Monday, April 29, 2024

వరద బీభత్సంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం : కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో రెండు హెలికాప్టర్స్, 5 ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్

మనతెలంగాణ/ హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద బీభత్సంపై కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పందించారు. వరదల్లో చిక్కుకుపోయిన వారి నుంచి ఆయనకు గురువారం ఉదయం ఫోన్ కాల్ రావడంతో.. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి స్థానిక కలెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరదలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి ఊరంతా వరదలో మునిగిపోయిందని.. రెండు ఇండ్లపైకి స్థానికులు చేరుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Also Read: రద్దయిన రైళ్ల ఛార్జీలు వాపసు: దక్షిణమధ్య రైల్వే

స్థానికులు అక్కడినుంచి తనకు ఫోన్ చేసి సహాయం అర్థిస్తున్నారని, వారిని వీలైనంత త్వరగా ఆదుకునేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం.. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసి.. వెంటనే రెండు హెలికాప్టర్‌లను, 5 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను హుటాహుటిన రంగంలోకి దించింది. 2 హెలికాప్టర్‌ల ద్వారా ఆ రెండు ఇండ్లపై చిక్కుకున్న గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించారు. సమీపంలోని గ్రామాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీలతోపాటు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో వీరికి ఆశ్రయం కల్పించారు.

బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భూపాలపల్లి జిల్లాలో 6 ఓపెన్ కాస్టులు పూర్తిగా నీటమునగగా.. మోరంచపల్లి, చేనుపాక, కాల్వపల్లి, మొగుళ్లపల్లి ప్రాంతాల్లో 12 చెరువుల గట్లు తెగగా.. టేకుమట్ల- రాఘవరెడ్డి పల్లె మధ్య కొత్తగా నిర్మించిన రెండు వంతెనలు తెగిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి సూచించారు. అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అవసరమైనవారికి సహాయం అందించేందుకు బిజెపి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News