Sunday, April 28, 2024

రాష్ట్రం సొమ్ము కేంద్రం స్వాహా

- Advertisement -
- Advertisement -

Rs 353 crore GST arrears released to Telangana

జిఎస్‌టి బకాయిలు రూ.353 కోట్లు
తప్పుడు ఆడిట్ లెక్కలతో తెలంగాణకు నష్టం

మన తెలంగాణ/హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఆర్థికంగా అంతులేని నష్టాలకు గురిచేస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోతలు విధించడమే కాకుండా తాజాగా ఎగ్గొట్టడం కూడా కేంద్రం నేర్చుకుంటోందని అధికారవర్గాల సమాచారం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులు, పొరపాట్లకు రాష్ట్రాలు ఆర్ధికంగా నష్టపోవాల్సి వస్తోందని కొందరు సీనియర అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2018-19వ ఆర్ధిక సంవత్సరానికి కేంద్రప్రభుత్వం నిర్వహించుకొన్న ఆడిట్ లెక్కల్లోదేశంలోని అన్ని రాష్ట్రాలకు 13,944 కోట్ల రూపాయలను కోతలు విధించింది. ఆలశ్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఆడిట్ లెక్కల్లో తప్పులను సరిదిద్దుకొని ఏ రాష్ట్రానికి వెళ్ళాల్సిన నిదులను ఆయా రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం స్వాహా చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి అని పలువురు సీనియర్ అధికారులు వివరించారు. కేంద్ర ఆడిట్ లెక్కల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 13,944 కోట్ల రూపాయలను కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ ఎక్కౌంట్‌కు బదిలీ చేసుకొని రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపించింది కేంద్రం.

ఈ నిధుల్లో తెలంగాణ రాష్ట్రానికి 353 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉంది. ఈ నిధులను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖా మంత్రి టీ.హరీష్‌రావు న్యూఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విన్నవించడం వంటి ఎన్నిసార్లు జరిగినా చూస్తాం.. చేస్తాం.. పరిశీలిస్తాం.. అనే పదాలతో కాలంవెళ్ళదీస్తున్నారు. తాగా తెలిసిన సమాచారం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఈ 353 కోట్ల రూపాయల నిధులను ఇకపై ఇవ్వకూడదని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని, ఇక ఆ నిధులను తాము మరచిపోవాల్సిందేనని ఆర్ధికశాఖకు చెందిన కొందరు అధికారులు వివరించారు. ఒక్క తెలంగాణకే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఈ 13,944 కోట్ల రూపాయలను ఇవ్వరికీ ఇవ్వకుండా కేంద్ర ఖజానాలోనే జమ చేసుకున్నట్లేనని ఆ అధికారులు వివరించారు. దీనికితోడు 15వ ఆర్ధిక సంఘం వారు తెలంగాణ రాష్ట్రానికి 2020-21వ ఆర్ధిక సంవత్సరానికిగాను ప్రభుత్వ పనితీరుకు మెచ్చుకొని 723 కోట్ల రూపాయలను గ్రాంటుగా ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

కానీ ఇంత వరకూ ఆ నిధులకు సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఇక ఈ నిధులను కూడా ఇస్తారా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. ఆడిట్ పొరపాట్లతో ఇవ్వాల్సిన 353 కోట్ల రూపాయలు, 15వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసి 723 కోట్ల రూపాయలు కలిపితే మొత్తం 1,076 కోట్ల రూపాయల నిధులను ఈ రెండు అంశాల్లోనే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉందని, ఈ నిధులను కేంద్రం ఇస్తుందా& లేక ఇవ్వకుండా ఎగ్గొడుతుందా& అనేది అర్ధం కావడంలేదని, తామైతే కేంద్రం ఇవ్వాల్సిన నిధులపైన ఆశలు వదులుకున్నామని అంటున్నారు. పన్నుల ఆదాయంలో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాలో అన్యాయం జరుగుతున్నప్పటికీ మళ్ళీ ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా సతాయించడం కేంద్ర ప్రభుత్వానికే చెల్లిందని, ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాల్సి ఉందని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News