Saturday, April 27, 2024

మణిపూర్ మంటలు చల్లారడం మోడీకి ఇష్టం లేదు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈ దేశ ప్రధానమంత్రి మణిపూర్ గురించి పార్లమెంట్‌లో అలా మాట్లాడడాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నానని కాంగ్రెస్ అగ్రనేత; వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశం గురించి పార్లమెంట్‌లో మాట్లాడలేదని, తన ఆలోచనలు, తన రాజకీయాలు, తన ఆశలు, ఆకాంక్షల గురించే చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు.

భారత మాతపై ఎక్కడైనా, ఎప్పుడైనా దాడి జరిగితే కాపాడేందుకు తాను అక్కడ ఉంటానని రాహుల్ ప్రకటించారు. ప్రధాని మోడీ ఇప్పటివరకు మణిపూర్‌ను సందర్శించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పుడైనా ప్రధాని మణిపూర్ వెళ్లవచ్చని, రెండు తెగలకు చెందిన ప్రజలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చని రాహుల్ అన్నారు. అయితే ఆ ఉద్దేశం ఏదీ ప్రధానిలో కనపడడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 2024లో మోదీ మళ్లీ ప్రధాని అవుతారా కాదా అన్నది ఇక్కడ ప్రశ్న కాదని, పిల్లలు, మహిళలతోసహా ప్రజలు దారుణంగా హత్యకు గురవుతున్న మణిపూర్ గురించేనని రాహుల్ వ్యాఖ్యానించారు.

మొట్టమొదటిసారి పార్లమెంట్ రికార్డుల నుంచి భారతమాత పదాన్ని తొలగించారని, ఇది దేశానికే అవమానకరమని రాహుల్ అన్నారు. భారతీయ సైన్యం తలచుకుంటే రెండు రోజుల్లో ఈ నాటకాన్ని ముగించగలదని, కాని మణిపూర్ తగలబడడాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు.

గత 19 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, దేశంలోని అన్ని రాష్ట్రాలను సందర్శించానని రాహుల్ తెలిపారు. అయితే మణిపూర్ అంత దారుణ పరిస్థితిని తాను ఎక్కడా చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో హింసాకాండ చాలా నెలలుగా కొనసాగుతోందన్న వాస్తవాన్ని ప్రధాని మోడీ మరిచిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న లోక్‌సభలో ప్రధాని 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగిచారని, అయితే మణిపూర్ గురించి 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారని రాహుల్ గుర్తు చేశారు. గత కొద్ది నెలలుగా మణిపూర్ తగలబడుతోందని,మారణకాండ కొనసాగుతూనే ఉందని, మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, కాని ప్రధాని మోడీ మాత్రం పగలబడి నవ్వుతూ, జోకులు పేలుస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News