Monday, April 29, 2024

సవాళ్లను తిప్పికొట్టేందుకు మరింతగా కలిసికట్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో తొలి అధికార పర్యటనకు మంగళవారం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు ఆయన ప్రయాణం సాగుతుంది. కలిసికట్టుగా పయనిస్తూ ఉమ్మడి ప్రపంచ సవాళ్లను మరింత సమర్థవంతంగా తట్టుకునేందుకు, ఈ దిశలో విజయం సాధించేందుకు అమెరికా పర్యటన తలపెట్టుకున్నానని భారత ప్రధాని అమెరికా, ఆ తరువాత ఈజిప్టులలో పర్యటించేందుకు ముందు వెలువరించిన అధికారిక ప్రకటనలో తెలిపారు.

పలు సవాళ్లు ఉన్నాయి. అయితే సమిష్టిగా దేనినైనా ఎదుర్కోవచ్చుననే విషయాన్ని రుజువు చేసేందుకు ఈ పర్యటన సాగుతోందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ , ప్రధమ మహిళ జిల్ బైడెన్ దంపతుల ప్రత్యేక ఆహ్వానంపై మోడీ అమెరికా పర్యటన ఖరారు అయింది. ముందుగా ఆయన బుధవారం (21న) న్యూయార్క్‌కు చేరుకుని అక్కడ ఐరాస ప్రధాన కార్యాలయం వేదికగా సాగే అంతర్జాతీయ యోగాదినోత్సవంలో ప్రధాన అతిధిగా పాల్గొంటారు.

తరువాత వాషింగ్టన్ డిసిలో భారతీయ సంతతి వారిని ఉద్ధేశించి ప్రసంగించడం, అమెరికా చట్టసభలైన కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో సభ్యులను ఉద్ధేశించి మాట్లాడటం జరుగుతుంది. మంగళవారం ఉదయం మోడీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. ప్రెసిడెంట్ బైడెన్, ఇతర నాయకులతో తాను జరిపే విస్తృత చర్చలకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. వివిధ కీలక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుత దశలో అత్యంత ఆవశ్యకం అయిన బహుళ స్థాయి వేదికలు జి 20, క్వాడ్, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం ( ఐపిఇఎఫ్) వంటి వేదికల మరింత బలోపేతానికి ఈ సంప్రదింపులు తోడ్పాటు అందిస్తాయని తెలిపారు.

బుధవారం ఐరాస నాయకత్వంతో, అంతర్జాతీయ సమాజం ప్రతినిధులతో తాను యోగా దినోత్సవంలో కలిసి పాలుపంచుకోవడం తనకు వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉందన్నారు. న్యూయార్క్ నుంచి తాను నేరుగా వాషింగ్టన్ డిసికి వెళ్లుతానని మోడీ ప్రకటించారు. 2021 నుంచి కూడా తాను పలు మార్లు అంతర్జాతీయ వేదికలపై ఓ సారి అమెరికాలోనూ ప్రెసిడెంట్ బైడెన్‌ను కలిసినట్లు పలు విషయాల ప్రస్తావన వచ్చినట్లు తెలిపారు. ఇప్పటి పూర్తి స్థాయి అధికారిక పర్యటన సంబంధిత అంశాలను తిరుగులేని విధంగా ముందుకు తీసుకువెళ్లడానికి ఉద్ధేశించిందే అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పలు రంగాలలో విస్తరించుకుని పోతున్నాయని ,ఈ కోణంలో ఇవి బహుముఖ రూపాన్ని విస్తరింపచేసుకున్నాయని అన్నారు.

సరుకులు సేవల రంగం , ఐటి విద్యా విషయాలు కీలకం
భారత్ అమెరికాలు చిరకాలంగా సరుకులు, సేవల రంగంలో భారీ స్థాయి భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. పలు ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ కలిసికట్టు పయనం చెక్కుచెదరకుండా సాగుతోంది. మరో వైపు శాస్త్ర సాంకేతిక, విద్యా, ఆరోగ్య, రక్షణ భద్రత వంటి ప్రధాన విషయాల్లో కూడా ఇరుదేశాల సహకారం పటిష్టం అవుతోంది. ప్రత్యేకించి భారతీయ సంతికి చెందిన పలువురు యువ ప్రతిభావంతులు అమెరికాలో ఉన్నత స్థానాలలో , ప్రముఖ కంపెనీల్లో ఉన్నారు. సరుకుల సేవల విషయంలో అమెరికా ఎక్కువగా భారతదేశాన్ని తమ విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా ఎంచుకుందని ప్రధాని మోడీ గుర్తు చేశారు.

ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ శాస్త్ర సాంకేతిక రంగాలలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. అత్యంత సున్నితమైన పరిణామాత్మక ఐటి ఇతరత్రా సాంకేతికతల విషయంలో అన్నింటికి మించి ఇప్పుడు కీలకమైన రక్షణ సంబంధిత పరిశ్రమల విషయంలోనూ ఇరు దేశాల బంధం మరింత పటిష్టం కానుందని ప్రధాని మోడీ తెలిపారు. టెలికం అపార విస్తృతి విషయం అయింది. క్వాంటం, కృత్రిమ మేధ (ఐఎ) సంపత్తి వంటివి పరస్పర సంబంధాల పటిష్టతకు ఆలంబనగా నిలుస్తాయని వివరించారు.

స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిశ్రిత ఇండో పసిఫిక్ రెండు దేశాల ఉమ్మడి విజన్‌గా ఉందని , దీనిని తాము అమెరికా పర్యటనలో ప్రస్తావిస్తామని మోడీ చెప్పారు. ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండాల్సిన వాస్తవిక విషయం వ్యాపార వాణిజ్య రంగాలలో , సృజనాత్మకత, ఐటి పరిజానంలో ఇతర రంగాలలో ద్వైపాక్షిక సంబంధాల విస్తృతి అని మోడీ స్పష్టం చేశారు. వీటన్నింటిపైనా తనకు పూర్తి ఆశాభావం ఉందన్నారు. బైడెన్ దంపతుల సాదర విందు స్వాగతం ఆహ్వానం తనకు సంతోషకరం అని, దీనికి తాను హాజరవుతున్నానని ప్రధాని తెలిపారు. వైట్‌హౌస్‌లో బైడెన్ దంపతులు ప్రధాని మోడీ గౌరవార్థం విందు ఏర్పాటు చేస్తున్నారు.

అమెరికా కాంగ్రెస్‌లో కీలక ప్రసంగం
అమెరికా చట్టసభల సంయుక్త సమావేశాన్ని ఉద్ధేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎల్లవేళలా పటిష్టంగా ఉండేందుకు అమెరికా కాంగ్రెస్ ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచిందని , ఈ నేపథ్యంలో తాను జాయింట్ సెషన్‌లో మాట్లాడనుండటం కీలకం అవుతుందని ప్రధాని వివరించారు. కేవలం ప్రభుత్వాలు అధికారిక వ్యవస్థల మధ్యనే కాకుండా ప్రజల మధ్య అనుబంధాలు దేశాల మధ్య స్నేహ వారధులను బిగుసుకునేలా చేస్తాయని తెలిపారు.

ఈ కోణంలో ఇరుదేశాల మధ్య వాడిపోని విశ్వాసం నెలకొంటుంది. భారత్ అమెరికా మధ్య ఇటువంటి పరిపూర్ణపు సహకారపు నమ్మకాల పయనం కేవలం ఇరుదేశాలకే కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రధాన విషయం అవుతుందన్నారు. ప్రవాస భారతీయులతో తాను ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించబోతున్నానని, ఇది తన మనస్సుకు బాగా ఆకట్టుకునే దశ అవుతుందని తెలిపారు. ఇండో అమెరికన్లు అమెరికాలో ఓ ప్రభావిత వర్గంగా ఉంది. ఈ శ్రేణులు మన అత్యున్నత విలువల సమాజాన్ని అక్కడ ప్రతిఫలిస్తున్నాయని, వారితో ముచ్చటించడం తనతో తానే మాట్లాడుకోవడం అవుతుందని అన్నారు.

తన పర్యటన దశలో కొందరు ప్రముఖ సంస్థల కార్యనిర్వాహక అధికారిక స్ధానాల్లోని సిఇఒలతో తాను జరిపే చర్చలు మేలు చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచానికి ఇప్పుడు సరఫరా వ్యవస్థ పటిష్టం కావడం అత్యవసరం. పెట్టుబడులు వ్యాపార వాణిజ్యాలను మరింత ఉన్నతికి తీసుకువెళ్లడం ప్రధాన ఘట్టం అవుతుంది. దీని ఫలితంగానే ప్రపంచస్థాయిలో పటిష్టం అయ్యే సరఫరా వలయం మరింత ధృఢమవుతుందన్నారు. ఇరు దేశాల ఉమ్మడివిలువలు అయిన ప్రజాస్వామ్యం, వైవిధ్యత, భిన్నత్వంలో ఏకత్వం, స్వేచ్చ వంటివి ఈ పర్యటన దశలో మరింత వెల్లివిరుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News