Monday, April 29, 2024

మయాన్మార్‌లో సైన్యం వైమానిక దాడులు.. థాయ్‌లాండ్‌కు పారిపోయిన వేలాదిమంది..?

- Advertisement -
- Advertisement -

మయోశాకోయెప్(థాయ్‌లాండ్):మయాన్మార్‌లో మిలిటరీ వైమానిక దాడులతో భీతిల్లిన వేలాదిమంది థాయ్‌లాండ్‌లోకి పారిపోతున్నారని అంతర్జాతీయ పరిశీలకులు తెలిపారు. ముఖ్యంగా మయన్మార్ ఉత్తర ప్రాంతంలోని కరేన్ రాష్ట్రానికి చెందిన దాదాపు 10,000మంది థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించినట్టు అంచనా. వారందరినీ తిరిగి వెనక్కి పంపేందుకు థాయ్‌లాండ్ సైన్యం చర్యలు ప్రారంభించిందని తెలుస్తోంది. థాయ్‌లాండ్ అధికారులు మాత్రం సరిహద్దులో అభద్రతాభావం నెలకొన్నదంటున్నారు. శరణార్థులను వెనక్కి పంపిస్తున్నారన్న వార్తల్ని థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్‌చాన్‌ఓచా ఖండించారు. వారికి ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమని తెలిపారు. ఫిబ్రవరి 1న ఆంగ్‌సాన్‌సూకీ నేతృత్వంలోని ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని మిలిటరీ కూలదోసిన తర్వాత మయన్మార్‌లో రోజురోజుకూ ఉద్రిక్తత తీవ్రమవుతోంది. గత ఆదివారం ఒక్క రోజే సైన్యం జరిపిన కాల్పుల్లో 100మందికి పైగా ఆందోళనకారులు చనిపోయారు. ఇప్పటివరకు 510మంది ఆందోళనకారులు చనిపోయినట్టు అంచనా. సైన్యం దాడులకు భయపడకుండా మంగళవారం కూడా కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి.

ఆదివారం మయన్మార్ సైన్యం మూడు వైమానిక దాడులు జరిపినట్టు ఫ్రీ బర్మా రేంజర్స్ అధికారి డేవ్ యూబ్యాంక్ తెలిపారు. ఈ దాడుల్లో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడినట్టు వెల్లడించారు. థాయ్‌లాండ్ ఉత్తర ప్రాంతంలోని సరిహద్దు రాష్ట్రం మయేహాంగ్‌సన్‌లోకి 2500మంది పారిపోయి వచ్చినట్టు ఓ మీడియా ఏజెన్సీ తెలిపింది. వందలాది మంది నదీ సరిహద్దును దాటి వస్తున్నారని పేర్కొన్నది. యువకులు సామాన్లతో కూడిన మూటలు, పెట్టెలు మోసుకుంటూ సరిహద్దును దాటుతున్నారని తెలిపింది. మరోవైపు కరేన్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ ఎదురుదాడులు ప్రారంభించిందంటున్నారు. శనివారం ఉదయం మిలిటరీ ఔట్‌పోస్ట్‌పై గెరిల్లాలు జరిపిన బాంబు దాడిలో 10మంది సైనికులు చనిపోగా, 8మందిని బందీలుగా పట్టుకున్నట్టు ఆన్‌లైన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కరేన్‌కు మరింత స్వయంప్రతిపత్తి కావాలని ఈ సంస్థ కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది.

Thousands flee to thailand after Myanmar Army air strike

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News