Sunday, April 28, 2024

మన తర్వాతే ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

ప్రైవేటు టీకాల్లో తెలంగాణదే పైచేయి

వ్యాక్సినేషన్‌లో మేడ్చల్, కామారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ముందంజ

Telangana top in administering vaccine doses

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మేడ్చల్, కామారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతుంది. మిగతా జిల్లాలతో పోల్చితే ఈ జిల్లాల్లో ప్రతి మిలియన్‌కు డోసెస్ పంపిణీ అత్యధికంగా ఉందని ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే రోజురోజుకి ప్రజల నుంచి అనూహ్యమైన ఆధరణ లభిస్తుందని అధికారులు అంటున్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం సుమారు 50 శాతం మంది అదనంగా టీకాల కోసం క్యూ కడుతున్నట్లు వైద్యశాఖ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎప్పటికప్పుడు టీకా పంపిణీని స్పీడప్ చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రోజు మినియన్‌కు(ప్రతి పది లక్షల మంది) 1171 మందికి టీకా వేస్తుండగా, రోజుకు సగటున 41వేల మందికి పంపిణీ జరుగుతుంది. అయితే వీటిలో అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో ప్రతి మిలియన్‌కు 3281 మందికి డోసులు వేస్తుండగా, సగటున 8007 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అదే విధంగా కామారెడ్డి జిల్లాలో ప్రతి మిలియన్‌కు 2808, హైదరాబాద్‌లో 2279 మందికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు కొవిన్ డ్యాష్‌బోర్డులో పొందుపరిచారు.

