Monday, April 29, 2024

బిజెపి వద్ద తెలంగాణ అభివృద్ధికి విజన్, మిషన్ ఉంది: రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

కీసర: తెలంగాణను అభివృద్ధి చేసే విజన్, మిషన్ బిజెపి వద్ద ఉందని, బిజెపికి ఒక్కసారి అధికారం ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం కీసర మండలం రాంపల్లిలో బిజెపి ఆధ్వర్యంలో మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్ధి ఏనుగు సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన మేడ్చల్ సకల జనుల విజయ సంకల్ప సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల త్యాగం ఉందని, తెలంగాణ ఏర్పాటు ఘనత ఈ ప్రాంత ప్రజలకే దక్కుతుందని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలను ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేదని చెప్పారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు అవినీతికి పాల్పడి జైలు జీవితం గడిపారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన అందిస్తుందని పేర్కొన్నారు.

బిజెపి అధికారంలోకి వస్తే అందరి సంక్షేమం కోసం పనిచేస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇటీవల ప్రధాని తెలంగాణలో రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేసి చూపుతుందని, ఈ నేపధ్యంలోనే ఆర్టికల్ 370 రద్దు చేశామని, అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతుందని చెప్పారు. త్రిబుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు న్యాయం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ గత 50 ఏళ్లుగా గరిబీ హటావో నినాదం చేస్తూనే ఉందని దుయ్యబట్టారు. బిజెపి ప్రభుత్వ హయాంలో నీతి ఆయోగ్ చెప్పిన విధంగా 30 కోట్ల మంది నేడు దారిద్ర రేఖ నుంచి దిగువకు వచ్చారని తెలిపారు. అంతర్జాతీయంగా భారత దేశ ప్రతిష్ట పెరిగిందని, ప్రపంచ దేశాలు నేడు శక్తివంతమైన భారత్‌ను చూస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బిసి నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు బీజేపీ పూర్తి మద్దతు పలుకుతుందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. అధికారలోకి రాగానే తెలంగాణలో బిజెపి ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని అన్నారు. పన్నులు తగ్గించి తక్కువ ధరలకు పెల్రోల్, డీజిల్, ఉజ్వల లబ్ధిదారులకు రూ.400 లకే వంట గ్యాస్ పంపిణీ చేస్తామని చెప్పారు. విద్యార్ధుల ఉన్నత చదువుల కోసం ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని, పేదలకు ఉచితంగా అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మేడ్చల్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్ధి ఏనుగు సుదర్శన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, నాయకులు వేముల నరేందర్, కొంపల్లి మోహన్‌రెడ్డి, బుద్ది శ్రీనివాస్, జిల్లాల తిరుమల్‌రెడ్డి, వేణుగోపాల్, రాజిరెడ్డి, శ్రీనివాస్‌రావు, లక్ష్మీ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News