Thursday, May 9, 2024

తమిళనాడు దాహం తీరుస్తాం

- Advertisement -
- Advertisement -

 

ప్రగతి భవన్‌లో సిఎంతో తమిళనాడు బృందం భేటి
తమిళనాడు సిఎం నుంచి తెలంగాణా, ఎపి సిఎంలకు అధికారికంగా ఒక లేఖ రాయాలని సూచన
తమిళనాడు ప్రతిపాదన అందిన తరవాత మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణుల స్థాయి సమావేశం
మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ
కార్యాచరణ సిద్ధమైతే మూడు రాష్ట్రాలు దేశానికే ఆదర్శవంతంగా మారుతాయని కెసిఆర్ వ్యాఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రానికి తాగు నీరు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా అంగీకరించారు. గురువారం ప్రగతిభవన్‌లో తమిళనాడు మంత్రులు ఎస్‌పి వేలుమణి, డి. జయకుమార్, పబ్లిక్ వర్క్ శాఖ కార్యదర్శి డాక్టర్ కె.మణివాసన్, సలహాదారు ఎం.షీలా ప్రియ తదితరులు సిఎం కెసిఆర్‌తో భేటీ అయి తమ రాష్ట్రానికి తాగునీరివ్వాలని అభ్యర్థించారు. వారి అభ్యర్థనపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఈ విషయమై ఎపి, ఒడిషా ముఖ్యమంత్రులతో కూడా సంప్రదింపులు జరపాలిసి ఉన్నందున తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి అధికారికంగా లేఖలు రాయాలని వారికి సూచించారు. అనంతరం మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణుల స్థాయిలో సమావేశం జరపాలన్నారు. ఆ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా నివేదిక తయారు చేయాలని కోరారు. తుది నిర్ణయం తీసుకోవడానికి అధికారులంతా ఏకాభిప్రాయానికి రావాలన్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ కార్యాచరణ సిద్ధమైతే మూడు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా మారుతాయని సిఎం వ్యాఖ్యానించారు. తాగునీటి సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్రాల మధ్య సహన పూరితమైన వాతావరణం ఉండాలని, పొరుగు రాష్ట్రాలు దయతో ఉండాలని సిఎం కెసిఆర్ అన్నారు.

తమిళనాడు తాగునీటి సమస్య గురించి తాను కూడా నీతీ ఆయోగ్ సమావేశాల్లో అనేకసార్లు లెవనెత్తానని గుర్తు చేశారు. లోక్ సభలో టిఆర్‌ఎస్ ఎంపిలు కూడా రెండు, మూడుసార్లు తమిళనాడు తాగునీటి సమస్యను ప్రస్తావించారని పేర్కొన్నారు. తమిళనాడులో తాగునీటి సమస్య దీర్ఘకాలంగా పరిష్కారం కానందుకు దేశం మొత్తం సిగ్గుపడాలన్న సిఎం వ్యాఖ్యానించారు. 70,000 వేల టిఎంసిల నీటి వనరుల్లో దేశవ్యాప్తంగా వ్యవసాయ అవసరాలు పోను 30,000ల టిఎంసిల మిగులు నీటి వనరులు ఉన్నాయని సిఎం అన్నారు. దీంట్లో కనీసం మరో 10,000 వేల టిఎంసిల నీటిని వాడుకున్నా దేశవ్యాప్తంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని – తమిళనాడు బృందంతో సిఎం కెసిఆర్ అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాల్సి ఉందని సూచించారు. తమిళనాడు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై దేశవ్యాప్తంగా అవగాహన అవసరమన్నారు. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు ఉంటాయన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిసలైన భారతీయుడిగా తాను తమిళనాడు తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని – తమిళనాడు బృందానికి సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు. తమిళనాడు తాగునీటి సమస్య గురించి ఎపి సిఎం జగన్ మోహన్‌రెడ్డితో ఫోన్‌లో ఆయన మాట్లాడారు. తమిళనాడు సమస్య పరిష్కారానికి తాను సూచించిన మార్గాలను ఎపి సిఎంతో షేర్ చేసిన కెసిఆర్ తమిళనాడులో తాగునీటి సమస్య దీర్ఘకాలంగా నెలకొని ఉన్న విషయం తెలిసిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సహకారం అందించాల్సిన అవసరాన్ని జగన్‌కు వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కెటి.రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎంఒ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, ఒఎస్‌డి శ్రీధర్ దేశ్ పాండే, సిఇలులు మురళీధర్ రావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

TN Ministers meets CM KCR at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News