Saturday, April 27, 2024

భయం వద్దు

- Advertisement -
- Advertisement -

 covid19

 

కరోనా వ్యాప్తిని కట్టడి చేశాం

అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
45 మందిలో నెగిటివ్ వచ్చింది
పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులకూ సోకలేదు
ఇద్దరు శాంపిల్స్‌లో స్పష్టత లేకపోవడంతో పుణేకు పంపాం
ఐఎఎస్‌లతో ప్రత్యేక కమిటీలు వేస్తున్నాం, కోఠి డిఎంఇ కార్యాలయంలో 24 గంటల కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం
– మంత్రి ఈటల

మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్19 (కరోనా) పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ప్రత్యక్షంగా కలిసిన వారిలో 45 మంది రిపోర్టులు నెగిటివ్‌గా వచ్చాయి. మరో ఇద్దరి శాంపిల్స్‌పై స్పష్టత లేకపోవడంతో పూణేకి పంపామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వీరిలో ఒకరు ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి కాగా మరొకరు శానిటేషన్ వర్కర్ ఉన్నట్లు మంత్రి తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులకూ కరోనా సోకలేదని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం గుర్తించిన 88 మందిలో మరో 20 మంది శాంపిల్స్ కూడా సేకరించామని, వాటిని కూడా ల్యాబ్‌లో నిర్థారణ చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని కోఠి డిఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) కార్యాలయంలో బుధవారం కరోనాపై ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత రెండు రోజులుగా రాష్ట్రంలో ప్రజలంతా కరోనాపై గందరగోళానికి గురవుతున్నారని, ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తున్నారని, ఇది సరైన పద్దతి కాదని ఆయన హెచ్చరించారు.

కొవిడ్19పై ప్రతి ఒక్కరూ జిమ్మదారుగా వ్యవహరించాలని అన్నారు. ప్రతి శాంపిల్‌ను కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశాల అనుగుణంగా పూణే ల్యాబ్‌లకు పంపుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నివసించే వారిలో ఎవరికి కరోనా సోకలేదని, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిలో మాత్రమే అనుమానిత లక్షణాలు నమోదవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అనుభవం కలిగిన వైద్యులచే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత సామాజిక, ప్రసార మాధ్యమాలపై కూడా ఉందని వ్యక్తం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా మాత్రమే పాజిటివ్ వచ్చిన వ్యక్తి నివసించే మహేంద్రహిల్స్‌లో శానిటేషన్‌పై ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ప్రజలంతా ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆయన ప్రజలకు భరోసానిచ్చారు.

ఐఎఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీలు
నలుగురు ఐఎఎస్ అధికారులతో నాలుగు కమిటీలతో పాటు మరొక ట్రైనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కమిటిలో ఒక్కో ఐఎఎస్ అధికారి ఉండగా, మంత్రి ఈటల వీటన్నింటికి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. హస్పిటల్ మేనేజ్‌మెంట్, సర్వెలెన్స్, ఐఇసి, ప్రొక్యూర్మెంట్ పేరిట కమిటిలు ఏర్పాటు చేసి కరోనా అవగాహన కోసం క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సర్వం సద్దం చేశారు.

నేటి నుంచి కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్
రాష్ట్రంలో కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారం కొరకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు. కోఠి డిఎంఇ కార్యాలయంలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ సెంటర్‌లో మంత్రితో పాటు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్, ఆయూష్ కమిషనర్, డిఎంఇ, డిహెచ్‌లతో పాటు ఇతర వైద్య ఉన్నతాధికారులంతా అందుబాటులో ఉండనున్నారు. ఈ సెంటర్ 24 గంటల పాటు నిరంతరం పనిచేస్తుందని, అన్ని ప్రాంతాల్లో సమాచారం తెలుసుకునేందుకు నిరంతరం నిఘా పెట్టినట్లు వైద్య మంత్రి వెల్లడించారు. కరోనా పై ఎలాంటి అనుమానాలు ఉన్నా 104 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.

