Monday, April 29, 2024

రైతులను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టించాయి: ప్రధాని మోడీ విమర్శ 

- Advertisement -
- Advertisement -

రైతులను పక్కదోవ పట్టించిన ప్రతిపక్షాలు
కుట్రలో భాగంగానే ఢిల్లీలో పావులు
అన్నదాతల సందేహాలను తీర్చుతాం

గుజరాత్ సభలలో ప్రధాని మోడీ విమర్శ 

ఢోర్డో: నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని అన్నారు. గుజరాత్‌లోని కచ్ భుజ్ ఇతర ప్రాంతాలలో డిశాలినేషన్ ప్లాంటు, ఇతర ప్రాజెక్టులకు మంగళవారం శంకు స్థాపన చేసిన తరువాత ప్రధాని మాట్లాడారు. స్వరాష్ట్రం నుంచి తొలిసారిగా ప్రధాని ఇప్పటి రైతుల ఆందోళనపై స్పందించారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు వ్యక్తం చేసిన అనుమానాలు, వారి ఆందోళనను కేంద్రం అర్థం చేసుకుందని, సమస్య పరిష్కారానికి తాము స్పందిస్తున్నామని వివరించారు. ప్రతిపక్షాలు ఈ క్రమంలో అనుచిత వైఖరిని అవలంభిస్తున్నాయని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని ఆరోపించారు. ఓ భారీ కుట్రలో భాగంగానే రైతులను రెచ్చగొట్టారని, దీనితో వారు ఢిల్లీ సమీపంలో వచ్చి చేరారని వ్యాఖ్యానించారు. ఇదంతా కూడా ప్రతిపక్షాల కుట్రలో భాగమే అని విమర్శించారు. కొత్త చట్టాలు వస్తే ఉన్న భూములను లాక్కుంటారని ప్రతిపక్షాలు అన్నదాతలను బెదిరిస్తున్నారని ప్రధాని తెలిపారు. దేశ రాజధాని శివార్లలోచాలా రోజులుగా రైతుల నిరసనలు పలు విధాలుగా జరుగుతూ వస్తున్నా ప్రధాని మోడీ ఇప్పటివరకూ వీటిపై ఎక్కడా మాట్లాడలేదు. మేలు చేసే చట్టాలపై బూచి చూపెడుతు న్నారని అన్నారు. సాగు సంస్కరణలతో చేటు కల్గుతుందని వీటిపై వ్యతిరేక ప్రచారానికి దిగారని అన్నారు. ఇక్కడ తాను రైతులకు ఒక్కటే ప్రశ్న వేస్తున్నానని ‘మీరు పాడి సేకరణ కేంద్రాల యాజమానులకు పాలు విక్రయిస్తూ ఉంటే వారు ఏకంగా వచ్చి మీ పాడిపశువులను లాక్కుని పోతారా?’ అని అన్నారు.

ప్రతిపక్షాలు వారు అధికారంలో ఉన్నప్పుడు సాగుసంస్కరణలకు మొగ్గు చూపారు. ఇప్పుడేమో వారి రాజకీయ స్వార్థం కొద్ది వీటిని వ్యతిరేకిస్తున్నారని, పైగా రైతుకు వీటి విషయంలో మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విషయంపైనా సరైన నిర్ణయం సకాలంలో తీసుకోలేని గత సర్కారు హయాంల్లో రైతుకు ఒరిగిందేమీ లేదన్నారు. రైతులకు ఈ చట్టాలపై ఎటువంటి అనుమానాలు, అపోహలు ఉన్నా, తమ ప్రభుత్వం వీటిని తీర్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు దేశ రాజధానిలోని వివిధ సరిహద్దుల వద్ద భైఠాయించారు. పాల కేంద్రం, హైబ్రిడ్ రిన్యూవబుల్‌ఎనర్జీ పార్క్‌లకు కూడా శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని మోడీ వివిధ వర్గాల వారితో, ప్రత్యేకించి గుజరాత్ రైతులతో సమావేశం అయ్యారు. సాగు చట్టాల స్వరూపం ఇతర విషయాలను రైతులతో ముచ్చటించారు.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే సాగు చట్టాలను తీసుకువచ్చినట్లు, వీటిపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని రైతులకు ప్రధాని తెలిపారు. కచ్ జిల్లాలోని మాండ్వీ ప్రాంతంలో సముద్ర జలాల శుద్ధికి ప్రత్యేక ప్లాంట్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తూ గుజరాత్‌ను ఆనుకుని ఉన్న విస్తారిత తీర ప్రాంతపు వనరులను సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ఇక్కడి ప్లాంట్‌తో రోజుకు పదికోట్ల లీటర్ల నీటి శుద్ధి జరుగుతుంది. గుజరాత్‌లో నీటి కొరతను తీర్చేందుకు మార్గం ఏర్పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. పునరుత్థాన ఇంధన పార్క్‌ను ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మిస్తున్నారు. విఘాకోట్ గ్రామానికి సమీపంలో తలపెట్టిన ఈ ప్లాంట్‌తో 30 జిడబ్లుల ఇంధనం ఉత్పత్తి అవుతుంది. ఇది 72600 హెక్టార్లలో విస్తరించుకుని ఉంది. అంజర్ వద్ద ఉన్న సర్హద్ డెయిరీ వద్ద పూర్తి స్థాయి ఆటోమోటిక్ పాల సేకరణ, ప్యాకింగ్ కేంద్రానికి కూడా ప్రధాని ఈ సందర్భంగా పునాది రాయి వేశారు. మిల్క్ ప్రాజెక్టుకు రూ.121 కోట్ల వ్యయ అంచనా వేశారు. ఈ కేంద్రం పూర్తి అయితే ఇక్కడ రోజుకు రెండు లక్షల లీటర్ల పాల ప్రాసిసింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు.

PM Modi Slams Oppn over Farmers Protest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News