Saturday, April 27, 2024

ఢిల్లీలో ప్లాస్మా థెరపీ సక్సెస్

- Advertisement -
- Advertisement -

Plasma Therapy

 

న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్లాస్మా థెరపీ ప్రక్రియతో కరోనాపై విజయం సాధించారు. కరోనాతో విషమ పరిస్థితిలో ఉన్న నలుగురు రోగులు ప్లాస్మా థెరపీతో దాదాపుగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ శనివారం తెలిపారు. కరోనాకు ప్రపంచంలో ఎక్కడా ఇప్పటికీ సరైన వైద్య చికిత్స అందుబాటులో లేదు. అయితే వైరస్‌తో పోరాడే యాంటిబాడీస్ ఉన్న రక్త సముదాయం ప్లాస్మా. ఈ ప్లాస్మాను వినియోగించుకుని కరోనా రోగుల చికిత్స ప్రక్రియను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.

దీనిని కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీగా వ్యవహరిస్తారు. కరోనా నుంచి కోలుకున్న రోగుల నుంచి వారి ఆమోదంతో సేకరించిన ప్లాస్మాను చికిత్సకు వినియోగిస్తున్నారు. కోవిడ్‌తో విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్న వారికి ఈ ప్లాస్మాను ఎక్కించడం ద్వారా వారిలో వైరస్ యాంటీబాడీస్ శక్తివంతం అయ్యేందుకు వీలేర్పడుతుంది. ఢిల్లీలో ఇప్పటివరకూ ఆరుగురు కరోనా రోగులకు ఈ చికిత్స జరిపినట్లు మంత్రి జైన్ వివరించారు.

వీరిలో నలుగురి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, ప్లాస్మాథెరపీ ప్రక్రియకు ఇది గీటురాయి అవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఇప్పుడు దృష్టి కేంద్రీకృతం అవుతోంది. గత నాలుగు రోజుల క్రితం ప్లాస్మా థెరపీ పొందిన నలుగురి పరిస్థితి కుదుటపడిందని చెప్పారు. థెరపీకి ముందు వీరి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంటూ వచ్చిందని, ఈ దశలో అత్యంత క్లిష్టమైన చికిత్సకు దిగినట్లు మంత్రి తెలిపారు. కరోనా రోగ విముక్తులు ప్లాస్మాదాతలుగా ముందుకు రావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపు నిస్తూ వస్తున్నారు. కరోనాతో విషమ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఎటువంటి సంకోచాలు లేకుండా ప్లాస్మాదానానికి ముందుకు వస్తే వారే ప్రాణదానం చేసిన వారవుతారని అన్నారు.

లోక్‌నాయక్ హాస్పిటల్‌లో ధెరపీ
ఢిల్లీలోని ప్రఖ్యాత లోక్‌నాయక్ హాస్పిటల్ ఈ వినూత్న ప్లాస్మా థెరపీకి కేంద్రంగా మారింది. తొలుత ఈ ప్లాస్మా థెరపీ ప్రక్రియపై పలు అనుమానాలు తలెత్తాయి.అయితే ప్రస్తుత దశలో దీని సమర్థత రుజువు అయింది. ఢిల్లీలోని ఎయిమ్స్, ఇనిస్టూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్‌లలో ప్లాస్మా థెరపీ ప్రయోగాలు నిర్వహించారు.

Plasma Therapy Success in Delhi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News