Thursday, May 9, 2024

సినీ గీత కవితా విరించి

- Advertisement -
- Advertisement -

‘జగమంత కుటుంబం నాది’ అంటూనే ‘ఏకాకి జీవితం నాది’ అనే వేదాంత రహస్యాన్ని కూడా సినిమా పాటలో నిక్షప్తీకరించ గలిగే అక్షర యోగి సిరివెన్నెల. ‘ముక్కంటి, ముక్కోపి, తిక్కశంకరుడు’ అని నిందా స్తుతిలో శివ తత్త్వాన్ని ఆవిష్కరింప జేసిన ఆధ్యాత్మిక కవితాత్మ సిరివెన్నెలది. ‘బూడిదిచ్చే వాడ్ని ఏమి కోరేది?’ అంటూనే ఉత్కృష్టమైన విభూతి తత్వాన్ని చెప్పకనే చెప్పారు సీతారామశాస్త్రి. ‘తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం’ అని ప్రకృతి తత్వాన్ని వ్యక్తీకరించేరాయన.

Sirivennela seetharama sastry personal life

‘అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అనంటారు ప్రముఖ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సీతారామ శాస్త్రికి పద్మశ్రీ పురస్కారం వచ్చినప్పుడు, ‘సిరి వెన్నెలకే పద్మశ్రీ’ అన్నారంతా. అక్షరాలను యోగ్యమైన గీతాలుగా మలచగలిగిన అక్షర యోగి సీతారామ శాస్త్రి అని అన్నారు కొందరు. ఏదిఏమైనా తెలుగు చిత్రగీత చరిత్రలో సుస్థిర స్థానం సిరివెన్నెల సీతారామ శాస్త్రిది. తనదైన ప్రత్యేక ముద్రను, తెలుగు సినిమా పాట మీద బలంగా వేసిన కవి సీతారామ శాస్త్రి. సినీ గీతాన్ని కవిత్వీకరించిన అతికొద్ది గీత రచయితల్లో సిరివెన్నెల ఒకరు. తెలుగు సినిమా గీతానికి ఎన్నో సొగసులను, సొబగులను అద్ది, సుస్థిర సుగంధాన్ని అందించిన సాహితీ స్రష్ట సిరివెన్నెల. తెలుగు సినిమా పాటకు సుసంపన్న సాహితీ వన్నెలల్ని రంగరించి, సినీవినీలాకాశంలో అసామాన్య సిరివెన్నెలను కురిపించేరు. వేటూరి తర్వాత సినీపాటకు కావ్య గౌరవాన్ని తీసుకొచ్చేరు. తొలి సినిమా పేరునే తన ఇంటి పేరు, సొంత పేరు అయ్యేటంతటి ప్రభావంతమైన గొప్ప సాహిత్యాన్ని, మొదటి సినిమాలోనే అందించేరు సీతారామ శాస్త్రి. సుసంపన్నమైన కవిత్వాన్ని ఆవిష్కరింపజేసేరు. అందరినీ ఆకర్షించేరు. శ్రోతల గుండెల్లో సాహితీ పున్నములను పూయించేరు.
‘సరసస్వర సుర ఝరీగమనమౌ సామవేద సారమిది ….’ లాంటి సంస్కృత పదబంధాలతో, సమాసాల సుగంధాలతో, తన సినీ గీత ప్రయాణం మొదలు పెట్టేరు, కాలక్రమేణా అలతి అలతి పదాలలో, అమలిన తత్వాన్ని, అమృతత్వాన్ని ఆవిష్కరించారు. ఆధునికతకు అనంత తత్వాన్ని అద్దగలిగిన అక్షరయోగి సీతారామ శాస్త్రి. తాత్త్వికతకు వాస్తవికతను రంగరించి రసమయం చేయగలిగే హృదయం ఆయనిది. తెలుగు సినీ గీతాకాశంలో వినిర్మలమైన, విలక్షణమైన, వినూత్నమైన వన్నెలలతో, పసందైన సాహిత్య వెన్నెలను కురిపించిన నిండు చందమామ సీతారామ శాస్త్రి. సాహితీ సంపద అసలు సిసలు చిరునామా సీతారామ శాస్త్రి. సాహిత్య విలువలను సినిమా పాటలో చక్కగా అమర్చిన సినీ పాటల మేస్త్రీ సీతారామ శాస్త్రి.
