Sunday, April 28, 2024

ఎర్ర చందనంపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ఎర్ర చందనంపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎర్ర చందనం సాగును సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష (రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్) నుంచి తొలగించినట్లు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు. ఇక నుంచి రైతులు ఎర్ర చందనం సాగు చేసి, ఎగుమతి చేసుకోవచ్చని, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తెలిపారు. ఇది రైతులకు ఎంతో మేలు చేసే నిర్ణయం అని చెప్పారు. కాగా, దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ అరుదైన ఎర్ర చందనం పండుతుంది. అందులోనూ నంద్యాల జిల్లాలోని నల్లమల ,లంకమల అడవుల్లోనూ, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య,తిరుపతి ,నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తరించిన శేషాచల అడవుల్లోనూ ఎర్ర చందనం విస్తారంగా పెరుగుతుంది.

ఎర్రచందనం సాగుపై ఆంక్షలు ఎత్తివేయటం ద్వారా రైతులు తమపొలాల్లో ఎర్రచందనం విరివిగా సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎర్ర చందనం కోసం అడవుల్లో చెట్లను విచక్షనారహితంగా నరికి వేసి అడవుల క్షీణతకు పాల్పడుతన్న చర్యలకు అడ్డుకట్ట పడనుంది. అడవుల నుంచి ఎర్రచందనం అక్రమంగా నరికి వేసి విదేశాలకు దుంగలను స్మగ్లింగ్ చేయటం కూడా తగ్గిపోనుంది. రైతులు తమ పొలాల్లోనే సాగు చేసి పక్వానికి వచ్చిన దుంగలను నరికి విదేశాలకు ఎగుమతి చేయటం ద్వారా రైతులకు మంచి లాభసాటి ధరలు కూడా లభించనున్నాయి. రాయలసీమ  ప్రాంతంలో టన్ను ఎర్రచందనం లక్ష రూపాయలకు పైగానే ధర పలుకుతుంది. అది కూడా అక్రమంగా అడవుల నుంచి నరికి తెచ్చిన సరుకు దొంగచాటుగా ఇంత ధర పెట్టి కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం , అదే రైతులు సాగు చేసి పండించే ఎర్రచందనం కలపను అధికారికంగానే కొనుగోలు చేస్తే టన్ను ధర లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల ధరపెట్టే అవకాశాలు ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News