తరం, ఇప్పటికీ సామాజిక న్యాయం కోసం తల్లడిల్లిపోతోంది.

అయితే నిరాశపడకుండా మరో ముందగుడు వేసి తన గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంది. దేశానికి స్వాతంత్య్రం లభించి ఏడు దశాబ్దాలు దాటినా, ఇంకా మనువాద వారసులు పరిపాలనా యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుని, వ్యవస్థల్ని, మానవీయ విలువల్ని ధ్వంసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు పెరియార్ ఆలోచనా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, సమ సమాజ స్థాపన కోసం ఉద్యమిస్తూనే ఉండాలి. సంఘర్షణ ఆగిపోగూడదు. యుద్ధం ఆగిపోగూడదు. మనువాద అనాలోచిత, అహంకార పూరిత అసమర్థ ప్రభుత్వాల నుండి ప్రజలు తమని తామే రక్షించుకుంటూ ఉండాలి. మానవీయ విలువల్ని పరిరక్షించే, వైజ్ఞానిక దృక్పథం గల ప్రభుత్వాల కోసం ప్రజలు కృషి చేస్తూనే ఉండాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News