Monday, April 29, 2024

సింగరేణిలో మొదటి అర్ధ సంవత్సరంలోనే రూ.11,920 కోట్ల అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

గతేడాదితో పోలిస్తే 67 శాతం వృద్ధి
బొగ్గు అమ్మకాల్లో 81 శాతం వృద్ధి
విద్యుత్ అమ్మకాల్లో 19 శాతం వృద్ధి
మిగిలిన 6 నెలల్లో కూడా అద్భుతమైన వృద్ధి సాధించాలి
చైర్మన్ అండ్ ఎండి ఎన్.శ్రీధర్

Rs 11920 crore Coal sale by Singareni
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలోనే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
రికార్డు స్థాయిలో రూ.11,920 కోట్ల అమ్మకాలు జరిపింగి. గతేడాది ఇదే కాలానికి జరిపిన అమ్మకాలపై 67 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా వల్ల మొదటి అర్ధ భాగంలో సింగరేణి సంస్థ రూ.7,131 కోట్ల అమ్మకాలు మాత్రమే జరపగా, ఈ ఆర్థిక సంవత్సరంలో విస్తృత స్థాయిలో కరోనా నివారణ చర్యలు తీసుకోవడంతో గతేడాదిపై మంచి వృద్ధిని సాధించడం జరిగింది.
గతేడాది మొదటి అర్ధ సంవత్సరంలో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.5,573 కోట్ల అమ్మకాలు జరపగా ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధ భాగంలో 81 శాతంతో వృద్ధితో రూ.10,071 కోట్ల అమ్మకాలు జరిపింది. గత ఏడాది జరిపిన బొగ్గు అమ్మకాలపై ఈఏడాది అదనంగా రూ.4,499 కోట్ల అమ్మకాలు జరపగలిగింది. అలాగే గత ఏడాది మొదటి అర్ధ సంవత్సరంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా రూ.1,559 కోట్ల అమ్మకాలు జరపగా ఈ ఏడాది అదే కాలానికి 18.6 శాతం వృది తో రూ.1,849 కోట్ల అమ్మకాలు జరిపింది. ఈ విధంగా గత ఏడాది జరిపిన విద్యుత్ అమ్మకాలపై అదనంగా రూ.290 కోట్ల అమ్మకాలు సాధించగలిగింది. మొత్తం మీద చూస్తే సింగరేణి బొగ్గు, విద్యుత్ అమ్మకాల్లో గత ఏడాది మొదటి అర్ధ సంవత్సరం కన్నా ఈ ఏడాది మొదటి అర్ధ సంవత్సరంలో అదనంగా రూ.4,789 కోట్ల అమ్మకాలు జరపగలిగింది.

కరోనా నివారణ చర్యలు
మార్కెట్ వ్యూహాలతో వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో కరోనాతో బొగ్గు అమ్మకాలు మందగించినప్పటికీ అప్పటి నుంచీ ఇప్పటి వరకు సంస్థ ఛైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ రూ.73 కోట్ల వ్యయంతో కరోనా నివారణ చర్యలు చేపట్టడం, కార్మికులందరికీ వ్యాక్సినేషన్ ఇప్పించడం, నిరంతరాయ పర్యవేక్షణల ఫలితంగా ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరుకుంది. దీనికి తోడు మారుతున్న బొగ్గు మార్కెట్ పరిస్థితులను కంపెనీ వ్యూహాత్మకంగా సద్వినియోగం చేసుకుంది. అలాగే కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవడంతో సింగరేణి బొగ్గుకు మంచి డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌కు తగిన బొగ్గును వినియోగదారులకు కంపెనీ అందించడంతో గత ఏడాదితో పోల్చితే బొగ్గు అమ్మకాల్లో 81 శాతం వృద్ధి సాధించగలిగింది.
ఇదే స్పూర్తితో పనిచేద్దాం
ఇదే స్పూ ర్తితో మిగిలిన అర్ధ సంవత్సరంలో కూడా ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలని సింగరేణి ఛైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ ఒక ప్రకటనలో ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సింగరేణి సంస్థ బొగ్గుకు మంచి డిమాండ్ ఉందని, రానున్న కాలంలో ఇది పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విధంగా ఉత్పత్తి, రవాణా జరపడానికి సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా ఇప్పటికే మంచి పిఎల్‌ఎఫ్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని, ఇదే తరహా లో విద్యుత్ ఉత్పాదనను కొనసాగించి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తిని సాదిద్దాం
ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గుకు తీవ్ర డిమాండ్ డిమాండ్ కు తగ్గ బొగ్గు ఉత్పత్తిని సాధిద్ధామని సంస్థ చైర్మన్, ఎండి శ్రీధర్ వ్యాఖ్యానించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రెండు మూడు రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని, కనుక ఇతర రాష్ట్రాల్లోని సుమారు 15 పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి సింగరేణి బొగ్గుకు తీవ్ర డిమాండ్ ఉన్న నేపథ్యంలో లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తిని సాధించాల్సిన బాధ్యతను అన్ని ఏరియాల వారు సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు.
హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన సోమవారం మధ్యాహ్నం సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి, రవాణాపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణితో ఒప్పందం ఉన్న తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇప్పుడు వారం నుంచి 10 రోజుల వరకు బొగ్గు నిల్వ లు ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత ఉన్నందున సింగరేణి సంస్థ తన వంతుగా నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను దాటి బొగ్గు రవాణా చేయాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ బొగ్గు ధర 100 శాతం పైగా పెరగడంతో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు స్పాంజ్ ఐరన్, సిమెంట్ వంటి పరిశ్రమలు నేడు స్వదేశీ బొగ్గు వైపు చూస్తున్నాయన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారు కూడా దాదాపు ప్రతి రోజూ ఇదే విషయంపై సమీక్ష లు జరుపుతూ, బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాలను పెంచాలని కోరుతున్నారని వివరించారు. గడచిన ఆరు నెలల కాలంలో సింగరేణి గత ఏడాది తొలి ఆరు నెలల కన్నా గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. మిగిలిన ఆరు నెలలు కూడా ఇదే ఒరవడితో పనిచేస్తూ లక్ష్యాలను మించి ఉత్పత్తి, రవాణా లు సాధించాలని కోరారు. ఇప్పుడు వర్షాలు పూర్తిగా తగ్గు ముఖం పట్టినందున అక్టోబరులో రోజుకి కనీసం 1.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అలాగే అదే పరిమాణంలో బొగ్గు రవాణా చేయాలని, 13 లక్షల క్యూబిక్ మీటర్ల ఒబి తొలగించాలని ఆదేశించారు. ఇకపై ఏరియాల జనరల్ మేనేజర్లు బొగ్గు ఉత్పత్తి, రవాణాపై నే పూర్తి దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డైరెక్టర్(ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఇ అండ్ ఎం) డి.సత్యనారాయణరావు, డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్, పి పిండ్ పి) ఎన్.బలరామ్ (ఢిల్లీ నుంచి విసి ద్వారా), అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఇడి(కోల్ మూమెంట్) జె.ఆల్విన్, జిఎం(కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ, జిఎం(మార్కెటింగ్) కె.రవిశంకర్, జిఎం(సిపిపి) నాగభూషణ్ రెడ్డి, జిఎం (పి అండ్ పి) సత్తయ్య, జిఎం(స్ట్రాటెజిక్ ప్లానింగ్ ) సురేందర్, ఆయా ఏరియాల నుంచి జిఎంలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News