Monday, April 29, 2024

కృష్ణ బోర్డు భేటీ నుంచి రాష్ట్రం వాకౌట్

- Advertisement -
- Advertisement -

Telangana walkout from Krishna board meeting

విద్యుదుత్పత్తి ఆపబోమని స్పష్టీకరణ
ఎపి ప్రాజెక్టులపై రాష్ట్ర అధికారుల అభ్యంతరాలు రాయలసీమ ప్రాజెక్టుపై కెఆర్‌ఎంబి ఉదాసీనంగా
వ్యవహరిస్తోంది ఎపి చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై లేఖలు గతంలో ఎపి, తెలంగాణ మధ్య జరిగిన 512 : 219 టిఎంసిల నీటి పంపిణీ తాత్కాలికమే ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50:50 నిష్పతిలో నీటిపంపిణీ జరగాలని డిమాండ్ కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం నుంచి ప్రభుత్వం వాకౌట్ ఐదు గంటల పాటు జరిగిన సమావేశం

కృష్ణలో ఎపి, తెలంగాణ వాటాలు 66:34

మనతెలంగాణ/ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణిపై బుధవారం నాడు జరిగిన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాకౌట్ చేసింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సుమారు ఐదు గంటలకుపైగా కొనసాగిన సమావేశంలో చైర్మన్ ఎపి ప్రభుత్వానికి మద్దతిస్తూ శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని, సాగర్, కృష్ణా డెల్టా అవసరాలకు అనుగుణంగానే విద్యుత్ ఉత్పత్తి ఉండాలన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్ ఉత్పత్తి ఆపేది లేదని తేల్చి చెప్పింది. ఇరిగేషన్ లిఫ్ట్ పని చేసినప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలని బోర్డ్ చైర్మన్ పేర్కొనగా ఈ వ్యాఖ్యలపై నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

కెఆర్‌ఎంబి చైర్మన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. కృష్ణా జలాల పంపిణిపై జరిగిన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం దాదాపు ఐదుగంటలపాటు సుదీర్ఘంగా సమావేశం సాగిన క్రమంలో జల విద్యుదుత్పత్తి విషయంలో ఛైర్మన్ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా సాగునీరు, మంచినీరు అవసరాలు తీర్చిన తర్వాతనే జల విద్యుదుత్పత్తిని చేపట్టాలన్న ఛైర్మన్ నిర్ణయాన్ని సర్కారు తప్పుపట్టింది. ఇదిలావుండగా కెఆర్‌ఎంబి సమావేశం ముగిసిన అనంతరం కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం ప్రారంభమయ్యాయి. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చించాయి.

కృష్ణా జలాల్లో పంపకంపై జలసౌధలో జరిగిన కెఆర్‌ఎంబి సమావేశం బుధవారం నాడు ముగిసింది. సమావేశానికి ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ కార్యదర్శులు, కెఆర్‌ఎంబి అధికారులు హాజరయ్యారు. ఈక్రమంలో తెలంగాణ వాదనలను ఇరిగేషన్ అధికారులు బలంగా వినిపించారు. ముఖ్యంగా కెఆర్‌ఎంబి అధికారులపై తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తీవ్రంగా మండిపడ్డారు. ఎపి చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై ఎపి ప్రభుత్వం లేఖలు రాస్తోందని తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్ నుంచి ఎపి తరలిస్తున్న నీటిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా అక్రమ ప్రాజెక్ట్ అని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పట్టుపట్టారు. కాగా శ్రీశైలం హైడల్ పవ్ప ఎపిఅభ్యంతరం చెప్పింది. కృష్ణా నది మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నామని, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కడుతున్న ప్రాజెక్టులకు అనుమతి లేదని ఏపీ వాదించింది. కెఆర్‌ఎంబి చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జలసౌధలో జరిగిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ సమావేశానికి ఎపి నుంచి జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు, ఇఎన్‌సి నారాయణ రెడ్డి, జలవనరుల అంతర్ రాష్ట్ర జల విభాగం సిఇ శ్రీనివాస్ రెడ్డి హాజరుకాగా, తెలంగాణ నుంచి జల వనరుల శాఖ సెక్రటరీ రజత్ కుమార్, ఇఎన్‌సి మురళీధరరావు, అంతర్రాష్ట్ర జల విభాగం సిఇ మోహన్ కుమార్ హాజరయ్యారు.

