Monday, May 6, 2024

భరతమాత తల ఎత్తుకునే విధంగా పనిచేయాలి: పోచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను  తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశ‌, విదేశాలలో నివసిస్తున్న భారతదేశ ప్రజలకు హృదయపూర్వక 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం అనేది కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా 135 కోట్ల మంది భారతీయులు జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు.  ఎందరో మహానుభావుల, పోరాట యోదుల త్యాగాల ఫలితమే నేటి మన స్వేచ్ఛ ఫలాలు అని,  మహాత్మాగాంధీ శాంతియుత పోరాటం, అహింసాయుత మార్గంలో స్వాతంత్ర్య సాదించుకున్నామని,  ప్రగతిశీల, సంక్షేమ పరిపాలన అందించడానికి మనమందరం పునరంకితం కావాలన్నారు.

స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలన్నారు. ప్రజలందరి మోహాలలో చిరునవ్వులు వికసించాలని, నాయకులు సేవలను అందించడంలో పోటి పడాలని, అంతేకానీ విమర్శించడం, అడ్డంకులు సృష్టించడం సరికాదని హితబోధ చేశారు.  భరతమాత తలెత్తుకునే విధంగా పనిచేయాలని, తలదించుకునేలా ప్రవర్తించకూడదన్నారు. మహాత్మాగాంధీ అహింసా మార్గం స్పూర్తితో కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం సాదించారని,  దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.  అన్ని రంగాలలో రాష్ట్ర ప్రగతి పథంలో ముందుకు వెళ్తోందని,  సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయని, అందరూ ఆనందంగా ఉండటమే బంగారు తెలంగాణ ఆశయమన్నారు. ప్రభుత్వంలోని అధికారులు, సిబ్బంది అందరూ పనిచేస్తున్నారని,  అందుకే అభివృద్ధి ఫలాలు క్షేత్ర స్థాయి వరకు చేరుతున్నాయని పోచారం ప్రశంసించారు.  రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసు శాఖ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.  అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలుచేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి అభినందనలన్నారు.  ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ వి. భూపాల్ రెడ్డి, శాసనమండలి సభ్యులు వాణీ దేవి, రఘోత్తమ రెడ్డి, విజీ గౌడ్, తేరా చిన్నప్ప రెడ్డి, కే. జనార్దన్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, చీఫ్ మార్షల్ కర్ణాకర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News