Monday, April 29, 2024

ఆగని ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ.. హైదరాబాద్ లో మరో దారుణం..

- Advertisement -
- Advertisement -

ఆగని ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ పర్వం
ప్రభుత్వం హెచ్చరించిన మారని యాజమాన్యం వక్రబుద్ది
శవాలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న దారుణాలు
చికిత్స పేరుతో రూ.7లక్షలు తీసుకుని బెదిరింపులు
గురువారం బయటపడ్డ మరో కార్పొరేట్ ఆసుపత్రి బాగోతం

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా రోగులకు చికిత్స అందించే ప్రైవేటు ఆసుపత్రుల దారుణాలు రోజుకు రోజుకు మీతిమిరిపోతున్నాయి. వైద్యశాఖ అధిక ఫీజులు తీసుకోవద్దని పలుమార్లు హెచ్చరించిన యాజమాన్యాలు వక్రమార్గంలో వెళ్లుతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లక్షల రూపాయలు తీసుకుంటూ చివరకు శవాలను అప్పగించి, వైద్యశాఖకు ఫిర్యాదు చేయవద్దని బెదిరింపులకు గురిచేస్తున్నారు. రెండు నెలల క్రితం న్యాయస్థానం కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకంపై ఆగ్రహం వ్యక్తం చేసి అడ్డగోలుగా చార్జీలు వేసే దవాఖానలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయిన యాజమాన్యాలు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకులు అండ చూసుకుని చెలరేగిపోతున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. నెల రోజు క్రితం రెండు కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం వేటు వేసింది. 38 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. అయిన ఆసుపత్రులు జేబులు నింపుకునే దందాల్లో రాటుదేలిపోతున్నారు. మూడు నెలల క్రితం గచ్చిబౌలిలో ఓ పేరుమోసిన ఆసుపత్రి వారం రోజుల వైద్యం చేసి రోగి మరణించిన తరువాత రూ.7లక్షల బిల్లు వసూలు చేశారు. ఈ సంఘటన మరువక ముందే మలక్‌పేటలోని మరో ఆసుపత్రి నిర్వహకులు ఫీవర్ ఆసుపత్రి వైద్యురాలికి ఒకరోజు చికిత్స చేసి రూ.1.40లక్షలు బిల్లు చెల్లించాలని నిర్భందించారు.

తరువాత సోమాజిగూడలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రి యాజమాన్యం అదే దారిలో వెళ్లి రోగుల ప్రాణాల బలిగొనడంతో పాటు తాము అడిగినంత బిల్లు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని బెదిరింపులకు గురిచేయడంతో ప్రజాసంఘాలు జోక్యం చేసుకుని ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్యసేవలు నిలిపివేసింది. మూడు రోజుల తరువాత గచ్చిబౌలికి చెందిన విరంచి ఆసుపత్రికి కరోనా సేవల అనుమతి రద్దుచేసింది. ఆగస్టు 29న మలక్‌పేటకు చెందిన కార్పొరేట్ ఆసుపత్రి మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ మహిళ ఉద్యోగి కాన్పు కోసం వస్తే, కరోనా సోకిందని, వారం రోజులు చికిత్స చేసి రూ.29లక్షలు బిల్లు వేసి చివరికు ఆమె మృతదేహాన్ని భర్తకు అప్పగించింది. తాజాగా బంజారాహిల్స్‌లో ప్రధాన రహదారిపై ఉన్న మరో ఆసుపత్రి కరోనా సోకిన వ్యక్తికి వైద్యం చేసి రూ.7లక్షలు బిల్లు తీసుకుని, రోగి మృతిచెందాడని చెప్పి, తమ ఆసుపత్రిపై ఎక్కడ ఫిర్యాదు చేయమని హామీ ఇస్తే శవాన్ని అప్పగిస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆసుపత్రి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని వైద్యశాఖ అధికారులను కోరుతున్నారు.

Private hospital Rs 7 lakhs bill to corona patient in Banjara Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News