శ్రీశైలంలో విద్యుతుత్పత్తి అపే ప్రసక్తి లేదు 

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపే ప్రసక్తే లేదని, ఆంధ్రప్రదేశ్ కావాలనే అన్ని విషయాల్లోనూ కొర్రీలు పెడుతోందని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తేల్చిచెప్పారు. కృష్ణా బేసిన్ పరిధిలో లేని ప్రాంతాలకు నీటిని తరలిస్తూ తెలంగాణపై నిందలు వేస్తోందన్నారు. రాయలసీమ ప్రాజెక్టుపై కెఆర్‌ఎంబి ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈక్రమంలో కృష్ణా బోర్డు సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ నీటిని సమాన నిష్పత్తిలో పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఎపికి 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిల కేటాయింపులు తాత్కాలికమన్న రజత్ కుమార్ అవి కేవలం 2015-16 ఏడాదికి వర్తించేలా అంగీకారం కుదిరిందన్నారు.

ఎస్‌ఎల్‌బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు పూర్తైనందున నీటి వినియోగం పెరిగిందని వివరించారు. సమాన నిష్పత్తిలో నీటి పంపిణీ విషయంలో రాజీపడేది లేదన్న రజత్‌కుమార్ సమాన వాటాపై కెఆర్‌ఎంబి ఛైర్మన్ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ జలసౌధలో కేఆర్‌ఎంబీ ఛైర్మన్ ఎం.పి.సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎపి, తెలంగాణ అధికారులు, ఇంజినీర్లు హాజరై కృష్ణా జలాల పంపిణీ, శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి, గోదావరి జలాల మళ్లింపు సహా 13 అంశాలపై చర్చించారు.

కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోసం రాష్ట్ర అధికార యంత్రాంగం పట్టుబట్టింది. గతంలో ఎపి, తెలంగాణ మధ్య జరిగిన 512 : 219 టిఎంసిల నీటి పంపిణీ తాత్కాలికమేనని అధికారులు వాదించారు. కేవలం 2015-16 ఏడాదికి వర్తించేలా మాత్రమే అంగీకారం కుదిరిందని చెప్పారు..ఎస్‌ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు పూర్తయ్యాయని నీటి వినియోగం పెరిగిందని వాదనలు వినిపించారు.. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాలని డిమాండ్ చేసారు.

ఏపీ ప్రతిపాదించిన 70:30 నిష్పత్తిని అంగీకరించమని స్పష్టం చేశారు. ఈక్రమంలో తెలంగాణ వాదనలకు ఎపి ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీకి ససేమిరా అనడంతో పాటు 70:30 ఫార్ములానే ఫాలో కావాలని డిమాండ్ చేసింది. అదేవిధంగా అటు విద్యుత్ ఉత్పత్తిపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో పవర్ జనరేషన్‌ను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది.. ఎపి అధికారులు 10 అంశాలపై తమ వాదనలు వినిపించారు. ఈక్రమంలో ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొత్తానికి నీటి లెక్కలు, ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తిపై ఎవరి వాదనలకు వారే కట్టుబడటంతో పంచాయితీ కొనసాగింది..

ఎపి వాదనలు సమర్థించిన కెఆర్‌ఎంబి

ఎపి అధికారులు విద్యుత్ ఉత్పత్తిపై వ్యక్తం చేసిన అభ్యంతరాలను కెఆర్‌ఎంబి చైర్మన్ ఎంపీ సింగ్ పరిగణలోకి తీసుకున్నారు. ఎపి అధికారుల వాదనలు కెఆర్‌ఎంబి సమర్థించింది. సాగర్, కృష్ణా డెల్టాలకు అవసరాలకు అనుగుణంగానే విద్యుత్ ఉత్పత్తి ఉండాలని కెఆర్‌ఎంబి చైర్మన్ తెలిపారు. దీంతో జలవిద్యుత్ ఉత్పత్తిలో చైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని తెలంగాణ అధికారులు కెఆర్‌ఎంబి సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News