విషయం ఏదైనా తనదైన ముద్రతో, పాటను కూర్చగల నేర్పరి సిరివెన్నె. ఆయన ఏది రాసినా విలక్షణంగా ఉంటుంది. వినూత్నంగాను ఉంటుంది. ఆయన పాటలో తత్వం, తాత్వికత, వేదాంతం, రసాన్ని ఆవిష్కరించగలిగే వెచ్చని గిలి ఉంటుంది. కుర్రకారుని ఉర్రూత లూగించే ‘కిక్కు’ ఉంటుంది . చక్కిలిగిలి పెట్టే చమక్కూ ఉంటుంది. సిరివెన్నెల కలానికి రెండు వైపులా పదునే. ఆయన ఏది రాసినా రసముద్ర ద్యోతకమవుతుంది. సీతారామశాస్త్రి మాత్రమే యిలా రాయగలరు అనే స్థాయి కనిపిస్తుంది. అందుకే తెలుగు సినీ గీత చరిత్రలో సిరివెన్నెలకు ఓ ప్రత్యేక స్థానం. తేలికైన చిన్నిచిన్ని పదాలలో, ఎంతో లోతైన భావాలను కూర్చగల నేర్పరి సీతారామశాస్త్రి. తొలి చిత్రం ‘సిరివెన్నెల’ తోనే, తెలుగు సినిమా పాటకి, ప్రబంధ సాహిత్య స్థాయిని, కావ్య రచనా స్థానాన్ని అందించిన అక్షర శిల్పి సీతారామశాస్త్రి అనడం అతిశయోక్తి కాదు.
‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. అగ్గితోన కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని’ అనగలిగిన సత్యాన్వేషణలో దాగుండే తీక్షణత, అందుకు తగ్గ ఆవేశం సిరివెన్నెలలో కనిపిస్తాయి. ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్య్ర మందామా?’, ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని?’ అనే వాక్యాలు, ఆయన అంతరంగంలో పురుడు పోసుకునే బడబాగ్నికి నిదర్శనమని చెప్పక తప్పదు. అదే విధంగా … గాంధీ తత్వాన్ని వివరిస్తూ ‘భరత మాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ. తరతరాల యమయాతన తీర్చిన వర దాతరా గాంధీ’ అంటూ గాంధీ తత్వాన్ని తాత్త్వికతను అక్షరీకరిస్తారు సిరివెన్నెల.
‘జగమంత కుటుంబం నాది’ అంటూనే ‘ఏకాకి జీవితం నాది’ అనే వేదాంత రహస్యాన్ని కూడా సినిమా పాటలో నిక్షప్తీకరించ గలిగే అక్షర యోగి సిరివెన్నెల. ‘ముక్కంటి, ముక్కోపి, తిక్క శంకరుడు’ అని నిందా స్తుతిలో శివ తత్త్వాన్ని ఆవిష్కరింప జేసిన ఆధ్యాత్మిక కవితాత్మ సిరివెన్నెలది. ‘బూడిదిచ్చే వాడ్ని ఏమి కోరేది?’ అంటూనే ఉత్కృష్టమైన విభూతి తత్వాన్ని చెప్పకనే చెప్పారు సీతారామశాస్త్రి. ‘తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం’ అని ప్రకృతి తత్వాన్ని వ్యక్తీకరించే రాయన . అదే విధంగా వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని వివరిస్తూ ‘మంగళ సూత్రం అంగడి సరుకా ?’ అంటూ నిలబెట్టి ప్రశ్నిస్తారాయన. అలాగే ‘బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది’ అనే పాటలో , కళాశాల జీవితాన్ని నేటి విద్యా వ్యవస్థని తూర్పార పట్టేరు సీతారామశాస్త్రి.
