Monday, April 29, 2024

రూపాయి పతనం!

- Advertisement -
- Advertisement -

మన జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) ఏటా పెరుగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఘనంగా ప్రకటించిన సమయంలోనే డాలర్‌తో రూపాయి విలువ గత 10 మాసాల కాలంలో ఎన్నడూ పడనంత స్థాయికి పతనమైంది. ఈ ఆగస్టు 14 ఉదయం డాలర్‌కు 83.06 రూపాయలైంది. ఇది ఇంతకు ముందు ముగిసిన రూ. 82.84 కంటే 0.25 శాతం తక్కువ. 2022 అక్టోబర్ 20న రికార్డయిన గరిష్ఠ పతనం రూ. 83.08కి ఇప్పుడు అతి చేరువలో వున్నది. భవిష్యత్తులో పతన వేగం పెరిగి రూపాయి విలువ మరింతగా దిగజారే ప్రమాదం లేకపోలేదు. రూపాయి విలువ పడిపోయినప్పుడు విదేశీ మార్కెట్లలో భారతీయ సరకులు చవక అవుతాయి.

అదే సమయంలో అక్కడ రూపాయి కొనుగోలు శక్తి పడిపోడం వల్ల మనం దిగుమతి చేసుకొనే సరకులకు పూర్వం కంటే అధికంగా చెల్లించవలసి వస్తుంది. మన ఎగుమతులు, దిగుమతుల స్థాయిని బట్టి డాలర్‌తో రూపాయి విలువ ప్రభావం వుంటుంది. మనం వినియోగిస్తున్న క్రూడాయిల్ (పెట్రోల్, డీజెల్ వగైరా) 85% మేరకు, గ్యాస్ 50% మేరకు దిగుమతి చేసుకొంటున్నాము. డాలర్‌తో రూపాయి విలువ పడిపోడం వీటి ధరను నిస్సందేహంగా పెంచుతుంది. రూపాయి పతనం వల్ల మన సాఫ్ట్‌వేర్ సేవల, జౌళి ఉత్పత్తుల ఎగుమతుల విలువ పెరుగుతుంది. డాలరు అంతర్జాతీయ మారకపు కరెన్సీ కావడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో దానితో ముడిపడిన మిగతా అనేక దేశాల కరెన్సీల విలువ దాని విలువ పెరగడం, తరగడం మీద ఆధారపడి వుంటుంది. మన ఎగుమతుల కంటే దిగుమతుల ఖర్చే ఎక్కువ కావడం వల్ల రూపాయి విలువ పతనం మన ఆర్థిక వ్యవస్థ మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది.

అమెరికన్ డాలర్ విలువ అదనంగా 4.16 శాతం మేరకు విజృంభించడం వల్లనే మిగతా కరెన్సీలు దెబ్బతిన్నాయి. అలా దెబ్బతిన్న కరెన్సీ ఒక్క మన రూపాయే కాదు. చైనీస్ యువాన్ కూడా 0.29 శాతం దెబ్బతింది. ఇంకా ఇండోనేసియా, దక్షిణ కొరియా, మలేసియా, తైవాన్, థాయ్‌లాండ్, సింగపూర్ కరెన్సీలు కూడా నష్టపోయాయి. డాలర్ మాదిరిగానే రూపాయిని అంతర్జాతీయ మారకపు కరెన్సీగా చేయాలనే ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినందున డాలరేతర కరెన్సీల మధ్య మారకపు సంబంధాలు పెరిగే అవకాశాలు కలిగినట్టు భ్రమ పడ్డారు. కాని రష్యాయే రూపాయి చెల్లింపులకు క్రూడాయిల్ ఇచ్చే విషయంలో వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. చైనా యువాన్, యూరపు దేశాల యూరో కూడా అంతర్జాతీయ మారకపు కరెన్సీలు కావాలని ప్రయత్నిస్తూ విఫలమవుతున్నాయి.

దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడం మీదనే రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా బలపడడం ఆధారపడి వుంటుంది. అందుచేత రూపాయిని దేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో ముడిపెట్టినందువల్ల దానికి తగిన ఆదరణ లభించదు. దేశ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో మూడవ స్థానానికి ఎదుగుతున్నదని చెప్పుకోడం వల్ల కూడా ప్రయోజనం వుండదు. డాలర్‌తో రూపాయి విలువ గత కొంత కాలంగా దిగజారుతూనే వుంది. మధ్యలో ఎప్పుడో ఒకసారి కొంచెం పెరిగినప్పటికీ మొత్తంగా చూసుకొన్నప్పుడు డాలర్‌తో రూపాయి దిగజారుడే అధికంగా వున్నది. మనం దిగుమతి చేసుకొంటున్న సరకులను దేశీయంగా ఉత్పత్తి చేసుకోగలిగితే రూపాయి పతనం నుంచి రక్షణ పొందవచ్చు. కాని అది ఇంత వరకు జరగలేదు. రూపాయి పతనం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో మన సరకులు చవక అవుతాయి. వాటికి గిరాకీ వుంటే వాటి ఎగుమతులు పెరుగుతాయి. కాని మన సరకులకు బయటి దేశాల్లో గల గిరాకీ చెప్పుకోదగినంత స్థాయిలో లేదు.

నాణ్యమైన సరకులను ఉత్పత్తి చేయగలిగినప్పుడే వాటికి విదేశాల్లో మంచి గిరాకీ ఏర్పడుతుంది. కరెన్సీల విలువ ఆయా దేశాల్లోని ద్రవ్యోల్బణ స్థాయి మీద కూడా ఆధారపడి వుంటుంది. చైనాలో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులు చేస్తున్న ప్రముఖ బహుళ జాతి సంస్థలను మన దేశానికి రప్పించడం కోసం ప్రధాని మోడీ చేసిన కృషి ఆశించినంతగా ఫలించలేదని రుజువవుతున్నది. దేశీయ పరిశ్రమ కు విదేశాల్లో గిరాకీని సాధించే స్థాయి నాణ్యత గల ఉత్పత్తులు చేసే సామర్థం లేదు. ఎలెక్ట్రిక్ వాహనాలను ఉపయోగించి డీజెల్, పెట్రోల్ అవసరాన్ని తగ్గించుకోగలిగితే క్రూడాయిల్ దిగుమతి భారం 90శాతం తగ్గుతుందంటున్నారు. అలాగే హరిత హైడ్రోజన్ ఆధారంగా, ఎలెక్ట్రిసిటీ ఆధారంగా పరిశ్రమలు నడిపితే కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్న పారిశ్రామిక బొగ్గు అవసరం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. ఇటువంటివన్నీ జరగాలంటే బిజెపి పాలకులు మత ప్రాతిపదిక మీద ప్రజలను విభజించి , విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలి. మత కులాలకు అతీతంగా దేశంలో గల యువ శక్తిని ఆర్థిక సామర్థం పెంచుకొనే వైపు మళ్ళించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News