Saturday, April 27, 2024

కాంగ్రెస్‌ను కాంగ్రెస్ వాళ్ళు బతకనిస్తారా?

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్ వచ్చారు. కాంగ్రెస్ సీనియర్‌లు, అధ్యక్షుని మధ్య పోరులో ఇంచార్జ్ వికెట్ పడిపోయింది. మాణిక్యం ఠాకూర్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రే వచ్చారు. పేరులో కూడా స్వల్ప తేడానే ఉంది. కొత్త ఇంచార్జ్ వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ నాయకుల తీరు మారిపోతుందనేమి లేదు. ఎన్నికలకు ఇంకో ఏడాది సమయమే ఉండగా వరుసగా రెండు సార్లు ఓటమి తరువాత కూడా కాంగ్రెస్ అంతర్గత పోరాటాల్లో మార్పేమీ లేదు. కాంగ్రెస్‌లో కలహాలు ఇదే మొదటి సారేమీ కాదు. కలహాలు కాంగ్రెస్ సహజ లక్షణం. రాక్షసులకు, దేవతలకు చిత్రవిచిత్రమైన వరాలు ఉంటాయి. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్య కశ్యపుడు మరణాన్ని తప్పించుకోవడానికి అనేక వరాలు పొందుతాడు. ఉదయం కానీ, సాయంత్రం కానీ, ఇంటి బయట, ఇంటి లోపల, మనిషి, జంతువు ఎవరి చేతిలోనూ మరణం లేకుండా వరం పొందుతాడు.

భస్మాసురుడు సైతం ఇలానే తన చేయి ఎవరి తలపై పెడితే వారు పోయేట్టుగా వరం పొందుతాడు. ఇలాంటి వరాలు కూడా వారిని రక్షించలేకపోయాయి. ఎన్ని వరాలు ఉన్నా తమ ప్రాణాలు కాపాడుకోలేక పోయా రు. తండ్రి మరణానికి ప్రహ్లాదుడే కారణం అయినట్టు కాంగ్రెస్ పార్టీ సైతం తన బిడ్డల చేతిలోనే చావు దెబ్బ లు తింటోంది. తన బిడ్డల బలమే కాంగ్రెస్ పాలిట శాపంగా మారుతోంది. ఇందిరా గాంధీ హత్య తరువాత వెల్లువెత్తిన సానుభూతితో రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారం లోకి వచ్చింది.

అప్పుడు పార్లమెంట్‌లో ఒక ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. ఎన్‌టిఆర్‌ను నాదెండ్ల భాస్కర్ రావు గద్దె దించడం వల్ల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టిడిపి ఆంధ్ర ప్రదేశంలో మెజారిటీ సాధించి పార్లమెంట్‌లో ప్రతిపక్షం స్థానం లో నిలిచింది. నాదెండ్ల ఎపిసోడ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో సైతం కాంగ్రెస్ మెజారిటీ పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉండేది. ప్రతిపక్షానికి స్థానంలేని విధంగా విజయం సాధించిన కాంగ్రెస్ క్రమంగా ఇప్పుడు పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదాకు అవసరం అయిన సీట్లు కూడా సాధించలేకపోయింది. ఒక వైపు మతం ఆయుధంగా బిజెపి దూసుకెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ తమలో తాము కీచులాడుకునే స్థాయిని దాటి పోవడం లేదు. కాంగ్రెస్ లక్షణాలే కాంగ్రెస్‌కు శాపంగా మారుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను దెబ్బ తీస్తే మరికొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ద్వారా ఎదిగిన వారే కాంగ్రెస్‌కు అడ్రెస్ లేకుండా చేస్తున్నారు.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీగా జగన్ అధికారంలోకి వచ్చినా అది కాంగ్రెస్ బలమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నాయకునిగానే వైయస్‌ఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తన పదవీ కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ స్థాపించేట్టు చేశాయి. వైయస్‌ఆర్ పాలనే జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చాయి. వైయస్‌ఆర్‌కు కాంగ్రెస్ అవకాశం ఇవ్వక పోతే అయన ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. ముఖ్యమంత్రిగా వైయస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే జగన్ పార్టీకి ప్రచార అస్త్రాలుగా మారాయి. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా వైయస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఒక ప్రాంతీయ పార్టీ నాయకునిగా వ్యవహరించారు. మంత్రి వర్గంలో పిజెఆర్ ఒక్కరి పేరే సోనియా గాంధీ సూచించారు. అయినా అతనికి మంత్రి పదవి ఇవ్వలేదు. అంతటి స్వేచ్ఛ ఇచ్చారు. వై యస్‌ఆర్‌కు అంత అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌కు ఇప్పుడు దాని వల్లనే ఆంధ్రాలో అడ్రెస్ లేకుండా పోయింది.

జగన్ ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయడం తో అప్పటి వరకు కాంగ్రెస్—లో ఉన్న వారంతా ఆ పార్టీ లో చేరిపోయారు. రాష్ట్ర విభజనకు ముందుగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్‌కు సైతం ఎంతో కొంత స్థానం కల్పించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ వల్ల ఆంధ్రలో కాంగ్రెస్‌కు స్థానం లేకుండా పోయింది. పశ్చిమ బెంగాల్‌లో సైతం ఇంతే. కాంగ్రెస్ ద్వారా ఎదిగిన మమతా బెనర్జీ, బయటకు వెళ్లి తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసుకొని అధికారంలోకి రావడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు స్థానం లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌కు చోటు లేకుండా చేసిన జగన్, మమత పార్టీల పేరులో కాంగ్రెస్ ఉండడం విశేషం.
కాంగ్రెస్‌లో బలమైన నాయకులను ప్రోత్సహిస్తే వారు బయటకు వెళ్లి కాంగ్రెస్‌కే స్థానం లేకుండా చేస్తున్నారు. ప్రోత్సహించకపోతే కాంగ్రెస్ చతికిలపడిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక రకంగా కాంగ్రెస్ డియన్ ఏ నే అధికారంలో ఉంది.

ఇక్కడ కాంగ్రెస్ కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలుగుదేశం ద్వారానే గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి పార్టీలోకి వస్తూనే పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. అప్పటి వరకు ఎంతో కాలం నుంచి పార్టీలో ఉన్న వారికి ఇది మింగుడు పడలేదు. దానికి తోడు రేవంత్ రెడ్డి వన్ మాన్ షో కాంగ్రెస్‌లో వివాదాలకు దారి తీసింది. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం సీనియర్ లకు కోపం తెప్పించింది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఇంచార్జ్‌ను తప్పించారు. పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆంధ్ర, బెంగాల్ తరహాలో బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకొంటారు కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? అనేది సీనియర్‌లను సమర్ధించే వారి వాదన. అన్నింటికి అడ్డు తగిలితే కాంగ్రెస్ ఎలా బలపడుతుంది అనేది రేవంత్ ను సమర్థిస్తున్న వారి వాదన. దేశమంతా సమస్యలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ తెలంగాణలో సైతం అదే పరిస్థితి, కాంగ్రెస్‌కు కాంగ్రెస్ లక్షణాలే శాపంగా మారుతున్నాయి.

బుద్దా మురళి- 9849998087

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News