Monday, April 29, 2024

వర్షాలు మరి 3రోజులు

- Advertisement -
- Advertisement -

Rains another 3 days in Telangana

నేడు, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో వానలు
మంచిర్యాల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరి దుర్మరణం.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు మంచిర్యాల జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అర్థరాత్రి నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అవసరమయితే తప్పా బయటకు రావద్దని వాతావరణ శాఖతో పాటు విపత్తుల శాఖ నగరవాసులకు హెచ్చరిక జారీ చేసింది.

పలుచోట్ల ఉరుములు, మెరుపులతో…

తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి, నేడు దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కోమరిన్ తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తున కొనసాగుతుందని అధికారులు వివరించారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఈ రోజు గంగా నది పరిసర ప్రాంతాల్లో ఉండి సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి.మీ వరకు కొనసాగుతుందని వారు వివరించారు. దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన….

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 97 మిల్లీమీటర్లు, మంచిర్యాలలో 82, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 774, సిద్దిపేటలో 57, జగిత్యాలలో 54, నిజామాబాద్‌లో 47, వరంగల్ అర్భన్‌లో 35, నిర్మల్‌లో 37, ఆదిలాబాద్‌లో 32, కరీంనగర్‌లో 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

ఉపరితల ఆవర్తన ప్రభావం రూరల్ జిల్లాలపై…

ఉపరితల ఆవర్తన ప్రభావం ముఖ్యంగా రూరల్ జిల్లాలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కామారెడ్డి, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

మంచిర్యాలలో పిడుగుపడి ఇద్దరు దుర్మరణం

మంచిర్యాలప్రతినిధిః జిల్లా కేంద్రంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలవరానికి గురి చేసింది. సిసిసి నస్పూర్‌కు చెందిన అందె వెంకటేష్, అందె మౌనిక, అందె శ్రీయాన్‌లు సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి తిరుగు ప్రయాణంలో పిడుగుపాటుకు గురి కాగా అందె మౌనిక(24), శ్రీయాన్ (8 నెలలు)అక్కడి కక్కడే మృతి చెందారు.

ఈ సంఘటనలో భర్త వెంకటేష్‌కు తీవ్ర గాయాలు కాగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీయాన్ అనారోగ్య కారణంగా సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్, మౌనిక దంపతులు గత కొంత కాలంగా సిసిసి నస్పూర్‌లో నివాసం ఉంటున్నారు. సంఘటన స్థలానికి పోలీసులతో పాటు జిల్లా కలెక్టర్ భారతిహోళ్ళికేరి సందర్శించి గాయపడిన వెంకటేష్‌కు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News