Sunday, April 28, 2024

దేశంలో సాధారణం కంటే 7 శాతం తక్కువ…

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు
జూన్, జూలై, ఆగష్టు కలిపి 548.1 మిల్లీమీటర్ల వర్షపాతం
గత సంవత్సరం కన్నా ఇది అధికం
9 జిల్లాలో 60 శాతానికి పైగా….
18 జిల్లాలో 20 శాతం అధిక వర్షపాతం నమోదు

Rain fall less in telangana

మనతెలంగాణ/హైదరాబాద్:  దేశంలో సాధారణం కంటే 7 శాతం తక్కువ వర్షపాతం జూలై నెలలో నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాష్ట్రంలో మాత్రం (జూన్ 01వ తేదీ నుంచి ఆగష్టు 02వ తేదీ వరకు) రాష్ట్రవ్యాప్తంగా 548.1 మిల్లీమీటర్ల వర్షపాతం (గత సంవత్సరం కన్నా) అధిక వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే (గత సంవత్సరం జూన్ 01వ తేదీ నుంచి ఆగష్టు 02వ తేదీ వరకు 453.9 మిల్లీ మీటర్ల) వర్షపాతం మాత్రమే రాష్ట్రంలో నమోదయ్యిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సంవత్సరం (జూన్ 01 నుంచి ఆగష్టు 02వ తేదీ వరకు) రాష్ట్రంలోని 9 జిల్లాలు (203 మండలాల్లో) 60 శాతానికి పైగా వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాలు (249 మండలాల్లో) 20 శాతం అధిక వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా 6 జిల్లాలోని (131 మండలాల్లో) సాధారణ వర్షపాతం నమోదు కాగా, 11 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. గత సంవత్సరం జూన్‌లో 171.6 శాతం, జూలైలో 268.2, ఆగష్టులో 220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ సంవత్సరం జూన్‌లో 194.5, జూలైలో 353, ఆగష్టులో 14.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మొత్తంగా 548.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ పేర్కొంది.

అధిక వర్షపాతం నమోదైన జిల్లాల్లో

అధిక వర్షపాతం నమోదైన జిల్లాల్లో నారాయణపేట, సిద్ధిపేట, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ అర్భన్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, జనగాం, నిజామాబాద్‌లు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలుగా కరీంనగర్, వరంగల్ రూరల్, జోగులాంభ గద్వాల్, మహబూబాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిర్మల్, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, హైదరాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, వికారాబాద్, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలుండగా, సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలో నాగర్‌కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు జిల్లాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

జూలై మొదటి వారంలో రుతుపవనాలు ఊపందుకున్నా

దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు, మేఘాలు విరుచుకుపడటం అదేవిధంగా కొండచరియలు విరిగిపడిన సంఘటనల నేపథ్యంలో వాతావరణ శాఖ (ఐఎండి) జూలై నెలలో వర్షపాత డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, గత నెలలో దేశంలో సాధారణం కంటే 7 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై మొదటి వారంలో రుతుపవనాలు ఊపందుకున్నా, చివరికు జూలై నెల 7 శాతం వర్షపాతం లోటుతో ముగిసిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

మహారాష్ట్ర తీరప్రాంతంలో భారీ వరదలు

జూలై నెలలో మహారాష్ట్ర తీరప్రాంతంలో భారీ వరదలను ఎదుర్కొంది. మధ్య మహారాష్ట్ర, గోవా, కర్ణాటక జులైలో భారీ వర్షాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని అనేక పట్టణాలు, నగరాల్లో భారీ వర్షాల కారణంగా అనేక కొండచరియలు విరిగిపడిన సంఘటనలు జరిగాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర భారత రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్‌లో కూడా క్లౌడ్‌బరస్ట్ సంఘటనలు జరిగాయి. దీనికరణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో కూడా చాలా మంచి వర్షపాతం నమోదైంది. ఇవన్నీ ఉన్నప్పటికీ తక్కువ వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

జూలై, ఆగస్టులో అధిక వర్షపాతం నమోదు

జూన్3వ తేదీన కేరళను రుతుపవనాలు తాకగా, జూలైలో సాధారణ వర్షపాతం ఉంటుందని ఐఎండి అంచనా వేసింది. అయితే జూలై 8 వరకు ఉత్తర భారతదేశంలో ఎక్కడా వర్షాలు లేవు. ఈ కారణంగా లోటు వర్షపాతం నమోదు అయి ఉండవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.

నైరుతి రుతుపవనాలు జూన్ 3 న కేరళను తాకగా, ఇది సాధారణ షెడ్యూల్ కంటే రెండు రోజులు ఆలస్యమని ఐఎండి తెలిపింది. జూన్ 19 నాటికి, ఇది తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాప్తి చెందింది. ఆ తర్వాత అది మందగించాయని, ఈ నేపథ్యంలోనే చాలా ప్రాంతాలు వర్షం కోసం వేచి ఉండాల్సి వచ్చిందని, జూలై 8 నుంచి మళ్లీ రుతుపవనాలు మొదలయ్యాయని ఐఎండి తెలిపింది. గత జూన్‌లో సాధారణం కంటే 10 శాతం ఎక్కువ వర్షం కురిసిందని, సాధారణంగా వర్షాకాలం 4 నెలల సీజన్‌లో, జూలై, ఆగస్టులో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండి తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత ఎక్కువ

తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయని, వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపివది. సూర్యుడు ఉదయించినప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా పడమటి గాలులు వీస్తున్నాయని, వాటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు,

రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా

ఒకటి, రెడు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. పశ్చిమ దిశ నుంచి కింది స్థాయిలో గాలులు వీస్తున్నాయని, ఫలితంగా రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉంటుందన్నారు. రానున్న మూడు రోజులు ఉదయం సమయంలో వాతావరణం ఇలాగే ఉంటుందని, అయితే, మధ్యాహ్నం మాత్రం పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయని ఆమె వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News