50 వేల హెచ్1 ఎన్1 మాస్క్‌లు
రాష్ట్రంలో కరోనాపై ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఐసోలేషన్ వార్డులు, చికిత్స తదితర ఏర్పాట్లు చేయగా, తాజాగా ప్రత్యేకంగా మాస్క్‌లు కూడా పంపిణి చేస్తామని మంత్రి వెల్లడించారు. మాస్క్‌ల కొరకు కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేక చర్చలు జరిపామని, 50 వేల హెచ్1ఎన్1 మాస్కులు పంపిణి చేస్తామని కేంద్రం తెలిపిందని మంత్రి ఈటల తెలిపారు.

ముందుకు వచ్చిన ప్రైవేట్ ఆసుపత్రులు
ఇప్పటికే గాంధీ, ఫీవర్, చెస్ట్, వికారాబాద్ ఆసుపత్రులతో ఐసొలేషన్ వార్డుల్లో అనుమానిత లక్షణాలు వచ్చిన వారికి చికిత్సను అందిస్తుండగా, తాజాగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్సను అందించే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనాపై ఐసొలేషన్ వార్డులు, చికిత్స చేసేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ముందుకు వచ్చాయని మంత్రి తెలిపారు. అపోలో, మహవీర్, మమత, మల్లారెడ్డి, మెడిసిటి, ప్రతిమ, సాధన తదితర ఆసుపత్రులు కరోనాపై చికిత్సను అందించేందుకు ముందుకు రావడం సంతోషకరమని మంత్రి తెలిపారు. 85౦ బెడ్ కెపాసిటి కలిగిన ఈ ఆసుపత్రుల్లో 200 బెడ్లతో ఐసొలేషన్, మరో 50 బెడ్లతో చికిత్సను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

ఐసొలేషన్ కోసం కావాల్సిన పరికరాలతో పాటు ఇతర అవసరాల నిమిత్తం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అదే విధంగా కింగ్ కోఠి ఆసుపత్రిలో కూడా అన్ని ఏర్పాట్లతో కరోనా చికిత్స కోసం ప్రత్యేక వార్డులను సిద్దం చేస్తామని మంత్రి అన్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన అనుమానిత లక్షణాలు వాళ్ల శాంపిల్స్ ఈ ఆయా ఆసుపత్రుల్లోనే సేకరించి, నిర్థారణ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలని మంత్రి సూచించారు.

అసత్య ప్రచారాలు మానుకోవాలి
కరోనాపై అసత్య ప్రచారాలు మానుకోవాలని మంత్రి ఈటల తెలిపారు. వైరస్ ఎట్టి పరిస్థితుల్లో గాలి ద్వారా వ్యాప్తి చెందదని, కేవలం తుంపర్ల ద్వారా మాత్రమే సోకుతుందని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. కరోనా వ్యాధిగ్రస్తుడు తుంపర్లు టెబుల్స్, ఇతర వస్తువుల మీద పడ్డప్పుడు వాటిని ఇతరుకు ముట్టుకొని చేతులు కడుక్కోకుండా, ముక్కులో, నోట్లో, కంట్లో చేతులు పెట్టినప్పుడు మాత్రమే వైరస్ సోకుతుందని ఆయన తెలిపారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చిన తుంపర్ల ద్వారా 2 మీటర్ల దగ్గర ఉంటేనే వ్యాధి సోకే అవకాశముంటుందని తెలియజేశారు. నిత్యం చేతులు కడుక్కోవడం ద్వారా కరోనా నుంచి దూరంగా ఉండవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. అనుమానిత లక్షణాలు ఉండి నెగటివ్ రిపోర్టు వచ్చిన వారిని ఇంటికి పంపి వారిపై కూడా వైద్యులు నిఘా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

Special committees with IAS for control of covid19
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News