‘ఎప్పుడూ ఒప్పుకో వద్దురా ఓటమి. ఎప్పుడూ ఒదులుకో వద్దురా ఓరిమి’ అంటూ ఆశావాద దృక్పథాన్ని తనదైన శైలిలో పాటన అందించేరు సీతారామ శాస్త్రి. ఉత్తరాంధ్ర సొంతమైన ‘ఎర్రని యాగాణి’, ‘బుడబుక్కల బూచోడు’, ‘పాల పడ్డం’ లాంటి పదాలను, అలవోకగా సినిమా గీతంలో యిమిడ్చిన కవితా నైపుణ్యం సిరివెన్నెలది. ఇలా ఎన్నని చెప్పటం ఆయన కవితా వైభవాన్ని, వైశిష్ట్యాన్ని చెప్పేందుకు ? ఎన్నెన్నో. ఆయన ప్రతి పాటా విశేషమైనదే. విలక్షణ మైనదే. విశిష్టమైనదే. ప్రతి పాటా పదాల సొంపుతో , సాహితీ గుభాళింపుతో, సుగంధాలను అందించేదే. శ్రోతలను మురిపించేదే. మైమరపించేదే.
పాట కోసం సీతారామశాస్త్రి తపించేరు. పాట కోసమే కలవరించేరు. పాటతోనే జీవించేరు. పాటే జీవనం అని జీవితాన్ని సాగించేరు. పాటల ప్రేమికుడు, సాహితీ విలువల స్వాప్నికుడు. పాటల గోపురం, సాహితీ విలువుల మహోన్నత శిఖరం సీతారామశాస్త్రి. సిరివెన్నెల 1955 మే 20 న అనకాపల్లిలో సివి యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. ఈయన రాసిన ‘గంగావతరణం’ రూపకం చదివి, కళాతపస్వి కె. విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాలో గీత రచయితగా అవకాశం యిచ్చేరు. ‘చేంబోలు’ యింటి పేరును ‘సిరివెన్నెల’ గా మార్చేరు . 2019 లో పద్మశ్రీ పురస్కారం, 11 సార్లు నంది అవార్డు, 4 సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 35 సంవత్సరాల పాటు తనదైన వైవిధ్యమైన ముద్రతో, సినీ గీత ప్రపంచాన్ని ఒక ఏలుబడి ఏలేరు. ఎందరో మహానుభావుల ప్రశంసలు పొందేరు . పాటలు కూడా పాడేరు. నటించేరు కూడా. ‘భరణి’ పేరుతో రచనలు చేసేరు. సీతారామశాస్త్రి పాటలలో తెలుగుతనం, తెలుగుపథం, జిలుగు విధం, విధానం పరుగులు తీస్తాయి. పరవళ్ళు తొక్కుతాయి. సిరివెన్నెల తెలుగు వాడిగా పుట్టడం మనందరి అదృష్టం. అయితే యింతటి ప్రతిభా విశేషాలున్న సాహితీ మూర్తికి, యింత వరకు ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయక పోవటం శోచనీయం. అంతెందుకు? సిరివెన్నెల సీతారామశాస్త్రి తన ముద్దు బిడ్డడు అయినందుకు, తెలుగు సినీ గీతామతల్లి పలవరిస్తుంది. పులకరిస్తుంది. పరవశిస్తుంది.
జననం సీతారామ శాస్త్రిది.
మరణం సీతారామ శాస్త్రిది.
బతుకు మాత్రం కవిత్వానిది.

రమాప్రసాద్
ఆదిభట్ల
93480 06669

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News