Monday, April 29, 2024

బిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్

- Advertisement -
- Advertisement -

ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కరిస్తామని కెటిఆర్ హామీ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం(టిపిటిఎఫ్) బిఆర్‌ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో సంఘం నాయకులు ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌ను కలిసి బిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ప్రైవేటు టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో టీచర్లకు ఇఎస్‌ఐ, ఇపిఎఫ్ అమలు, 12 నెలల వేతనం, ప్రభుత్వం ప్రకటించిన సెలవుల అమలు, అధిక సమయపాలన వంటి సమస్యలతో పాటు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలని మంత్రిని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రభుత్వం రెగ్యులేషన్ కమిటీ వేయాలని, జిఒ.-1లో మార్పులు చేసి పునరుద్దిరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కెటిఆర్ స్పందిస్తూ ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, ఆ సమస్యల పరిష్కారంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 12 వేల ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను యుడైఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఉపాధ్యాయుల వివరాలు, వారి సంఖ్య తెలిస్తే వారికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా వారికి అందేలాగా చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరోసారి ప్రైవేట్ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలకు పరిష్కారం చేస్తామని, మిగతా సమస్యలను విడతల వారీగా పరిష్కరించుకుందామనీ హామి ఇచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చిన కెటిఆర్‌కు సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కెటిఆర్‌ను కలిసిన వారిలో బయ్యా శివరాజ్, నిరుపమ సంజయ్, నవీన్ గౌడ్, రేణుక పవన్, అమీరుద్దిన్, సుబ్బలక్ష్మి, భాస్కర్ రాథోడ్, అప్జల్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News