Saturday, April 27, 2024

కష్టానికి ఫలితం దక్కింది

- Advertisement -
- Advertisement -

PV Sindhu says on Tokyo 2020 bronze

తెలుతుతేజం సింధు

టోక్యో: ఒలింపిక్స్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కష్టానికి తగిన ఫలితం పతకం రూపంలో దక్కిందని భారత బ్యాడ్మింటన్ ఆణిముత్యం, తెలుగుతేజం పి.వి.సింధు పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం ద్వారా సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. సోమవారం సింధు కోచ్ పార్క్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సమయంలో లభించిన విరామాన్ని ఆటను మెరుగు పరుచుకోవడం కోసం ఉపయోగించుకున్నా. ఫిట్‌నెస్ మెరుగు పరుచుకోవడంతో పాటు ఆటలోని లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించా. ఇక తన లోపాలను సరిదిద్ది తాను మళ్లీ పూర్వ వైభవం సాధించడంలో కోచ్ పార్క్ పాత్ర కీలకమైన పేర్కొంది. ఇక గచ్చిబౌలి స్టేడియంలో నిరంతర సాధన చేయడం కూడా తనకు కలిసి వచ్చిందని వివరించింది.

ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించి పెట్టాలనే ఉద్దేశంతోనే తాను రెండేళ్లుగా తీవ్రంగా శ్రమించానని తెలిపింది. అందులో సఫలం కావడం గర్వంగా ఉందని సింధు వ్యాఖ్యానించింది. స్వర్ణం సాధించాలని భావించినా మెరుగైనా క్రీడాకారిణి చేతిలో ఓడిపోక తప్పలేదని వాపోయింది. తన శక్తి మేరకు పోరాడినా పరాజయం ఎదురైందని బాధ వ్యక్తం చేసింది. అయితే కాంస్యం కోసం జరిగిన పోరులో విజయం సాధించడం ఎంతో ఊరటనిచ్చిందని తెలిపింది. దేశానికి పతకం తీసుకురావడం గర్వంగా ఉందని పేర్కొంది. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఆటను కనబరచడమే లక్షంగా పెట్టుకున్నట్టు సింధు స్పష్టం చేసింది.

గోపీ సర్ అభినందించారు..

ఇక పతకం సాధించిన వెంటనే ప్రధాన కోచ్ గోపీచంద్ ఫోన్ చేసి అభినందించారని వివరించింది. ఆయన నుంచి ఫోన్ రావడం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపింది. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో గోపీ సర్ పాత్ర ఎంతో ఉందని సింధు అభిప్రాయపడింది. అయితే తన సహచర షట్లర్ సైనా నెహ్వాల్ నుంచి ఎలాంటి సందేశం రాకపోవడం కాస్త నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News