Monday, April 29, 2024

రైతు చట్టాలను రైతులకు తెలియపర్చడమే అగ్రీ లీగల్ క్లినిక్ ప్రధాన ధ్యేయం

- Advertisement -
- Advertisement -

హన్మకొండ టౌన్ : వ్యవసాయ రంగంలో రైతు చట్టాలను రైతులకు తెలియపర్చడమే అగ్రీ లీగల్ క్లినిక్ ప్రధాన ధ్యేయమని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హై కోర్ట్ జడ్జి పి.నవీన్ రావు అన్నారు. ఆదివారం హన్మకొండ లోని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, వరంగల్ కార్యాలయంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కే.రాధాదేవి, ఎం.కృష్ణమూర్తిల సమక్షంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ను తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు జడ్జి పి.నవీన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అనంతరం సమావేశం ఏర్పాటుకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి సభ ప్రారంభించడం జరిగింది.

అనంతరం ముఖ్య అతిథులను బొకేలు, షీల్డ్ లు అందించి శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి పి.నవీన్ రావు మాట్లాడుతూ, నల్సార్ విశ్వవిద్యాలయం, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెంట్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని కొనియాడారు. ఈ దేశంలోని రైతులకు రైతు చట్టాలపై అవగాహన కల్పించడం చాలా కీలకం అని పేర్కొన్నారు. రైతు సంబంధిత చట్టాలను రైతులకు తెలియజేసే లక్ష్యం కోసం అగ్రీ లీగల్ క్లినిక్‌లను ప్రారంభిస్తున్నటు తెలిపారు.

రైతుని వినియోగదారునిగా సుప్రీంకోర్టు నిర్ధారించిందని, రైతు తనకు సంబంధించిన నష్టాన్ని కూడా అడిగేటు వంటి హక్కు కలిగి ఉన్నారనే చట్టాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఎరువులు, విత్తనాలు అమ్మేటువంటి కంపెనీలు తిరిగి రైతుల నుండి ఉత్పత్తిని కొనుగోలు చేసేలా రైతు లిఖితపూర్వకంగా గాని, ఒప్పంద పత్రం ద్వారా గాని విత్తన, ఎరువు కంపెనీలను డిమాండ్ చేయవచ్చుననే విషయం రైతుకు తెలియాల్సి ఉందన్నారు. వ్యవసాయ ఆధారిత రంగంలో ఉన్న విద్యార్థులు ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ యొక్క ఉద్దేశాన్ని రైతులకు విసౄ్తత స్థాయిలో అవగాహన కల్పించడంలో ముందుండి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ఉండే ప్రాథమిక హక్కుల గురించి వివరించారు.

లోక్ అదాలత్, లీగల్ సర్వీసెస్ చట్టం గురించి విపులంగా విశదీకరించారు. అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లను ప్రతి జిల్లాలో,గ్రామ గ్రామాలలో ఏర్పాటు చేసేలా, రైతులకు వారి హక్కుల పట్ల పూర్తి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలో ఏడు లక్షల గ్రామాలున్నాయని, ఈగ్రామాలలో న్యాయ సేవా అథారిటీలు, వ్యవసాయశాఖలు, స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలాంటి సదస్సులు నిర్వహిస్తే రైతులకు చట్టం గురించి తెలుస్తుందన్నారు. రైతులకు భూమి, వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగితే వారికి కష్టాలు, నష్టాలు తీరుతాయని లీఫ్స్ ప్రెసిడెంట్ యం.సునీల్ అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్ రెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కే.రాధాదేవి, ఎం.కృష్ణమూర్తి, నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణదేవరావు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు జె.ఉపేందర్ రావు, బి.శ్రీనివాసులు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు, లీఫ్స్ ప్రెసిడెంట్ ఎం.సునీల్ కుమార్, వరంగల్, హనుమకొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఈ.ఆనంద్ మోహన్, శ్యాంసుందర్ రెడ్డి, డీ.సీ.పీ.లు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్స్, వరంగల్, హన్మకొండ జిల్లాల న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ప్రభుత్వ వ్యవసాయ శాఖ విద్యార్థులు మరియు వాగ్దేవి అగ్రికల్చరల్ కళాశాల విద్యార్థులు, న్యాయశాఖ విద్యార్థులు, చైతన్య డిగ్రీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News