Monday, April 29, 2024

కాళేశ్వరంపై హరీశ్ వి అబద్ధాలు: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై 80 వేల కోట్ల రూపాయల అప్పు చేశామన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిండు సభలో బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతోందన్నారు. మునుపటి ప్రభుత్వం చేసిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్కలు తేలతాయని అన్నారు.

కాళేశ్వరంపై ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 97,449 కోట్ల రూపాయల అప్పు మంజూరు చేయించుకున్నారని, అందులో 79,287 కోట్లు విడుదల అయ్యాయని ముఖ్యమంత్రి చెప్పారు. నీళ్లతో వ్యాపార చేసి, అప్పులు తీరుస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని, కాళేశ్వరం కట్టిన తర్వాత రైతులకు, పరిశ్రమలకు నీరందించి డబ్బు వసూలు చేస్తామని, దీనివల్ల ఏడాదికి 5,199 కోట్లు వస్తాయని చెప్పారని ముఖ్యమంత్రి తెలిపారు.

మిషన్ భగీరథలోనూ ఇలాగే జరిగిందని, నీళ్ల విక్రయం ద్వారా 5,706 కోట్లు వస్తాయని, ఆ డబ్బుతో అప్పులు తీరుస్తామని గత ప్రభుత్వం చెప్పిందని రేవంత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పూర్తి అప్పుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

ముఖ్యమంత్రి ఆరోపణలపై హరీశ్ రావు ప్రతిస్పందిస్తూ, ముఖ్యమంత్రి తమను దబాయించాలని చూస్తున్నారని అన్నారు. కాళేశ్వరానికి తీసుకున్న రుణాలను ఇతర ప్రాజెక్టులకూ వినియోగించామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే శ్వేతపత్రాలు ప్రగతికి కోత పత్రాలుగా పరిణమిస్తాయని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News