Monday, April 29, 2024

యుకె క్వారంటైన్ పాలసీ వివాదం: తీవ్రంగా స్పందించిన భారత్

- Advertisement -
- Advertisement -

UK quarantine policy controversy: India reacts strongly

 

న్యూఢిల్లీ : కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకున్నప్పటికీ, బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్‌లో ఉండాలంటూ ఆ దేశ ప్రభుత్వం విధించిన కొత్త నిబందనలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా వివక్షపూరిత విధానమని, భారత్‌లో తయారైన టీకాలను వినియోగించుకున్న బ్రిటన్ ఇలాంటి నిబంధనలు విధించడం సమంజసం కాదని కేంద్ర విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలో ఈ సమస్యను పరిష్కరించకుంటే ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది. వాస్తవానికి కొవిషీల్డ్ ఒరిజినల్ తయారీ సంస్థ బ్రిటన్‌కు చెందినదే. అంతేకాక బ్రిటన్ అభ్యర్థన మేరకు భారత్ 50 లక్షల డోసులను ఆ దేశానికి అందించింది. ఆ టీకాలను అక్కడి ఆరోగ్య వ్యవస్థ ఉపయోగించింది.

అలాంటిది ఇప్పుడు కొవిషీల్డ్‌ను బ్రిటన్ గుర్తించకపోవడం వివక్షపూరిత విధానమని దీన్ని బ్రిటన్ విదేశాంగ శాఖ దృష్టికి తెస్తామని భారత విదేశాంగశాఖ పేర్కొంది. మన భాగస్వామ్య దేశాలు వ్యాక్సిన్లను పరస్పరం గుర్తించుకోవాలని కోరుకుంటున్నామని అభిప్రాయ పడింది. అటు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రన్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయినప్పుడు ఈ సమస్యను ప్రస్తావించారు. అక్టోబర్ 4 నుంచి విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కొవిడ్ నిబంధనలను బ్రిటన్ రెండు రోజుల క్రితం ప్రకటించింది. భారత్‌తోపాటు మరికొన్ని దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే ప్రయాణికులు కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకున్నప్పటికీ యుకె చేరుకున్న తరువాత పీసిఆర్ పరీక్షలు చేయించుకోవడమే కాక, పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News