Monday, April 29, 2024

నగరంలో నిఘా

- Advertisement -
- Advertisement -

రక్షణ కొరకు జరగనున్న అవగాహనా కార్యక్రమాలు
అన్ని ప్రాంతాలలోనూ షీ టీమ్ నిఘా,
భద్రతకై షీటీమ్ వాట్సాప్ నెంబర్, మొబైల్ అప్లికేషన్లు
చేస్తూ పట్టుబడితే స్పాట్ లోనే అరెస్ట్

She-Team
మన తెలంగాణా/ సిటీ బ్యూరో: జంటనగరాలలో 2020 తో పోలిస్తే 2021 లో మహిళలపై అత్యాచారాల సంఖ్య పెరిగిన నేపధ్యంలో షీ టీమ్ అడిషనల్ డిసిపి శిరీషా రాఘవేంద్ర స్పందిస్తూ,. ఎన్నో పాఠశాలలలోనూ, కళాశాలలలోనూ, కార్యాలయాలలోనూ మహిళల రక్షణ కొరకు అవగాహనా కార్యక్రమాలను జరపబోతున్నామని, ఈ సంవత్సరంలో స్త్రీలకు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయబోతున్నామని తెలిపారు. 2020లో చూసుకుంటే ఒక్క భాగ్యనగరంలోనే దాదాపు 220 మానభంగాలు జరిగితే, వాటి సంఖ్య 2021లో 300 పైమాటే. 2022లో ఇటువంటి సంఘటనలు జరగకుండా నగరంలోని అన్ని ప్రాంతాలలోనూ షీ టీమ్ కు చెందిన పోలీసులు బృందాలుగా విడిపోయి యూనీఫాం లేకుండా మఫ్టీలో ప్రజల మధ్య ఉంటూ, ఆడవారు ఎక్కువగా తిరగాడే ప్రాంతాలైన బస్సులూ, బస్ స్టాపులూ, గుడులూ తదితర ప్రదేశాలలో నిఘా వేశారనీ పేర్కొన్నారు. జంటనగరాలలో ఇప్పటికి 450 ప్రాంతాలలో షీ టీమ్ బృందాలు ప్రజలలో కలిసిపోయి ప్రతిరోజూ తమ విధులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు.

రద్దీలో రుద్దుకుంటే రిమాండే

ఆర్టీసీ బస్సులలోనూ, దేవాలయాలలోనూ, మహాసభలలోనూ జనాల కిటకిట ఎక్కువగా ఉండడాన్ని ఆసరాగా తీసకుని కొంతమంది మగవారు స్త్రీలకు తగిలేలా నిలబడి వారిని తాకే ప్రయత్నం చేస్తుంటారనీ, ఒంటరిగా నడిచి వెళ్ళే ఆడవారిని వెంబడిస్తూ ఇబ్బంది పెట్టే వారున్నారనీ ఇటువంటి దుశ్చర్యలను నిఘా ఉన్న షీ టీమ్ పోలీసులు రహస్య కెమెరాతో సాక్ష్యం కోసం వీడియో తీసి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఏమాత్రం ఉపేక్షించకుండా తక్షణమే అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తారన్నారు. ఇవి చిన్న పెట్టీ కేసు కిందకి వస్తాయనీ., ఇటువంటివాటిని రచ్చకీడ్చడం వృధా అనుకొని, స్త్రీలు ఊరుకుంటారనీ, కానీ లైంగిక దాడి, లేదా బ్యాగ్గులలో నగదు దొంగతనం వంటివి చేసే ఆలోచనలు మగవారిలో ఇటువంటి చిన్న తప్పులతోనే మొదలవుతాయని పేర్కొన్నారు. ఇలాంటి నిందితుల వివరాలు క్రైం రికార్డులోకి ఎక్కుతాయని, కోర్టులో ప్రవేశపెట్టాకా ఐదురోజులు రిమాండ్ తో పాటు సుమారు 500 నుంచి వెయ్యి రూపాయల ఝరిమానా ఉంటుందని, ఆకతాయిలూ, ఇటువంటి దుశ్చర్యలు చేసేవారూ ఇకమీదట జాగ్రత్తగా ఉండాలనీ హెచ్చరించారు.

ఇంట్లో తెలుస్తుందేమోనని స్త్రీలు భయపడద్దు

విద్యార్థినులూ, ప్రైవేట్ ఉద్యోగాలు, వృత్తులూ చేసే ఇండిపెండెంట్ మహిళలు గనుక ఏ విధంగానేైనా చిక్కుల్లో పడితే, వీలైనంత త్వరగా తమకు తెలియజేయమన్నారు. తమకు తెలియకుండా పని చేసే చోట, లేదా చదువుకునే చోటా సౌచాలయాలలోనూ, బట్టల షాపులలో ట్రైల్ రూమ్ లలోనూ కొంతమంది రహస్యంగా కెమెరాలను అమర్చి వీడియోలు తీసే అవకాశం ఉందని, అలాంటి వీడియోలలో ఉన్న ఆడవారికే వాటిని చూపించి ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే వారికి లొంగద్దనీ, ఏమాత్రం భయం లేకుండా షీటీమ్ కి కంప్లైంట్ ఇస్తే సత్వరమే చర్యలు తీసుకుంటామనీ, ఆ వీడియోలూ ఫొటోలూ శాస్వతంగా డిలీట్ చేయడమే కాకుండా నిందితులకి ఖటిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. అంతేకాకుండా బాధితులైన ఆడవారు ఇటువంటి కంప్లైంట్ ఇవ్వడం వల్ల తమ ఇంట్లో తెలిస్తే సమస్య వస్తుందేమోనని ఫిరియాదు చేయకుండా ఉంటారనీ.., ముఖ్యంగా గృహిణులూ, విద్యార్ధినులూ ఫిరియాదు చేయడానికి భయపడుతుంటారనీ., అటువంటి బాధితురాళ్ళైనవారి వివరాలు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచి తమకు న్యాయం చేస్తామని, తమ ఇంట్లో వారికి కూడా తెలియనివ్వకుండా కాన్ఫిడెన్షియల్ గా తాము డీల్ చేస్తామనీ భయపడకుండా ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వమనీ హామీ ఇచ్చారు.

