Sunday, April 28, 2024

చేయూత ఇస్తున్న చేనేత!

- Advertisement -
- Advertisement -

Textile Industry has become big business

 

చారిత్రక నేపథ్యమున్న అతికొద్ది కుల వృత్తులలో చేనేత ఒకటి. పద్మశాలి, దీని అనుబంధ కులాల వృత్తిగా కొనసాగుతున్నట్లు పురాణేతిహాసాలు స్పష్టం చేస్తున్నప్పటికీ… పెరుగుతున్న జనాభా, అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధికి ఊతమిస్తుండటంతో ఇతర కులాలు సైతం ఈ వృత్తిని ఆశ్రయి స్తున్నారు. కూడు, గూడు తర్వాత గుడ్డ ప్రతి వ్యక్తి అవసరంగా మారడంతో ప్రపంచ వ్యాప్తంగా చేనేత రంగానికి మంచి డిమాండ్ ఏర్పడింది. టెక్స్‌టైల్ పరిశ్రమ ఓ పెద్ద వ్యాపారంగా మారింది. మన దేశంలో ప్రతి రాష్ర్టం తమదైన ‘బ్రాండ్’తో చేనేత వస్త్రాలకు రూపకల్పన చేస్తూ అంతర్జాతీయ కీర్తిని అందుకుంటున్నది. చేనేత నిర్వహణ కులాలకు అతీతంగా ఉపాధి మార్గంగా కొనసాగుతున్నది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, ఇతరులు చేనేత వృత్తిలో కొనసాగుతున్నారు. మతాలకు అతీతంగా హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు, సిక్కులు, బుద్ధులు, జైన్లు, జోరాస్ట్రియన్లు తదితర మతాలకు చెందినవారు కూడా చేనేత కళాకారులుగా రాణిస్తున్నారు. వీరిలో చాలా మందికి సొంత మగ్గాలుండగా, మరి కొందరు అద్దెకు తీసుకుని వస్త్ర రూపకల్పనతో ముందుకు సాగుతున్నారు.

చేనేత, దీనికి అనుబంధ పనులతో దేశ వ్యాప్తంగా 31.45 లక్షల నేత గృహాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘నాలుగవ అఖిల భారత చేనేత గణన (2019-20)’ వెల్లడించింది. ఇది మూడవ గణన కంటే 3.62 లక్షలు అధికం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు, ప్రోత్సాహకాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నేషనల్ హాండ్లూం డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎన్‌హెచ్‌డిపి), కంప్రెన్సివ్ హాండ్లూం క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీం (సిహెచ్‌సిడిఎస్), హాండ్లూం వీవర్ కంప్రెన్సివ్ వ్ల్ఫైర్ స్కీం (హెచ్‌డబ్ల్యుసి డబ్ల్యుఎస్), యార్న్ సప్లై స్కీం (వైఎస్‌ఎస్) తో పాటు ముద్ర తదితరమైన పథకాలు చేనేతకు ఊపిరి పోస్తున్నాయి. అయితే ఈ చేనేత జనగణనలో భాగంగా 25,45,312 నేత గృహాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందు లో భాగంగా మొత్తం 26,73,891 మంది చేనేతకారులను లెక్కలోకి తీసుకున్నారు.

దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 18 లక్షల నేత గృహాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. అసోం లో 10.9, పశ్చిమ బెంగాల్‌లో 3.4, మణిపూర్‌లో 2.1, తమిళనాడులో 1.7 లక్షల నేత గృహాలున్నాయి. 22.5 లక్షలు (88.7%) గ్రామీణ, 2.8 లక్షలు (11.3%) పట్టణ ప్రాంతాల్లో నేత గృహాలున్నట్లు సర్వేలో వెల్లడయింది. 72% మంది మహిళలు చేనేత వృత్తిలో కొనసాగుతుండగా, 1418 వయస్సు వారు 2.4%. నలుగురు నేతకారుల్లో ఒకరు నిరక్షరాసులు కాగా, 14% మంది ప్రాథమిక విద్యను పూర్తి చేయలేకపోయారు. 26.73 లక్షల నేతకారుల్లో సంవత్సర కాలంగా సగటున 208 రోజులు నేత పనిలో నిమగ్నమై ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి 262 రోజులుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 201 రోజులుంటున్నది. అదే మూడవ జనగణనలో సగటు ఉపాధి 183 రోజులుండింది.

