Monday, April 29, 2024

సోనియాగాంధీ మాటిస్తే అది శిలాశాసనమే

- Advertisement -
- Advertisement -

మాటిస్తే కాంగ్రెస్ వెనుకడుగు వేయబోదు… సోనియాగాంధీ మాటిస్తే అది శిలాశాసనమే
సచివాలయంలో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  ఆర్థిక ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని, మాటిస్తే కాంగ్రెస్ వెనకడుగు వేయబొదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ మాటిస్తే అది శిలాశాసనమని ఆయన చెప్పారు. సోనియా మాటిస్తే తెలంగాణలో తప్పకుండా అమలు చేస్తామన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీని ఎప్పుడూ విస్మరించలేదని ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 హామీలు అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశమని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్థికంగా నియంత్రణ పాటిస్తూ ముందుకెళ్తున్నామని రేవంత్ చెప్పారు. సచివాలయంలో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
దేశంలో తెలంగాణ నమూనా తీసుకొస్తాం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేసి పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నామన్నారు. చేవెళ్లలో లక్షమంది మహిళల ముందు రెండు గ్యారంటీలను ప్రారంభించాలనుకున్నాం, కానీ, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ వల్ల చేవేళ్లలో ప్రారంభించలేకపోయామని రేవంత్ చెప్పారు. అందుకే సచివాలయంలో ఈ రెండు గ్యారంటీలను ప్రారంభిస్తున్నామన్నారు. పేదలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్‌దేనని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆనాడు దీపం పథకం కింద మహిళలకు రూ. 400 లకే కాంగ్రెస్ గ్యాస్ సిలిండర్ ఇచ్చిందన్నారు. బిజెపి వచ్చాక గ్యాస్ సిలిండర్ ధర రూ.1200లకు పెరిగిందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. మహిళల కళ్లలో ఆనందం చూడాలని రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తు న్నామన్నారు. తాము ఇచ్చిన హామీలను నమ్మే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు.

పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి,విధానాలు రూపొందించామన్నారు. నూటికి నూరుశాతం గ్యారంటీలు అమలు చేస్తామని, ఎవరెన్ని ఎలాంటి దుష్ప్రచారాలు చేసినా నమ్మొద్దని ఆయన సూచించారు. హామీలను అమలు చేయడంలో మా ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, తండ్రీ, కొడుకులు, మామా అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దేశంలో తెలంగాణ నమూనా తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News