Thursday, May 16, 2024

హిందుత్వ అంటే మాట నిలబెట్టుకోవడం

- Advertisement -
- Advertisement -

Uddhav Thackeray

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం తన చిరకాల స్వప్నం లేదా వాంఛ కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బిజెపితో మైత్రి కొనసాగడం వల్ల తన తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయానని, అందుకే బిజెపితో తెగతెంపులు చేసుకుని పెద్ద బాధ్యతను స్వీకరించానని ఆయన అన్నారు. శివసేన అధికార పత్రిక సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సంజయ్ రౌత్‌కు ఆయన ప్రతేక ఇంటర్వూ ఇచ్చారు. సోమవారం ఈ ఇంటర్వూ ప్రచురితమైంది. తన దృష్టిలో హిందుత్వ అంటే ఇచ్చిన మాటను నెరవేర్చడమని ఠాక్రే అన్నారు.

మీరు అనూహ్య ముఖ్యమంత్రా అన్న ప్రశ్నకు కావచ్చని ఆయన చెప్పారు. సిద్ధాంతపరంగా వేర్వేరు పార్టీలైన ఎన్‌సిపి, కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ గతంలో కూడా ఈ విధమైన పొత్తులు ఏర్పడ్డాయని, అయినప్పటికీ రాష్ట్ర, దేశ ప్రయోజనాల కన్నా ఏ సిద్ధాంతం ముఖ్యమైనది కాదని ఠాక్రే అభిప్రాయపడ్డారు. కేంద్రంలో బిజెపి సారథ్యంలో గతంలో ఏర్పడిన ప్రభుత్వాలను ఉదహరిస్తూ రాం విలాస్ పాశ్వాన్(లోక్ జనశక్తి పార్టీ), నితీశ్ కుమార్(జెడియు), మమతా బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్), చంద్రబాబు నాయుడు(తెలుగు దేశం పార్టీ)ల సిద్ధాంతాలు బిజెపి సిద్ధాంతాలు ఒకటేనా అని ఆయన ప్రశ్నించారు. కశ్మీరులో పిడిపితో బిజెపి పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తనకు రాజకీయ అధికారం కొత్తేమీ కాదని, తన తండ్రి బాల్ ఠాక్రే బతికున్న కాలంలో అదేమిటో తనకు చిన్ననాటి నుంచి తెలుసని ఆయన చెప్పారు. అయితే ముఖ్యమంత్రి పదవి తనకు దక్కడం మాత్రం ఊహించనిదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి శివసైనికుడిని చేస్తానని తన తండ్రికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళతానని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రి కావడం తన తండ్రికి ఇచ్చిన మాటను నెరవేర్చడంలో మొదటి అడుగు అని ఆయన చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి తనకు ఇచ్చిన మాటను తప్పిందని ఆయన అన్నారు. మహారాష్ట్రలో అధికారాన్ని చెరో సగం పంచుకుందామని అప్పటి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనకు మాట ఇచ్చారని, కాని అసెంబ్లీ ఎన్నికల తర్వాత వారు మాట తప్పడం వల్లే తాము బిజెపితో తెగతెంపులు చేసుకోవలసి వచ్చిందని ఠాక్రే అన్నారు. తానేమైనా చంద్రుడు కావాలనో లేక నక్షత్రాలు కావాలనో అడగలేదని, లోక్‌సభ ఎన్నికలకు ముందు కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయమని మాత్రమే అడిగానని ఠాక్రే వ్యాఖ్యానించారు.

 

Uddhav Thakeray says Hindutva means honouring the word, In an interview to Saamana Thakeray said he fulfilled the promise made to his father Bal Thakeray
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News