దీంతో పాటు ఆదిలాబాద్‌లో ప్రతి మిలియన్‌కు 745, భద్రాద్రి 1620, జనగాం 1049, భూపాలపల్లి 389, గద్వాల 995, కరీంనగర్ 1039, జగిత్యాల 609, ఆసిఫాబాద్ 311, మహబాబాబాద్ 629, మంచిర్యాల 490, మహబూబ్‌నగర్ 645, ఖమ్మంలో 1178, మెదక్ 1654, ములుగు 419, నాగర్ కర్నూల్‌లో 964, నల్గొండ 602, నారాయణపేట్ 414, నిర్మల్ 681, నిజామాబాద్ 635, పెద్దపల్లి 916, సిరిసిల్లా 780, రంగారెడ్డి 213, సంగారెడ్డి 1419, సిద్ధిపేట్ 868, సూర్యాపేట్ 1690, వికారాబాద్ 326, వనపర్తి 1103, వరంగల్ రూరల్ 415, వరంగల్ అర్బన్ 1597, వనపర్తిలో 1470 మందికి పంపిణీ చేస్తున్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో రికార్డు చేశారు. అయితే వీటిలో పది జిల్లాలు స్టేట్ సగటును దాటి పోగా, 13 జిల్లాలు రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉన్నట్లు నమోదైయ్యాయి.
ఎప్పటికప్పుడు సమీక్షలతో స్పీడప్….
వ్యాక్సినేషన్ స్పీడప్ చేసేందుకు అధికారులు నిత్యం ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర స్థాయిలో హెల్త్ డైరెక్టర్ డా.జి శ్రీనివాసరావు, వ్యాక్సినేషన్ స్పెషలాఫీసర్ డా.సుధీర ఆధ్యర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతుండగా, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక మీటింగ్‌లు ఏర్పాటు చేసుకుంటూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది. హైయర్ ఆఫీసర్ నుంచి ఆశావర్కర్ వరకు సమన్వయంతో టీకా పంపిణి వేగంగా జరిగేలా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా ప్రారంభమైనప్పటి నుంచి క్షేత్రస్థాయిలో క్రీయాశీలకంగా పనిచేస్తున్న ఆశాలు, అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు అద్బుతంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం, వైద్యశాఖ సూచించిన మార్గదర్శకాలను గ్రౌండ్‌లెవల్‌లో తీసుకువెళ్లడంతో పాటు, వాటిని సమర్ధవంతంగా అమలయ్యేందుకు వారు డెటికేటేడ్‌గా వర్క్ చేస్తున్నారు. వ్యాక్సిన్ అపోహలపై అవగాహన కల్పించడంతో పాటు, వ్యాక్సినేషన్ వేగవంతమయ్యేందుకు డేటా సేకరించడం వంటి పనులను సకాలంలో పూర్తిచేస్తున్నారు. అంతేగాక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, వృద్ధులను కూడా వేగంగా గుర్తించి వారికి టీకా అందించడంలోనూ వీరే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ఆయా జిల్లా అధికారులు చెబుతున్నారు.
ప్రైవేట్ పంపిణీల్లోనూ మనం ముందంజ….
ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా పంపిణీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆగ్రస్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు సగటున 364 ప్రభుత్వ , 218 ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండగా, వీటిలో ఇప్పటి వరకు సుమారు 11,85,771 మందికి వ్యాక్సిన్ వేశారు. అయితే వీరిలో 8,54,334 మంది ప్రభుత్వ కేంద్రాల్లో తీసుకోగా, 3,31,437 మంది ప్రైవేట్‌లో తీసుకున్నట్లు అధికారిక బులెటెన్‌లో పేర్కొన్నారు. అంటే ప్రైవేట్ కేంద్రాల్లో ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ మరే రాష్ట్రంలోనూ జరగలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 48.39 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 43.11 శాతంతో ఢిల్లీ సెకండ్ స్థానంలో ఉందని కేంద్రం ప్రకటించింది. అయితే వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకే ప్రైవేట్ కేంద్రాలకు కూడా అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అతి త్వరలో పంపిణీ కేంద్రాలను కూడా పెంచుతున్నట్లు వైద్యశాఖ తెలిపింది.
టాప్ 10 కొవిడ్ 19 వ్యాక్సిన్ సెంటర్లు ఇవే…
శ్రీశ్రీహోలిస్టిక్ హాస్పిటల్, అపోలో, యశోదా సికింద్రాబాద్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్, యశోదా సోమాజిగూడ, శేరిలింగంపల్లి పిహెచ్‌సి, ఓజోన్, సెంట్రల్ రైల్వే హాస్పిటల్, యశోదా మలక్‌పేట్, ప్రతిమా హాస్పిటల్స్‌లో ప్రతి రోజు అత్యధికంగా వ్యాక్సిన్ వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
టీకా వలన బ్లట్ క్లాట్ అవుతుందనే వాదనలో నిజం లేదు….డా కిరణ్ మాదాల క్రిటికల్ కేర్ ఎక్స్‌పర్ట్
టీకాలు తీసుకోవడం వలనే బ్లడ్ క్లాట్ అవుతుందనే వాదనలో నిజం లేదని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి అనస్థీషియా హెచ్‌ఓడి, క్రిటికల్ కేర్ ఎక్స్‌పర్ట్ డా కిరణ్ మాదాల అన్నారు. మనకు వచ్చిన కొవిషీల్ట్, కోవాగ్జిన్ టీకాలు రెండూ సురక్షితమేన్నారు. ఈ రెండింటికి 81 శాతం ఎఫికసీ ఉందన్నారు. స్వల్పమైన రీయాక్షన్లు సహజమేనని తెలిపారు. ఇటీవల కొవిషీల్డ్ తీసుకున్న వారికి రీయాక్షన్లు ఎక్కువగా వస్తుండటంతో డోసుల మధ్య గ్యాప్ 6 నుంచి 8 వారాలకు పెంచారన్నారు. కరోనాని నియంత్రించాలంటే కేవలం వ్యాక్సిన్‌తోనే సాధ్యమన్నారు. మరోవైపు ఒకవేళ రెండు డోసులు పూర్తయిన తర్వాత కూడా వైరస్ వచ్చినా హాస్పిటలైజేషన్, సీరియస్ పరిస్థితులు రావన్నారు. కావున ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
