Saturday, May 11, 2024

ఆగిపోయిన తెలంగాణ ఆట,పాట

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : ప్రజల ఆశలు ఆవేదనలే..పల్లె పాటలు…వారి మనసు ఆకళింపు చేసుకోవడానికి అవి ఎంతో అవసరం … లెనిన్ రాయినైనా పాటతో కరిగించే గొంతు ఆయనది.. ఆయన గజ్జె కట్టి ఆడి పాడితే సభా ప్రాంగణం దద్దరిల్లాల్సిందే… ఆయన గొంతు నుంచి సెలమిలాగా గోదావరి ఆలలులాగా పాటలు ప్రవహిస్తూనే ఉంటాయి… లక్షల మందిని సైతం తన పాటలతో నిలబెట్టగల చైతన్యం ఆయనది.. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనలో ధూం ధాం పేరుతో ఆయన ఆడిన ఆట పాట ప్రజల ఆకాంక్షల చైతన్యం ఆయన.. పిడియస్‌యు ఉద్యమ నేతగా తన జీవిత ప్రస్తానాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర సాధనలో పాటల సునామిగా మారి.. బిఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఎదిగిన నేత ఆయన.

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తలలో నాలుక ఆయన. ఆయన కంఠం లక్షల మంది ప్రజల్ని మంతృముగ్దుల్ని చేస్తుంది. ఆయనే సాయిచంద్..తెలంగాణ గాయకుడు.రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్…ఆయన బుధవారం ఆర్దరాత్రి నాగర్ కర్నూలు జిల్లా కారుకొండలో తమ ఫాంహౌస్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వేలాది మంది గుండెల్లో ప్రేమను సంపాదించిన సాయిచంద్ ఇక లేడని, ఆయన గొంతు ఇక వినపడదని వేలాది మంది ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సాయిచంద్‌ది వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రం. ఆయన సెప్టెంబర్ 20,1984 లో జన్మించారు. తండ్రి వెంకట్రాములు తల్లి మనెమ్మ .. వారికి ఇద్దరు మగ పిల్లలు. వీరిలో సాయిచంద్ రెండవ కుమారుడు. పెద్ద కుమారుడు మిలటరీలో పని చేస్తూ గత కొంతకాలం క్రితం ఆనారోగ్యంతో చనిపోయారు. తల్లి మనెమ్మ కూడా గత కొంత కాలం క్రితం కరెంట్ షాక్‌తో మృతి చెందారు.

తండ్రి వెంకట్రాములు ఆర్‌టిసి కండెక్టర్‌గా పని చేస్తూనూ విప్లవ భావాల వైపు ఆకర్శుతులయ్యారు. కండెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలంగా సిపిఐ ఎంఎల్ ప్రజా పంథ పార్టీలో పని చేస్తూ వచ్చారు. ఒక వైపు పార్టీలో పని చేస్తూనే మరో వైపు కుటుంబాన్ని నడుపుకుంటూ వచ్చారు. వెంకట్రాములకు పాటలన్నా.ప్రజా కళలు అన్నా ప్రాణం. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి కాలంగా ఆరుదోదయ కళామండలిలో పని చేశారు. అమరచింతలో పార్టీ బలంగా ఉన్న సందర్భంలో పార్టీ ఆద్వర్యంలోనే ఒక పాఠశాలను నడిపింది.  సాయిచంద్ 1 నుంచి పదవ తరగతి వరకు అమరచింతలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువు కున్నారు. ఇంటర్‌మీడియట్ ఆత్మకూర్ ప్రభుత్వ కళాశాలలో చదివారు. డిగ్రీ హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో చదివారు. ఎంఎ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. ఇంటర్ వరకు సాయిచంద్ పిడియస్‌యు నేతగా ఉంటూ వచ్చారు.

తండ్రి ఆరుణోదయ కళాకారుడు కావడంతో తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న సాయిచంద్ కూడా పాటలు పాడేవారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పిడియస్‌యులో ఉంటూనే తెలంగాణా రాష్ట్ర సాధనలో కీలకంగా పని చేశారు. పాటల ద్వారా తెలంగాణా కళాకారులు ధూం ధాం ఏర్పాటు చేయడంతో అందులో చేరారు. చిన్న ప్రాయంలోనే ధూం ధాంలో ఆయన ఆడిన పాడిన పాటలు తెలంగాణా మొత్తం సమాజాన్ని ఉర్రూతులాగించాయి. ఈ నేపథ్యంలోనే సాయిచంద్ కెసిఆర్‌కు దగ్గరయ్యారు. సాయిచంద్ పాటలు కెసిఆర్‌కు కూడా ప్రాణంగా మారడంతో సాయిచంద్ లేని సభ లేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ల్ర సాధన అనంతరం కూడా ముఖ్య మంత్రి కెసిఆర్ వెంట ఉంటూ వచ్చారు. టిఆర్‌ఎస్ పార్టీలో కీలకంగా ఉంటూ వచ్చారు. కెసిఆర్ సభ ఎక్కడ ఉన్నా లక్షల మంది ప్రజలను గంటల పాటు ఎక్కడా కదలనీయకుండా తన ఆటలు, పాటలతో ఆలరించేవారు. దీంతో వేలాది మంది ప్రజలకు ఎమ్మెల్యేలకు సాయి చంద్ దగ్గరయ్యాడు.

2012లో ప్రేమ వివాహంః
సాయిచంద్‌ది ప్రేమ వివాహం. ఉస్మానియా యూనివర్సిటీలో చదుకునే క్రమంలో విద్యార్ది ఉద్యమ నేతగా ఉంటూ ఆట, పాటలతో ఉన్న ఆయన అదే యూనివర్సిటీలో ఉన్న రజనినీ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో ఇరువురి కులాలు వేరు కావడంతో రజని తల్లిదండ్రులు ఒప్పుకోక పోయినప్పటికి తర్వాత ఇరువురి పెద్దల సహాకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. రజినిదీ కూడా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం వేముగోముల గ్రామం. వీరికి కుమారుడు చెర్రి.. కూతురు నది ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూన్న సాయిచంద్ ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో ఆయన మరణం తెలంగాణా సమాజానికి తీరనిలోటుగా మారింది.

మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శ:
సాయిచంద్ మరణ వార్త యావత్ పాలమూరు జిల్లాను కన్నీరు మున్నీరు చేసింది. ఆయన మరణ వార్త విన్న వెంటనే మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, రాజేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చిట్టెం రాంమోహన్ రెడ్డి, జైపాల్ యాదవ్ , భీరం హర్సవర్దన్ రెడ్డి,అబ్రహం, వంటి నేతలు వెళ్లి సాయిచంద్ భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు. సాయిచంద్ మరణం తెలంగాణా కే కాకుండా బిఆర్‌ఎస్‌కు తీరని లోటని వాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News