Monday, April 29, 2024

‘కల్వకుర్తి’లో కొత్తదేం లేదు

- Advertisement -
- Advertisement -

State ENC letter to Krishna Board

పెరిగిన ఆయకట్టు మేరకే నీటి కేటాయింపులు పెంచాం
రెండు కాంపోనెంట్లుగా గెజిట్‌లో పొందుపర్చటం సరైంది కాదు
800 అడుగుల వద్ద నుంచే నీటి ఎత్తిపోత
2006లోనే బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు డిపిఆర్
కృష్ణ బోర్డుకు రాష్ట్ర ఇఎన్‌సి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద పెంచిన ఆయకట్టు అవసరాలమేరకే నీటికేటాయింపులు పెంచామని ఈ పెంపుదల కొత్తదేమి కాదని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్యబోర్డుకు స్పష్టం చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల కింద కొత్తగా ఆయకట్టునుపెంచలేదని తెలిపింది. ఈ విషయంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని రెండు కాంపోనెంట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌లో పొందుపర్చడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ పథకం విషయంలో రెండు అంశాలను ఒకటిగా పొందుపరచాలని కోరుతూ కృష్ణానదియాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. గెజిట్‌నోటిఫికేషన్‌లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండవ కాంపెనెంట్‌ను 25టిఎంసిల నుండి 40టిఎంసిల వరకు పెంచినట్టు చూపించారని ఇది తప్పు అని తెలంగాణ ప్రభుత్వం లేఖలో స్పష్టం చేసింది.

ఆ నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్వకుర్తి ఆయకట్టును 2.5లక్షల ఎకరాలనుండి 3.65లక్షల ఎకరాలకు పెంచిదని తెలిపింది. కాని పెరిగిన ఆయకట్టు అవసరాల ప్రకారం ప్రాజెక్టుకు నీటికేటాయింపులు పెంచలేదని తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుర్తి పథకం కింద గతంలో ఎపి ప్రభుత్వం పెంచిన ఆయకట్టు అవసరాలకు సరిపోయేవిధంగా నీటికేటాయింపులు పెంచిందేతప్ప కొత్తగా ఆయకట్టును పెంచలేదని తెలిపింది. అంతే కాకుండా నీటి ఎత్తిపోతలను కూడా కొత్త ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని తీసుకోవటం లేదని తెలిపింది.కల్వకుర్తి పథకం కింద ఆయకట్టును పెంచుతూ ఆప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోల విరవాలను కూడ లేఖ ద్వారా బోర్డకు అందజేసింది.

2006లో ఇచ్చిన డిపిఆర్‌లోనే 800అడుగుల నీటిమట్టం:

కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం జలాశయం ద్వారా 800 అడుగుల వద్ద నుంచే నీటిని తీసుకునే విధంగా 2006లోనే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఇచ్చిన డిపిఆర్‌లో నివేదించినట్టు ఈఎన్సీ మురళీధర్ లేఖలో వివరించారు. ఆ ప్రకారమే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పాలమూరురంగారెడ్డి ,డిండి ఎత్తిపోతల పథకాలను కూడా అదేకారనంగా 800అడుగుల వద్దనే నీటిని తీసుకునే విధంగా డిజైన్ చేసినట్టు తెలిపారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని గాలేరునగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి ,తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టల నివేదికలను కూడా కూడా బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు ఇచ్చారని తెలిపారు . ఆ నివేదికల్లో శ్రీశైలం జలాశయం ద్వారా 885ఎఫ్‌ఆర్‌ఎల్‌కు సమీప మట్టం వద్ద నీటిని తీసుకునే విధంగా డిజైన్ చేసినట్టు ఈఎన్సీ తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కృష్ణానది బేసిన్‌లోని ప్రాజెక్టే కావున ఈ ప్రాజెక్టుకు నీటిమట్టం 800అడుగులకు డిజైన్ చేశారని, బేసిన్‌కు ఆవల ఉన్న ప్రాజేక్టులు కాబట్టే గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ తదితర ప్రాజెక్టులకు పూర్తి స్థాయి నీటిమట్టం 885అడుగుల వద్ద నుంచి నీటిని తోడుకునే విధంగా డిజైన్ చేశారని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 89ప్రకారం కొనసాగుతున్న బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వద్ద తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి పథకాన్ని ప్రస్తావిస్తూ ఈ పథాకనికి 75శాతం నికరజలాలను కేటాయించాలని కోరింది. ఆంధప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వెలిగొండ, గాలేరునగరి, హంద్రీనీవా తదితర ప్రాజెక్టులకు మిగిలు జలాలను కేటాయించాలని కోరిందేతప్ప 75శాతం నికర జలాలను కేటాయించాలని కోరలేదని కృష్ణాబోర్డుకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కారణాలన్నింటి రిత్యా తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన అన్యాయాలను సవరించడానికి చర్యలు తీసుకోవాలని , గెజిట్ నోటిఫికేషన్ నుండి కల్వకుర్తి రెండవ భాగాన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ మురళీధర్ లేఖ ద్వారా కృష్ణానదీయాజమాన్య బోర్డును కోరారు. లేఖ ప్రతిని అనుబంధాలతో సహా తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర జల్‌శక్తి మంత్రికి కూడ పంపనున్నట్టు ఈ ఎన్సీ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News