Monday, April 29, 2024

పటిష్టమైన ప్రణాళిక వల్లే..

- Advertisement -
- Advertisement -

Team India has emerged as strongest cricketing power in world

బలమైన శక్తిగా ఎదిగిన టీమిండియా

ముంబై: ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం టీమిండియా అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏక కాలంలో రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసే వెసులుబాటు ఒక్క భారత జట్టుకే ఉందంటే దాని రిజర్వ్‌బెంచ్ ఎంత బలంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇంగ్లండ్ టూర్ సమయంలోనే శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ను నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది. ప్రపంచ క్రికెట్‌లోని వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర టీమ్‌లకు ఒక్క జట్టునే ఎంపిక చేయడమే కష్టంగా మారింది. అయితే టీమిండియా పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత క్రికెట్ బోర్డుకు కనీసం మూడు బలమైన జట్లను ఎంపిక చేసేంత క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. పటిష్టమైన ప్రణాళిక, ముందు చూపుతో వ్యవహరించడం వల్లే ప్రపంచంలోనే భారత్ బలమైన క్రికెట్ శక్తిగా ఎదిగింది. ఒకవైపు వేలాది కోట్ల రూపాయలు, మరోవైపు ఐపిఎల్ వంటి కాసుల క్రికెట్ టీమిండియా ఎదుగుదలకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులకు దీటుగా భారత్‌కు కూడా పటిష్టమైన దేశవాళీ క్రికెట్ విధానం ఉంది. ప్రతి ఏడాది నిర్వహించే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలతో ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. దీనికి తోడు ఐపిఎల్ రాకతో టీమిండియా క్రికెట్ స్వరూపమే మారిపోయింది. విదేశీ, స్వదేశీ క్రికెటర్లతో నిర్వహించే ఐపిఎల్ వల్ల వందలాది మంది మెరికల్లాంటి ఆటగాళ్లు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, బుమ్రా, జడేజా, పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్, నటరాజన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్, సంజు శాంసన్ వంటి యువ ఆటగాళ్లు ఐపిఎల్ ద్వారానే టీమిండియాలో చోటు సంపాదించారు. వీరి రాకతో భారత జట్టు చాలా బలంగా తయారైంది. ఒకవైపు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, పుజారా, రహానె, విహారి, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్, షమి వంటి సీనియర్లు ఉండగా వీరికి తోడుగా ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా భారత క్రికెట్‌కు దొరికారు.

ఇటు సీనియర్, అటు జూనియర్ ఆటగాళ్ల కలయికతో టీమిండియా ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన జట్టుగా తయారైంది. ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా భారత్‌కు ప్రస్తుతం ఉంది. రానున్న రోజుల్లో టీమిండియా ప్రపంచ క్రికెట్‌ను శాసించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీనియర్లు లేకున్నా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో భారత్ సాధించిన చారిత్రక విజయమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. త్వరలో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, ట్వంటీ20 వరల్డ్‌కప్‌లలో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. భారత క్రికెట్ బోర్డు ముందు చూపుతో వ్యవహరించి తీసుకున్న నిర్ణయాల వల్లే టీమిండియా ఈ స్థాయికి చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News