అత్యధిక సగటు నేతకారుల పని దినాలు మహారాష్ర్టలో 310, ఆంధ్రప్రదేశ్‌లో 302, ఢిల్లీలో 292, చత్తీస్‌గఢ్‌లో 290, పాండిచ్చేరిలో 286 రోజులుగా నమోదైంది. అత్యధికంగా 66.3% నేత గృహాల సంపాదన నెలకు రూ.5 వేలుండగా, పట్టణ ప్రాంతాల్లో 36.1% గృహాల సంపాదన రూ.5 వేలకు మించి ఉంది.

వ్యవసాయం తర్వాత దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ చేనేత. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ర్ట ప్రభుత్వాలు దీనికి జీవం పోయడం ద్వారా దేశ, రాష్ట్రాలు ఆర్థికాభివృద్ధి సాధించగలుగుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వికాసానికి ఈ పరిశ్రమ చేదోడుగా ఉంటుంది. గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ రంగం కుదేలై చేనేత కళాకారుల ఆత్మహత్యలు అధిక సంఖ్యలో చోటు చేసుకున్నాయి. బతుకమ్మ చీరలతో పాటు చేయూత తదితర పథకాలు మన రాష్ర్టంలో అమలు జరుగుతుండటంతో చేనేత కొంతమేరకు నిలదొక్కుకోగలిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల కారణంగా చేనేతను ఉపాధిగా ఎంచుకున్నవారి సంఖ్య కూడా పెరిగింది. దేశ వ్యాప్తంగా చేనేత మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ఎస్‌సిల గృహాలు గ్రామీణ ప్రాంతాల్లో 4,09,810 (14.9%), పట్టణ ప్రాంతాల్లో 38,927 (9.8%) మంది ఉన్నారు. ఎస్‌టిల్లో 5,58.805 (20.3%), 42,856 (10.8%), ఒబిసిల్లో 8.74,864 (31.8%), 1,81,018 (45.7%), ఇతరులు 9,04,966 (32.9%), 1,33,593 (33.7%) గృహాలు నేత వృత్తిలో ఉన్నాయి.

ఇక మతపరంగా హిందువులు గ్రామీణ ప్రాంతాల్లో 20,55,972 (74.8%), పట్టణ ప్రాంతాల్లో 2,71,057 (68.4%), ముస్లీంలు 4,59,665 (16.7%), 90,102 (22.7%), క్రైస్తవులు 1,85,305 (6.7%), 24,615 (6.2%); సిక్కులు 2,369 (0.1%), 650 (0.2%); బౌద్ధులు 23,095 (0.8%) 748 (0.2%); జైన్లు 218 (0.0%), 74(0.0%); జోరాస్టియన్లు 1,116 (0.0%), 1,006 (0.3%); ఇతరులు 20,705 (0.8%), 8,142 (2.1%) గృహాలున్నాయి. వీటిలో సొంత నివాస గృహాలు గ్రామీణ ప్రాంతాల్లో 26,06,735 (94.8%), పట్టణ ప్రాంతాల్లో 3,18,435 (80.3%)లు ఉండగా, అద్దె గృహాలు 1,04.189 (3.8%), 69,749 (17.6%), ఇతరత్రా 37,521 (1.4%), 8,210 (2.1%)లు ఉన్నాయి.