వెంటనే ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ తోపాటూ మొబైల్ అప్లికేషన్లు

చాలా మంది ఆడవారు 100కి డయల్ చేసి పోలీసులకి ఫిరియాదు చేయడానికి కూడా భయపడుతుంటారు. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం వల్ల వారు రెస్పాండ్ అవుతారా, లేక ఆలస్యమవుతుందోమోననే రకరకాల అపోహలతో సతమతమవుతుంటారు. అటువంటివారు వాట్సాప్ లో తమ కంప్లైంట్ ని షీ టీమ్ నెంబర్ 9490616555 కి మెసేజ్ చేయాలనీ, ఏదైనా ప్రమాదంలో ఉంటే వీలైతే తామెక్కడున్నారో లొకేషన్ పంపడం మరింత శ్రేయస్కరమనీ, వాట్సాప్ లో ఒకసారి ఫిరియాదు చేసిన వెంటనే తమ లొకేషన్ ట్రాక్ చేయబడుతుందనీ సత్వరమే పోలీసులు స్పందిస్తారనీ తెలిపారు. అంతేకాక, ముఖ్యంగా నైట్ షిఫ్ట్ లో పని చేసే ఆడవారు ‘హాక్ ఐ’ అనబడే ఆండ్రాయిడ్, లేదా యాపిల్ అప్లికేషన్ ను ఖచ్చితంగా తమతమ చరవాణులలో ఇన్స్ టాల్ చేసుకోవడం తప్పని సరనీ, ఇలా టెక్నాలజీ ని ఉపయోగించి కంప్లైంటివ్వడం వల్ల సత్వరమే షీ టీమ్ పోలీసులు రంగం లోకి దిగుతారనీ తెలియజేశారు.

పెళ్ళి పేరుతో మోసం చేస్తే పరిణామం తీవ్రం

చాలా మంది ఆడవారిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి శారీరకంగా అనుభవించి, డబ్బు తీసుకుని మోసం చేసే మగవారి పై కంప్లైంట్ ఇచ్చిన తక్షణమే చీటంగ్ మరియు రేప్ కేసులు నమోదు చేసి శిక్షపడేలా చేస్తామనీ, నిందితులు ఎటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ, తక్షణమే కంప్లైంట్ ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించద్దనీ, బాధితురాళ్ళ భద్రతకై తమ వివరాలు ఖచ్చితంగా గోప్యంగా ఉంచి, వారికి భద్రత కల్పిస్తామనీ తెలియజేశారు. క్రిమినల్ రికార్డ్స్ లో గనుక ఒక్కసారి ఎవరి పేరైనా ఎక్కితే వారికి పోలీసులు ఏదో సంఘటనలో ఎప్పటికప్పుడు విచారణ కోసం ఎదురవుతూనే ఉంటారనీ, అందువల్ల మహిళలు ఎవరివల్లయినా బాధించబడితే షీ టీమ్ కి ఫిర్యాదు చేయడానికి సంకోచించవద్దని వివరించారు.

నగరంలో మహిళా భద్రత కోసం షీటీమ్ పోలీసులకు ఆడవారు ఖచ్చితంగా సహకరించాలనీ, మహిళలు ప్రమాదం లో ఉన్నప్పుడు వీలైనంతవరకూ ప్రతిఘటించడంలో వెనకడుగు వేయద్దని షీ టీమ్ అధికారులు సూచించారు. స్త్రీలు తమ భద్రత తాము చూసుకునే క్రమంలో మార్షల్ ఆరట్స్ నేర్చుకోవడం, తమ కూడా పెప్పర్ స్ప్రే ఉండేలా చూసుకోవడం తప్పనిసరని, అనుకోని సంఘటన జరిగినప్పుడు ఎదురుగా ఉన్న నిందితులని ప్రతిఘటించి సాధ్యమైనంత త్వరగా షీ టీమ్ కి తమతమ చారవాణులలో సమాచారం ఇవ్వమని తెలియజేశారు. తాము ఫిరియాదు చేయడానికి సంకోచించకుండా ముందుండాలనీ, ప్రజల సహకారం ఉంటేనే స్త్రీలపై అఘాయిత్యాలని అరికట్టగలుగుతామనీ, భయం వల్లో పరువు పోతుందనో ఊరుకుంటే తమపై జరిగిన అఘాయిత్యాలు, మళ్ళీ మళ్ళీ జరగడమే కాకుండా, అవి చికటి నేరాలుగా ఎవరికీ తెలియకుండా రహస్యంగా మిగిలిపోతాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News