Tuesday, September 26, 2023

పూర్తి టీకా ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

Vaccines should be made available to all

ఏడాదిన్నరగా పీడిస్తున్న ప్రాణాంతక కరోనా కొత్త కొత్త వికృతావతారాలతో ప్రపంచాన్ని మరింతగా పీల్చి పిప్పి చేస్తున్నది. అటు ప్రపంచ వ్యాప్తంగానూ, ఇటు దేశంలోనూ కేసులు తిరిగి పెరుగుతున్నాయన్న సమాచారం బెంబేలెత్తిస్తున్నది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ 130కి పైగా దేశాల్లో తడాఖా చూపిస్తున్నది. అమెరికా, చైనా, యూరప్ దేశాలు మళ్లీ గడగడలాడుతున్నాయి. జులై 19-25 తేదీల మధ్య24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన అదనపు కరోనా కేసుల సంఖ్య 38 లక్షలు. ఇది అంతకు ముందు వారం కంటే 8 శాతం ఎక్కువని ఐక్యరాజ్య సమితి ఆరోగ్య విభాగం గత బుధవారం నాడు చెప్పింది. జులై 31 ఆగస్టు 1 మధ్య 24 గం॥ల్లో ఇండియాలో 41,831 కొత్త కేసులు నమోదయ్యాయి. 541మంది మరణించారు. కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా ఉంటున్నప్పటికీ కేసుల తీవ్రత, మృతుల సంఖ్య ఆందోళనకరంగానే కొనసాగుతున్నాయి. దేశంలో 10 రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10కి మించి పోయిందని అక్కడ ఆంక్షలు కఠినతరం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇచ్చినట్టు సమాచారం.

ఒకవైపు సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదన్న సమాచారం, మరొకవైపు మూడో కెరటం జన జీవితాల్లోకి లంఘించి నానాబీభత్సం సృష్టించే సమయం ఎంతో దూరంలో లేదన్న వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్లు అనివార్యమైతే దేశం ఆర్థికంగా ఇంకెంత దెబ్బతినిపోతుందో, జనాభాలో అత్యధికంగా గల పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోయి మరెంత దయనీయ స్థితి ఎదుర్కోవలసి ఉంటుందో తలచుకుంటేనే భయం కలుగుతోంది. సెకండ్ వేవ్ ఎంతటి ప్రాణ నష్టాన్ని కలిగించిందో ప్రజలు ఎంతగా శోకభాండాలైపోయి, మానవ సంబంధాలు పూర్తిగా తెగిపోయి ఎటువంటి నిరాశామయ వాతావరణంలో బతకవలసి వచ్చిందో ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉంది. అటువంటి దుస్థితి మళ్లీ అనివార్యమవుతుందా, దానిని తప్పించుకోడానికి సర్వసన్నద్ధులం కాగలుగుతామా? వరుసగా రెండు విడతల కొవిడ్ ప్రళయాన్ని అనుభవించిన గతం నుంచి నేర్చుకున్న గట్టి పాఠాలేమైనా ఉన్నట్టయితే మూడో వేవ్‌ను దూరంగా ఉంచగలుగుతాము. ఆ పాఠాల నుంచి అలవర్చుకున్న మెళకువలను ప్రయోగించి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.

దేశ జనాభాలో 60 శాతం మందిలో యాంటీబాడీలున్నాయని ఇటీవలి సీరో సర్వే తెలియజేసింది. అంటే ఇంకా 40 శాతం మంది కొవిడ్ కోరల్లో చిక్కుకొనే ప్రమాదంలో ఉన్నారని స్పష్టపడుతుంది. ఈ దశలో మూడో వేవ్ ముప్పు నుంచి దూరంగా ఉండగలగడానికి గల ఏకైక మార్గం అందరికీ టీకాలు పూర్తిగా అందేలా చూడడమే. అదొక్కటే తరణోపాయం. అయితే దేశంలో ప్రజలకు టీకాలు అందుతున్న తీరు అత్యంత అధ్వానంగా ఉంది. ఇప్పటి వరకు రెండు డోసులూ తీసుకున్న వారు 10 కోట్ల 40 లక్షల మందేనని అధికారిక సమాచారం. దేశ జనాభా దాదాపు 140 కోట్లు. ఇందులో 18 ఏళ్ల లోపు పిల్లలను తీసేస్తే దాదాపు 90 కోట్ల మంది పెద్ద వారున్నారు. వీరందరికీ ఈ సంవత్సరం ముగిసే లోగా పూర్తి టీకాలు వేయగలుగుతామని కేంద ప్రభుత్వం ప్రకటించింది. ఈ లక్షం చేరుకోవాలంటే ఇప్పటి నుంచి రోజుకి 90 లక్షల మందికి టీకాలు వేయవలసి వస్తుంది. మొదటి డోసు వేసుకున్న వారు రెండో దాని కోసం ఎదురు చూసి నిరాశకు గురి అవుతున్న చేదు వాస్తవాన్ని ఎవరూ కప్పివేయలేరు. ప్రస్తుతం రోజుకి 40 లక్షల డోసుల టీకాలు వేస్తున్నట్టు సమాచారం.

ఈ పద్ధతిలో సంవత్సరాంతానికి వయోజనులందరికీ టీకాలు పూర్తిగా వేయగలగడం సాధ్యం కాదు. ఈలోగా తక్షణమే విరుచుకుపడే సూచనలు కనిపిస్తున్న మూడో వేవ్ నుంచి కాపాడుకోడమనే మహత్తర లక్షం దుస్సాధ్యమే. టీకాలు తయారు చేయడానికి అవసరమైన ముడి సరకు లభ్యత కూడా ఒక కీలకమైన అంశం. ఎంతో ముందు నుంచి సరైన పథక రచన చేసుకొని ముడి సరకు తెప్పించుకొని పెద్ద ఎత్తున టీకా తయారీ చేపట్టి ఉంటేగాని మన వంటి అత్యధిక జన సంఖ్య గల దేశంలో అందరికీ రెండు డోసులూ అందేలా చేయడం సాధ్యమయ్యే పని కాదు.

ముందు చూపు లేనితనాన్ని కప్పి పుచ్చుకోడానికి కేంద్ర ప్రభుత్వం టీకాల సరఫరా విషయంలో రాష్ట్రాల వాదనను కొట్టి పారవేసే వైఖరి మాటున తనను తాను రక్షించుకోవాలని చూస్తున్నదని బోధపడుతోంది. జాతీయ స్థాయిలో ఉచిత టీకాలు వేయించే బాధ్యత నుంచి చాలా కాలం తప్పుకొని చివరికి సుప్రీంకోర్టు గట్టిగా మొట్టి కాయలు పెట్టిన తర్వాత ఆ బాధ్యతను తీసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. దాని ప్రభావం టీకాల సరఫరా మీద పడుతున్నదని అనుకోవలసి ఉంది. ఇప్పటికైనా కేంద్రం బాధ్యతను గమనించి సత్వర భారీ ఎత్తున టీకా కార్యక్రమం ద్వారా మూడో వేవ్ నుంచి ప్రజలను కాపాడుతుందని ఆశిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News