చేనేత వృత్తిని చాలా కుటుంబాల్లో సభ్యులందరూ కలిసి చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్నాయి. కొన్ని కుటుంబాలు సంప్రదాయబద్ధంగా, మరికొన్ని కుటుంబాలు వారసత్వ వృత్తిగా కొనసాగిస్తున్నాయి. కొందరు వ్యక్తిగతంగా చేనేతను ఉపాధిగా ఎంచుకున్న వారున్నారు. అయితే ఈ వృత్తిలో చిన్నా, పెద్ద తేడా లేకుండా పనులు చేసుకుంటూ ఉత్పత్తికి చేదోడుగా ఉంటున్నారు. వయస్సుల వారీగా చూస్తే, 18 ఏళ్ల లోపు వారు గ్రామీణ ప్రాంతా ల్లో 95,041 (3.1%) ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 12,808 (2.7%) ఉన్నారు. 18 35 ఏళ్లవారు 13,19,933 (43.2%), 1,80,134 (38.4%); 36 45 మధ్య వయస్సువారు 7,64,055 (25%), 1,18,052 (25.2%); 46 60 ఏళ్ల వారు 6,91,287 (22.6%); 1,17.565 (25.1%) ఉండగా, 60 వయస్సు పైబడినవారు 1,83,375 (6%), 40,262 (8.6%). ఆడ, మగ తేడా లేకుండా కలిసిమెలిసి వృత్తిని కొనసాగిస్తుండగా, దేశ వ్యాప్తంగా మహిళలే ఎక్కువ శాతం ఈ వృత్తిలో కొనసాగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పురుషులు గ్రామీణ ప్రాంతాల్లో 7,78.772 (26%), పట్టణ ప్రాంతాల్లో 1,96,961 (42%) ఉండగా, మహిళలు 22,74,516 (74.5%), 2,71,769 (58%); ట్రాన్స్‌జెండర్స్ 403 (0.0%), 91(0.0%) లు ఉన్నారు. వీరిలో నిరక్షరాస్యులు గ్రామీణ ప్రాంతాల్లో 7,10,628(23.2%), పట్టణ ప్రాంతాల్లో 1,09,705 (23.4%), ప్రాథమిక విద్య లోపు 4.43,880 (14.5%), 62,451(13.3%), ప్రాథమిక విద్య గలవారు 5,32,488 (17.4%), 1,05,031 (22.4%); మధ్యతరగతి 6,56,154 (21.4%), 78,674 (16.8%); హైస్కూలు స్ధాయి వారు 3,99,922 (13%), 60,058 (12.8%); ఇంటర్మీడియట్ స్థాయి 2,05,173 (6.7%), 30,590 (6.5%); గ్రాడ్యుయేషన్, ఆపై అర్హతలున్నవారు 1,05,446 (3.4%), 22,312 (4.7%). వీరిలో నేత నేసేవారు గ్రామీణ ప్రాంతాల్లో 23,56,127 (77.2%), పట్టణ ప్రాంతాల్లో 3,17,764 (67.8%) మంది ఉన్నారు. చేనేతకు అనుబంధంగా ఉండే పనిలో 6,97,564 (22.8%) గ్రామీణ ప్రాంతాల్లో, 1,51,057 (32.2%) పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు.

టెక్స్‌టైల్ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో పోటీగా నిలిపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. పెట్టుబడులు పెట్టడం, రానున్న మూడేళ్లలో 7 టెక్స్‌టైల్ పార్కులను నెలకొల్పడం, పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి కల్పన, ఎగుమతులను పెంచడం, నైలాన్ చిప్స్, నైలాన్ ఫైబర్, నూలుపై ప్రాథమిక కస్టవ్‌‌సు సుంకంను 5 శాతం తగ్గించి ఎగుమతులకు, చిన్న పరిశ్రమలకు సహాయపడేలా చర్యలు తీసుకుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా తాజా బడ్జెట్‌లో చేనేత, జౌళిశాఖలలో ప్రోత్సాహక పథకాలకు చోటు కల్పించింది. రూ.338 కోట్లను కేటాయిస్తూ… ఇందులో నేతకారులకు ఆర్థిక సహాయ పథకాల కింద రూ.14 కోట్లు, చేనేత, జౌళి ప్రోత్సాహకానికి రూ.22 కోట్లు కేటాయించింది. గతంలో రూ.318 కోట్ల బతుకమ్మ చీరల పంపిణీని చేనేత, జౌళి బడ్జెట్‌లోనే చూపేవారు. ఈసారి బడ్జెట్ నుంచి మినహాయించి, నేరుగా నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు బడ్జెట్‌లో కేటాయించిన ప్రకారం అమలు చేయగలిగితే (గతంలో బడ్జెట్ కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయలేదు) చేనేత పరిశ్రమపై ఆధారపడే వారి సంఖ్య మరింత పెరిగేందుకు ఆస్కారముంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News