“మాకేం కాలేదు” అనే నినాదంతో వెళ్తున్నాంః డా శేఖర్ ఇంచార్జీ డిఎంహెచ్‌ఓ కామారెడ్డి
టీకా వలన ఎలాంటి ప్రమాదం లేదని ప్రత్యేకంగా ప్రజలకు అవగాహనకు కల్పిచేందుకు తామే స్వయంగా రంగంలోకి దిగినట్లు కామారెడ్డి జిల్లా ఇంచార్జీ డిఎంహెచ్‌ఓ డా శేఖర్ అన్నారు. ‘టీకా తీసుకున్నప్పటికీ మాకేం కాలేదు’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. కామారెడ్డి జిల్లాలో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు సుమారు 1.30 లక్షల మంది ఉండగా వీరిలో ఇప్పటికే 40 శాతం మందికి టీకాలు ఇచ్చామన్నారు. అంతేగాక ఎలాంటి స్పల్పమైన రీయాక్షన్లు తేలినా ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీల సహయంతో సదరు బాధితులను పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నామన్నారు. దీంతోపాటు ఎక్కువ మంది టీకా వేసుకునేలా ప్రీ టీకాలను వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు. మరోవైపు ఇళ్ల వద్దకు వెళ్లి కూడా తమ సిబ్బంది డేటా కలెక్ట్ చేస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40వేల మందికి పైగా టీకా పంపిణీ చేయగా ఎవరికీ సీరియస్ పరిస్థితులు లేవన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి రోజు సగటున 4వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నామని వివరించారు.
ప్రతి పది లక్షల మందికి ఇచ్చే టీకాల వివరాలు..
జిల్లా              మిలియన్ పర్ డోసు    సగటు       జిల్లా          మిలియన్ ఫర్‌డోసు   సగటు
ఆదిలాబాద్              745              522       భద్రాద్రి             1620          1734
జనగాం                  1049            594       భూపాలపల్లి        389            162
గద్వాల                  995              597       కామారెడ్డి           2808          2724
కరీంనగర్                1039           1039       జగిత్యాల           609            600
ఆసిఫాబాద్              311             184        మహబూబాబాద్    629            487
మంచిర్యాల              490              392       మహబూబ్‌నగర్     645           955
ఖమ్మం                  1178           1768       హైదరాబాద్         2279         9116
మెదక్                  1654            1269       మేడ్చల్             3281         8007
ములుగు               419              109         నాగర్‌కర్నూల్       964           961
నల్గొండ                602               964        నారాయణపేట్       414            232
నిర్మల్                  681              477        నిజామాబాద్         635           997
పెద్దపల్లి                916               729         సిరిసిల్లా             780           431
రంగారెడ్డి              213               5201        సంగారెడ్డి            1419         2157
సిద్దిపేట్               868               868         సూర్యాపేట్            1690         1859
వికారాబాద్            326              303          వనపర్తి               1103         637
వరంగల్‌రూరల్        415               298         వరంగల్ అర్బన్       1597        1725
వనపర్తి               1470              1087

మరో 12,605 మందికి వ్యాక్సిన్
రాష్ట్రంలో మరో 12,605 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 12,565 మంది మొదటి డోసు, 40 మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు 2,24,054 హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా, 1,69,679 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 1,14,039 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 64,869 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. అంతేగాక 4,02,204 వృద్ధులు, 2,10,926 మంది 45 నుంచి 59 ఏళ్ల మధ్యగల దీర్ఘకాలిక వయస్కులు టీకా తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11,85,771 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. వీరిలో 8,54,334 మంది గవర్నమెంట్ కేంద్రాల్లో, మరో 3,31,437 మంది ప్రైవేట్ కేంద్రాల్లో టీకా తీసుకున్నట్లు అధికారులు నివేదించారు.

Telangana top in administering vaccine doses

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News