Saturday, April 27, 2024

ఎల్లుండి ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

Telangana mlc elections 2021 date

అభ్యర్ధుల ఎంపికలో అధికార పార్టీ నిమగ్నం
లోతుగా సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్
ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా వెలువడనున్న తుది జాబితా
ఆశావహుల్లో నెలకొన్న టెన్షన్…టెన్షన్

హైదరాబాద్ : ఎంఎల్‌ఎ కోటా కింద ఎంఎల్‌సి స్థానాలకు మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో ఆరు స్థానాలకు ఈ 19వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇప్పటికే పలుమార్లు సమీక్షించారు. ఎంఎల్‌సి స్థానాల కోసం ప్రధానంగా పోటీపడుతున్న నాయకుల పేర్ల జాబితాపై ఒకటికి, రెండు సార్లు వడపోత కార్యక్రమాన్ని ఇప్పటికే నిర్వహించారు. ఈ కసరత్తును పూర్తి చేసి ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా అభ్యర్ధుల జాబితాను వెల్లడించాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎల్‌సి స్థానాలపై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతల్లో తీవ్ర స్థాయిలో టెన్షన్ నెలకొంది. ఈ సారైనా ఎంఎల్‌సిగా తమకు అదృష్టం వరిస్తుందా? లేదా? అన్న అంశంపై ఆశావహులకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నది. అయితే ఎంఎల్‌సిగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారిలో టిఆప్‌ఎస్ జాబితా చాంతాండంత ఉంది. వారిలో అవకాశం లభించేది కేవలం ఆరుగురి మాత్రమే. దీంతో తుది జాబితాలో చోటు ఎవరికి లభిస్తుందన్నది టిఆర్‌ఎస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠతకు గురి చేస్తున్నది.

ఈ ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు గత నెల 31వ తేదీన షెడ్యూల్ విడుదలయిన విషయం తెలిసిందే. ఈ నెల19వ తేదీన పోలింగ్ జరగనుండగా, అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఆరుగురు ఎంఎల్‌సి స్థానాల పదవీ కాలం జూన్ 3వ తేదీన ముగిసింది. ఈ స్థానాలకు అప్పట్లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వస్తూ వచ్చింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉండడంతో ఖాళీగా ఉన్న ఎంఎల్‌సి స్థానాలకు భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. గత నెల 30వ తేదీన హుజురాబాద్‌కు జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి చాలా మంది కీలక నేతలు టిఆర్‌ఎస్‌లోకి వచ్చారు. వారిలో కాంగ్రెస్ నుంచి పాడికౌశిక్ రెడ్డి, టిడిపి నుంచి ఎల్.రమణ, బిజెపి నుంచి ఇ.పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు వంటి నేతలు ఉన్నారు.

అయితే ఎల్.రమణ, కౌశిక్ రెడ్డికి ఎంఎల్‌సిగా అవకాశం కల్పిస్తామని గతంలోనే సిఎం కెసిఆర్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన హామి ఇచ్చినట్లుగానే కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎంఎల్‌సి స్థానానికి నామినేట్ చేశారు. కానీ పలు కారణాలతో ఆ ఫైల్ ఇంకా గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డికి ఎంఎల్‌ఎ కోటా కింద అవకాశం కల్పించాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన స్థానంలో గవర్నర్ కోటాలో మరో నాయకుడికి సిఎం అవకాశం కల్పించనున్నారని టిఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. వీరితో పాటు ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న పలుమారు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌సిలతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎంఎల్‌సి స్థానం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం లభిస్తున్నదన్నది మరో ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు నేతలకు హై…టెన్షన్ తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News