Monday, April 29, 2024

ఎవరో జ్వాలను రగిలించారు..!

- Advertisement -
- Advertisement -

“ఎవరో జ్వాలను రగిలించారు-వేరెవరో దానికి బలియైనారు” కొన్ని దశాబ్దాల క్రితం (1964లో) డాక్టర్ చక్రవర్తి చిత్రానికి మనసు కవి అచార్య ఆత్రేయ రచించిన యీ గీతం ఆ రోజుల్లో ప్రతి సంగీత కార్యక్రమంలో వినబడి శ్రోతల హృదయాల్ని ద్రవింప చేసేది. ఆ గీత పల్లవిలోని ఆవేదనని యీ రోజున సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిరసనకారులకు అన్వయించుకుంటే వారి దీన స్థితికి అది చక్కగా సరిపోతుంది.

22 Members arrested in Secunderabad Railway station incident
నిశితంగా పరిశీలిస్తే ఆ నిరసనకారులెవరూ నేర చరిత్ర వున్నవారు కాదు. సంఘ విద్రోహ శక్తులుగా ముద్రపడ్డవారు కాదు, దోపిడీ దొంగలు కారు- ఇక విప్లవకారులు అసలే కాదు. మత్తులో తూగుతూ, సంపాదనే పరమావధిగా పెట్టుకొని డబ్బుకు నానా అక్రమాలకు పాల్బడుతున్న యువత దండిగా వున్న యీ దేశంలో పుట్టినా కూడా వారికి భిన్నంగా యీ నిరసనకారులంతా తమ శరీరంలోని అణువణువులో దేశభక్తిని నింపుకొన్న దేశభక్తులు. పది కాలాల పాటు జీవించడమంటే దేశం కోసం మరణించడమేనని నమ్ముతూ, మాతృదేశ రక్షణలో తమకు తాము సమిధలుగా సమర్పించుకొనేందుకు ఉవ్విళ్ళూరుతున్న, ఉడుకు రక్తం ప్రవహిస్తున్న యువకులు. తమను కన్న తల్లిదండ్రులకు, తాము పుట్టిన ఊరికి గొప్ప పేరు తేవాలని కలలుకన్న అశాజీవులు. కాని వాళ్ళంతా యీ రోజున దురదృష్టవశాత్తు విధ్వంసకారులుగా ముద్ర వేయబడి కఠినాతి కఠినమైన శిక్షలు అనుభవించడానికి మన న్యాయస్థానల ముందు నిలబెట్టబడ్డారు.

ఏ దేశం కోసమయితే తమ సర్వస్వాన్ని, చివరకు తమ ప్రాణాల్ని బలిపెట్టడానికి వారు సిద్ధపడ్డారో ఆ దేశ చట్టాలే యిపుడు వారికి కఠిన శిక్షల్ని విధించే అవకాశాలున్నాయి. ఏ దేశ సైన్యంలో చేరి తమ శౌర్య పరాక్రమాలతో ప్రభుత్వ పతకాల్ని అందుకోవాలనుకున్నారో ఆ దేశమే వారికి నేరస్థులన్న ముద్ర వేయనుంది.

అయితే వీరి యీ దుస్థికి కారకులెవరు? ఈ విషయం మీద పాలకులు,- ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకొంటున్నారు. ఈ యువకులంతా గత నాలుగేళ్ళుగా మిలిటరి శిక్షణ పొందుతూ ఉద్యోగం కోసం యెదిరి చూస్తున్న యీ తరుణంలో అర్థంపర్థం లేని అగ్నిపథ్ పథకంతో మీకు శాశ్వత ఉద్యోగమంటూ లేదు- కేవలం నాలుగేళ్ళు మాత్రమే ఉద్యోగమని చెప్పి, వాళ్ళ చిరకాల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్ళుచల్లడంతో యీ విధ్వంసకాండ జరిగిందని ప్రతిపక్షాలు అంటుంటే, లేదు -లేదు- ప్రతిపక్షాలే కూడగట్టుకొని యీ విధ్వంసాన్ని ప్రోత్సహించాయని పాలక పార్టీ ప్రతిపక్షాల్ని విమర్శిస్తున్నది. ఈ తరుణంలో తప్పెవరిదని రాజకీయ కోణంలో చర్చించడం మన లక్ష్యం కాదు. ఆ విషయాన్ని మన దర్యాప్తు సంస్థల దర్యాప్తు అధారంగా న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. మన సమాజం ఆలోచించవలసిన విషయం ఛిద్రమవనున్న యీ నిరసనకారుల భవిష్యత్తు గురించి, వారికి పడబోయే కఠిన శిక్షల గురించి మాత్రమే.

ఇక విచారణ సందర్భంగా ఈ పాపానికి అసలు సూత్రధారులు వారికి శిక్షణ యిచ్చిన శిక్షణా సంస్థల స్వార్థమేనన్న ఒక కొత్త కోణం బయట పడింది. వెలుగు చూస్తున్న యీ కోణం నుండి వాస్తవాలను పరిశీలించినప్పుడు గమనించవలసిన ఒక ముఖ్య విషయం- నిరసనకారులందరూ చాలా కాలంగా మిలిటరి శిక్షణ పొందుతున్నారు. ఆ శిక్షణలో మిలిటరిలో ఆజ్ఞలిచ్చే అధికారి ఆజ్ఞయే సర్వస్వమని వారికి నూరి పోయబడుతుంది. ఆ ఆజ్ఞను జవదాటే అధికారం వారికుండదు. ఆ సమయంలో వారు -వారి, యుక్తాయుక్త విచక్షణను విడిచిపెట్టిపై అధికారి చెప్పింది మాత్రమే చేయాలి. తాము చేస్తున్నది మంచా, చెడ్డనా అన్న ఆలోచన వారికుండకూడదు. ఒక విధంగా వాళ్ళంతా దట్టించిన తుపాకుల్లాంటివారు. ఆయుధాన్ని ధరించిన వ్యక్తి మీట నొక్కితే తుపాకి పేలుతుంది. ఈ విధంగా మానసికంగా శిక్షణలో మలచబడ్డ యీ నిరసనకారులకు తమ శిక్షణాధికారులిచ్చే ఆజ్ఞలు యెప్పుడూ ఒప్పుగానే కనిపిస్తాయిగాని ఒక తప్పుగా కనిపించవు.

