Monday, April 29, 2024

స్నాతకోత్సవంలో చేనేత దుస్తులనే వాడండి

- Advertisement -
- Advertisement -

యూనివర్సిటీలకు యుజిసి ఆదేశం

న్యూఢిల్లీ: స్నాతకోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో చేనేత వస్త్రాలతో తయారుచేసిన దుస్తులను మాత్రమే ఉపయోగించాలని యూనివర్సిటీలకు రాసిన తాజా లేఖలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) పునరుద్ఘాటించింది. ఈ విషయమై 2015, 2019లో యూనివర్సిటీలకు యుజిసి వర్తమానం పంపినట్లు అధికారులు తెలిపారు. భారతదేశ వాతావరణానికి చేనేత వస్త్రాలే సౌకర్యంగా ఉంటాయని, అంతేగాక వీటిని ధరిండడం వల్ల విద్యార్థులలో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని కూడా యుజిసి పేర్కొంది.

ఇప్పటికే దేశంలోని పలు యూనివర్సిటీలు స్నాతకోత్సవం సందర్భాలలో చేనేత వస్త్రాలతో తయారుచేసిన దుస్తులనే ఉపయోగిస్తున్నాయని, అయితే ఇంకా కొన్ని యూనివర్సిటీలు తమ స్నాతకోత్సవ దుస్తులలో మార్పులు తీసుకురాలేదని యుజిసి కార్యదర్శి మనీష్ ఆర్ జోషి యూనివర్సిటీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇకనైనా మిగిలిన యూనివర్సిటీలు తమ స్నాతకోత్సవ దుస్తుల తయారీలో చేనేత వస్త్రాలను మాత్రమే ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

భారతీయులుగా విద్యార్థులు గర్వించే విధంగా ఉండే చేనేత దుస్తులను ఉపయోగించి దేశంలో చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని ఆయన తన లేఖలో కోరారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాలలో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా ఆయన తెలిపారు. ఈ విషయంలో తీసుకున్న కార్యాచరణను తెలియచేస్తూ ఫోటోలు, వీడియోలను కూడా జతచేయాలని ఆయన తన లేఖలో యూనివర్సిటీలను కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News