Monday, April 29, 2024

ముంబైలో 26/11 తరహా పేలుళ్లు జరుపుతాం: పాక్ నుంచి హెచ్చరికలు?

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబైలో మరోసారి 26/11 పేలుళ్ల తరహా ఉగ్రదాడులు జరుపుతామని ఆగంతకుల నుంచి హెచ్చరికలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ఫోన్ నంబరుకు పాకిస్థాన్ కోడ్ ఉంది. దీంతో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టామని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ చెప్పారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఫర్లీ లోని ముంబై ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబరుకు గుర్తుతెలియని నంబరు నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ముంబైలో 26/11 తరహా దాడులకు పాల్పడుతామని, నగరాన్ని పేల్చివేస్తామని ఆగంతకులు అందులో బెదిరించినట్టు వివేక్ తెలిపారు.

ఆ సందేశాల్లో 26/11 పేలుళ్ల ఉగ్రవాది అజ్మల్ కసబ్, ఇటీవల మృతి చెందిన అల్‌ఖైదా అధినేత అల్ జవహరీ పేరు కూడా ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. ఈ దాడుల కోసం ఇప్పటికే తమ మద్దతుదారులు కొంతమంది భారత్‌లో పనిచేస్తున్నట్టు దుండగులు హెచ్చరించినట్టు తెలిపారు. ఈ మెసేజ్ ఎక్కడ నుంచి వచ్చిందీ, ఎవరైనా హ్యాకింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. తీర ప్రాంతాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశామని చెప్పారు. 2008 నవంబరు 26న ముంబైలో భీకర ఉగ్రదాడి జరిగిన సంఘటన తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన 10 మంది సాయుధ ముష్కరులు సముద్ర మార్గం ద్వారా ముంబై లోకి ప్రవేశించి అనేక ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక వందల మంది గాయపడ్డారు.

Threat Message from Pakistan Attack like 26/11 in Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News