అటువంటి మానసికంగా మలచబడ్డ యువకులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం, ఆ యువకుల భవిష్యత్తుని నాశనం చేస్తుందని,- అంతేగాక ఆ పథకం మన దేశ రక్షణ వ్యవస్థనే బలహీన పరుస్తుందని,- అది మన దేశానికి చాలా ప్రమాదకారని నూరిబోసి, అందువల్ల నిరసన తెలుపాలని, ఆ నిరసన తీవ్రరూపంలో వుండి, కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని, అప్పుడే మన దేశం ప్రమాదం నుండి బయట పడుతుందని శిక్షణాధికారులు రెచ్చగొట్టడం జరిగితే- యే దేశరక్షణ కోసం తమ ప్రాణాల్ని బలిపెట్టేందుకు ఆ యువకులు సిద్ధపడ్డారో ఆ దేశం కోసం వాళ్ళు ఏ పని చేయడానికైనా వెనుకాడరు. అందువల్ల సికింద్రాబాద్‌లో జరిగిన విధ్వంసకాండని, ఒక ప్రత్యేక కోణంలో చూడాలిగాని, సాధారణ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుగా మాత్రం చూడగూడదు.

బ్రిటిష్ నేర చట్టాలను గౌరవించి వాటి అధారంగా, నేర చట్టాలను రూపొందించుకొన్న మనం, బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిలో తీవ్రాతి తీవ్ర నేరంగా పరిగణించబడిన చక్రవర్తిపై యుద్ధం (Waging of war against His majesty The king Emporer of India) కేసుల్లోను, హత్యా నేరాల కేసుల విషయంలోను, ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ) దేశభక్తులపట్ల అనుసరించిన ఉదాసీన వైఖరిని కూడా పరిశీలించాల్సిన అవసరముంది.

ఐ.ఎన్.ఎ ట్రయల్ (1945- 1946) గా పిలువబడే యీ కేసుల విచారణలో నేతాజీ సుభాశ్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన ముగ్గురు అధికారులు కెప్టెన్ షానవాజ్ ఖాన్, కెప్టెన్ ప్రేమ్ కుమార్ సెహగల్, లెఫ్టినంట్ గురుబక్ష్ సింఘ్ ధిల్లాన్ పైన చెప్పబడ్డ నేరాల కింద కోర్టు మార్షల్ చేయబడి ఢిల్లీలోని ఎర్రకోటలో విచారించబడి బ్రిటిష్ మిలిటరి కోర్టు చే దోషులుగా నిర్ధారించబడ్డారు. ఈ తీవ్రమైన నేరాలకు ఆనాటి బ్రిటిష్ చట్టాలు విధించే శిక్ష మరణ శిక్ష లేదా యావజ్జీవ ప్రవాస శిక్ష. అందువల్ల ఆనాటి కోర్టు వీరికి యావజ్జీవ ప్రవాస శిక్షను విధించింది. అయితే యీ శిక్షల్ని ఆమోదించవలసిన అప్పటి సర్వసైన్యాధికారి తమ దేశంపట్ల యీ నిందితులకున్న దేశ భక్తిని గౌరవించి తనకున్న విశేషాధికారాలతో వారి ప్రవాస శిక్షను రద్దు చేయడం జరిగింది.

ఆనాటి యీ విచారణ భారత దేశంలో బ్రిటిష్ ప్రభుత్వపు చిట్టచివరి విచారణగా చరిత్రపుటల్లోకెక్కింది. ఆ కేసు వివరాలను, ఆ విచారణ పట్ల, యావద్దేశం స్పందించిన తీరును సాక్షాత్తు కీ.శే. లెఫ్టినెంట్ గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ గతంలో నాకు వివరించి చెప్పినప్పుడు నా ఒళ్ళు భావావేశంతో పులకరించింది.

ఇక దోషులుగా నిర్ధారించబడి యావజ్జీవ ప్రవాస శిక్ష ఖరారు చేయబడిన ఆనాటి ఒక బానిస దేశపు ఖైదీల విషయంలో, తమ దేశం పట్ల వారికున్న దేశభక్తిని గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం దానిని గౌరవించగలిగినప్పుడు, దాన్ని మార్గదర్శకంగా తీసికొని ఒక స్వతంత్ర దేశానికి చెందిన మన దేశపు న్యాయ వ్యవస్థ, యీ దేశపు యువకులైన సికింద్రాబాద్ నిరసనకారుల దేశభక్తిని, దేశం పట్ల వారికున్న ప్రేమను గుర్తించి వారిని నేర విముక్తుల్ని చేస్తూ- వారు మన రక్షణ శాఖలో చేరేందుకుయే ఆటకం లేకుండా చూడగలిగితే మన దేశ రక్షణ వ్యవస్థకు మేలు చేసినట్టవుతుంది అంతేగాక మన న్యాయ విచారణ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని అది ఆవిష్కరిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News