Monday, April 29, 2024

ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ విజయం

- Advertisement -
- Advertisement -

స్మిత్ సేనకు ఊరట

హైదరాబాబ్‌పై రాజస్థాన్ గెలుపు
ఆదుకున్న రాహుల్, పరాగ్.. పాండే శ్రమ వృథా

RR Win by 5 wickets against SRH

దుబాయి: వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ మరో బంతి మిగిలివుండగానే కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్ అసాధారణ పోరాట పటిమతో రాయల్స్ చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. ఓపెనర్‌గా దిగిన స్టార్ ఆటగాడు బెన్‌స్టోక్స్ (5)ను ఖలీల్ అహ్మద్ అద్భుత బౌలింగ్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (5) కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే మరో ఓపెన్ జోస్ బట్లర్ కూడా ఔటయ్యాడు. ఒక ఫోర్, సిక్స్‌తో 16 పరుగులు చేసిన బట్లర్‌ను ఖలీల్ వెనక్కి పంపాడు. దీంతో రాజస్థాన్ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను సంజు శాంసన్, రాబిన్ ఉతప్ప తమపై వేసుకున్నారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతుండడంతో రాజస్థాన్ కష్టాల్లోంచి గట్టెక్కినట్టే కనిపించింది. కానీ ఒక ఫోర్, మరో సిక్స్‌తో 18 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన ఉతప్పను రషీద్ ఔట్ చేశాడు. ఆ వెంటనే శాంసన్ (26)ను కూడా రషీద్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో రాజస్థాన్ 78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.
తెవాటియా, రియాన్ పోరాటం
ఈ దశలో రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్ అసాధారణ పోరాట పటిమతో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును లక్షం వైపు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు హైదరాబాద్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 28 బంతుల్లోనే 4 ఫోర్లు, మరో రెండు సిక్స్‌లతో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు పరాగ్ 26 బంతుల్లోనే రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో అజేయంగా 42 పరుగులు సాధించి తనవంతు పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ను కెప్టెన్ డేవిడ్ వార్నర్, మనీష్ పాండే ఆదుకున్నారు. రాజస్థాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న వార్నర్ 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మనీష్ పాండే 3 సిక్స్‌లు, రెండు ఫోర్లతో వేగంగా 54 పరుగులు చేశాడు. విలియమ్సన్ 22(నాటౌట్), ప్రియమ్ గార్గ్ (15) తమవంతు పాత్ర పోషించడంతో హైదరాబాద్ గౌరవప్రద స్కోరు సాధించింది. రాహుల్ తెవాటియాకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

RR Win by 5 wickets against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News