Monday, April 29, 2024

ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎంపి సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రన్ కుసుమ జగదీష్ అంకితం

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ బహుముఖ రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో పిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచర్ల నుండి డెకాథ్లాన్ వరకు మూడు కిలోమీటర్ల తెలంగాణ రన్ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని సిఎం కెసిఆర్ వెంట నడిచిన ఉద్యమకారుడు, ములుగు జడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ గారి సంతాప సూచికగా రెండు నిమిషాలు పాటు మౌనం పాటించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలను అదుపులో ఉంచడంతోనే అభివృద్ధి సాధ్యం అయిందని, ఇతర రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా సాధించలేని అభివృద్ధి తెలంగాణ దశాబ్ద కాలంలోనే సాధించగలిగామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిసిటివి కెమెరాల ఏర్పాటు ద్వారా నేర పరిశోధన వేగవంతం అయిందని, నేరశాతం కూడా తగ్గుముఖం పట్టిందని, పోలీసు శాఖలోని వివిధ విభాగాల సమన్వయంతో ఎటువంటి నేరం అయినా ఒకే రోజులో నేరస్తులను పట్టుకునే స్థాయికి రాష్ట్ర పోలీసు శాఖ చేరుకుందని పేర్కొన్నారు.

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాల వల్ల మౌలిక వసతుల కల్పనతో పాటు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు ప్రజలకు అందాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని శాంతి భద్రతల పరంగా ఉన్నత స్థానంలో ఉంచడానికి రాష్ట్ర పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు జరగకుండా, శాంతి భద్రతల పరంగా ప్రశాంతంగా ఉంచడానికి రాచకొండ పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారన్నారు. ఈవ్ టీజింగ్, మహిళల మీద వేధింపులు, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, వాహనాల తప్పుడు నంబర్ ప్లేట్లు వంటి ఎన్నో రకాల నేరాల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అందువల్లే రాచకొండ పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ మొక్కలు నాటారు. మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి డిసిపి జానకి, మేడ్చల్ కలెక్టర్ అమెయ్ కుమార్, ఎస్‌ఓటి డిసిపిలు గిరిధర్, మురళిధర్, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, మల్కాజిగిరి ఎసిపి నరేష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News