Sunday, April 28, 2024

ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగించిన ఎంపీ(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్‌లోగల ప్రభుత్వ ఆసుపత్రిలో 31 మంది రోగులు మరణించిన నేపథ్యంలో ఆ ఆసుపత్రిని తనిఖీ చేసిన శివసేన ఎంపీ ఒకరు ఆసుపత్రి డీన్ చేత మరుగుదొడ్డిని శుభ్రం చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. శివసేన ఎంపీపై చర్యలు తీసుకోకపోతే సమ్మె చేస్తామని డాక్టర్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

శిశువులతోసహా రోగుల మరణాలు సంభవించిన నేపథ్యంలో నాందేడ్‌లోని డాక్టర్ శంకర్‌రావు చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిని హింగోలికి చెందిన శివసేన ఎంపి హేమంత్ పాటిల్ మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలోని టాయిలెట్, యూరినల్స అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి తాత్కాలిక డీన్ డాక్టర్ ఎస్‌ఆర్ వకోడే చేత టాయిలెట్లను ఆయన శుభ్రం చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డాక్టర్ వకోడే ఫిర్యాదుపై పోలీసులు బుశవారం ఎంపీ పాటిల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడమేగాక ఆయనను కించపరిచి అప్రతిష్టపాల్జేశారని పాటిల్‌పై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

కాగా ఈ ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) మహారాష్ట్ర శాఖ తీవ్రంగా స్పందించింది. ఆసుపత్రి డీన్‌పై అనుచితంగా వ్యవహరించిన ఎంపీ పాటిల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఒక వినతిపత్రాన్ని సమర్పించినట్లు ఐఎంఎ తెలిపింది.

నాందేడ్ ఆసుపత్రిలో సంభవించిన మరణాలపై లోతుగా దర్యాప్తు జరపాలని వైద్య సిబ్బంది కోరుతున్నట్లు ఐఎంఎ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ రవీంద్ర కూటే తెలిపారు. ఎంపీపై గతిన చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News