Wednesday, May 1, 2024

గిరిజనులకు వందశాతం రిజర్వేషన్లు కల్పిస్తాం

- Advertisement -
- Advertisement -

minister sathyavathi

 

హక్కుల రక్షణలో రాజీ పడేది లేదు
న్యాయ సలహా, నిపుణులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయ సేకరణ చేస్తాం
ఎపిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళతాం
జిఓ ఎంఎస్ 3పై ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌కు సమగ్ర కసరత్తు
అధికారులతో గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష

మనతెలంగాణ/ హైదరాబాద్ : గిరిజనులకు వందశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, జిఓ ఎంఎస్ 3పై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడానికి ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తు చేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. షెడ్యూల్ ఏరియాలోని గిరిజనులకు టీచర్ పోస్టుల్లో వందశాతం రిజర్వేషన్లు కల్పించే (జిఓ ఎంఎస్ నెంబర్ 3) రాజ్యాంగ విరుద్ధమంటూ చెబ్రోలు లీలా ప్రసాద్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ నెల 22వ తేదీన కేసును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సమగ్ర రివ్యూ పిటిషన్ వేయడానికి దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి క్రిస్టినా, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డిలతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు రివ్యూ పిటిషన్‌పై పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని, త్వరలోనే పిటిషన్ వేయనున్నట్టు సత్యవతి రాథోడ్ తెలిపారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దీనిని కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేసే రివ్యూ పిటిషన్ సమగ్రంగా ఉండాలన్న ఉద్ధే శ్యంతో దీనిపై న్యాయ సలహా, నిపుణులు, ప్రజాప్రతినిధులు, గిరిజన ముఖ్యుల సలహా తీసుకుని పిటిషన్ తయారు చేస్తు న్నట్లు ఆమె తెలిపారు.
సాయం చేయాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రికి విజ్ఞప్తి

గిరిజనుల హక్కులను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదని, వారి ప్రయోజనాలు కాపాడి వారి సమగ్ర అభివృద్ధి కోసం అన్ని చర్యలు చేపడుతామని మంత్రి వెల్లడించారు. జిఓ ఎం.ఎస్ 3పై రివ్యూ పిటిషన్ వేయడానికి ఇప్పటికే ప్రభుత్వం తరపున నివేదిక రూపకల్పన జరుగుతోందని, త్వరలోనే ఈ పిటిషన్‌కు సంబంధమున్న అన్ని వర్గాల వారి అభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. షెడ్యూల్ ఏరియాలోని టీచర్ల పోస్టులను వందశాతం అక్కడి గిరిజనులతోనే భర్తీ చేయాలన్న జిఓ ఎంఎస్ 3 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో వచ్చిన ఉత్తర్వులు రెండు రాష్ట్రాలకు సంబంధించింది కావడంతో దీనిపై రెండు రాష్ట్రాలు సంప్రదింపులు చేస్తున్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని గిరిజనుల హక్కులను కాపాడేందుకు ఈ పిటిషన్ రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇంకా వెనుకబడి ఉన్న గిరిజనుల హక్కులను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ఇప్పటికే కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాను కోరినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్రంలోని గిరిజనులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని, గిరిజనుల హక్కులు, ప్రయోజనాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కట్టుబడి ఉన్నారని, ప్రభుత్వానికి అందరూ సహకరించాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.

 

Provide 100% reservation for Tribals
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News