Sunday, April 28, 2024

సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్

- Advertisement -
- Advertisement -

వనపర్తి : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సంక్షేమ సంబరాలలో భాగంగా వివిధ పథకాల లబ్ధిదారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జెడ్పి చైర్మెన్ లోక్‌నాథ్ రెడ్డితో కలిసి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దమనసుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ తరహా ఎక్కడా పథకాలు లేవన్నారు. దేశంలో ఎక్కడా కళ్యాణ లక్ష్మి వంటి పథకం లేదని, పేద ఆడబిడ్డల కోసం రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా కాన్పు చేసి కెసిఆర్ కిట్ ఇచ్చి వాహనంలో ఇంటి వద్ద దింపుతున్నారని అన్నారు. రైతు ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తుంది ఒక్క తెలంగాణలోనే అని అన్నారు. ఒక్కో విద్యార్థి మీద ఏటా 1.20 లక్షలు ఖర్చు పెడుతూ లక్షల మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ రేపటి తరాన్ని తయారు చేసుకుంటున్నామన్నారు.

కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వనపర్తిలో 600పడకల ఆసుపత్రి నిర్మించుకుని భవిష్యత్తులో పేదలు వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా చేస్తున్నామన్నారు. ప్రతి రెండు మూడు గ్రామాల మధ్య ఒక పల్లె దవాఖానా ఏర్పాటు చేస్తున్నామన్నారు. డయాలసిస్ కోసం పేదలు ఎక్కడికి వెళ్లకుండా వనపర్తిలోనే పది బెడ్లు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.

అర్హులందరికి సంక్షేమ పథకాలు దశల వారిగా అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నది ప్రభుత్వ లక్షమని, సామాజిక అసమానతలు రూపుమాపేందుకు సంక్షేమ పథకాలతో చేయూత అందిస్తున్నామన్నారు. 14 ఏండ్లు కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నామని, 9 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. ఏరువడ్డ తర్వాత బాగుపడ్డామని ఇప్పుడు దశాబ్ది సంబరాలు చేసుకుంటున్నామని అన్నారు.

కలెకటర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ పేదల కోసమే సంక్షేమ పథకాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థికంగా జీవితంలో నిలదొక్కుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News