Monday, April 29, 2024

ముప్పులోనే ఉన్నాం

- Advertisement -
- Advertisement -

మునుపటికన్నా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది
ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి
మాస్క్.. మస్ట్ కావాలి
కరోనా నుంచి విముక్తికి ప్రతిన బూనాలి
‘మన్‌కీ బాత్’ప్రసంగంలో ప్రధాని మోడీ పిలుపు

PM Modi Address Mann Ki Baat with Nation

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ముప్పు తొలగి పోలేదని, మునుపటికంటే ఇప్పుడు అది మరింత ప్రమాదకారిగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. కరోనా మహమ్మారి మరింత విస్తరించకుండా ఉండేందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందేనని స్పష్టం చేశారు. ‘మన్‌కీ బాత్’ రేడియో కార్యక్రమంలో భాగంగా ప్రధాని ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘పలు దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉంది. మనం లక్షలాది మంది ప్రాణాలను కాపాడాం..అయినా కరోనా వైరస్ ముప్పు ముగియలేదు’ అని వ్యాఖ్యానించారు. పలు ప్రాంతాలకు మహమ్మారి విస్తరిస్తోందని, మనం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తొలగించేటప్పుడు గత మార్చి నుంచి నిర్విరామంగా శ్రమిస్తున్న కొవిడ్ వీరులను ఒక్కసారి గుర్తు చేసుకోవాలనిప్రధాని పిలుపునిచ్చారు. కరోనానుంచి దేశం విముక్తి చెందాలని, ఆత్మనిర్భర్ భారత్ కోసం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలంతా కోరుకోవాలని ప్రధాని అన్నారు. రాఖీ పండగ రాబోతోందని, ప్రజలు ఈ సారి రక్షాబంధన్‌ను విభిన్న రీతిలో జరుపుకునేందుకు ప్రయత్నించడం హర్షదాయకమని అన్నారు.

గతంలో క్రీడలు, ఇతర రంగాల్లోకి పెద్దనగరాలు, ప్రముఖుల కుటుంబాలు, పేరొందిన పాఠశాలలనుంచే పలువురు దూసుకు వచ్చేవారని, అయితే ఇప్పుడు గ్రామాలు, చిన్న పట్టణాలు, సామాన్య కుటుంబాలనుంచి ఆయా రంగాలలోకి పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని అన్నారు. సరయిన మార్గంలో, సానుకూల దృక్పథంతో ఆలోచించినప్పుడు కష్టాలనుంచి గట్టెక్కడమే కాకుండా, వాటినే అవకాశాలుగా మలుచుకోవచ్చని మోడీ అంటూ బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో యువకులు, మహిళలు తమ నైపుణ్యాల ఆధారంగా నూతన ప్రయోగాలు చేస్తూ ఉపాధి మార్గాలను అన్వేషిస్తుండడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.

కార్గిల్ హీరోలకు నివాళి
కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు ప్రధానమంత్రి ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటికి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సైనికుల త్యాగాలను కొనియాడారు. ‘ఈ రోజు చాలా ముఖ్యమైనది. కార్గిల్ యుద్ధం ఎలాంటిసమయంలో, ఏ పరిస్థితుల్లో జరిగిందో ఏ ఒక్కరూ మరువలేరు.. పాకిస్థాన్‌తో మెరుగైన సంబంధాలను భారత్ కోరుకుంటే అది జరుగలేదు’ అని కార్గిల్ యుద్ధంనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. మన సైనికుల ధైర్యానికి ధన్యవాదాలని, కార్గిల్‌లో భారత్ అసమాన పాటవాన్ని ప్రదర్శించిందని మోడీ అన్నారు. ప్రధాని ఈ సందర్భంగా సోషల్ మీడియా ముప్పు గురించి కూడా ప్రస్తావించారు. ఒక్కోసారి దేశానికి హానికరమైన విషయాలను కూడా జనం సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తూ ఉంటారని, అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలని అన్నారు.

సరిహద్దుల్లో సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో పోరాటం చేస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జనం ఈ విషయంలో తమపాత్రను నిర్ణయించుకోవాలని లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తతలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని అన్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రధాని గుర్తు చేస్తూ, అది ఈ నాటికి కూడా వర్తిస్తుందన్నారు. అప్పటి వాజపేయి ప్రసంగంలో కొంత భాగాన్ని కూడా ఆయన వినిపించారు.

PM Modi Address Mann Ki Baat with Nation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News