Monday, April 29, 2024

కార్పొరేట్ బడ్జెట్!

- Advertisement -
- Advertisement -

Union Budget 2021 -22 allocations

 

పూర్తిగా స్వామి కార్యానికి అంకితమై పని చేయడం ఒక పద్ధతి కాగా, ఆ పేరుతో స్వకార్యాన్ని జరిపించుకోడం మరో విధానం. కేంద్ర ఆర్థిక మంత్రి 2021- 22 బడ్జెట్ రూపకల్పనలో రెండో పద్ధతినే ఎంచుకున్నట్టు రుజువవుతున్నది. ప్రజల వాస్తవ మేలుకు, నిజమైన దేశాభివృద్ధి సాధనకు విశేష ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించడానికి తాపత్రయపడుతూనే ప్రభుత్వ రంగాన్ని మరింతగా ప్రైవేటుకు అప్పగించి చేతులు దులుపుకునే కార్యక్రమానికి అగ్రతాంబూలమిచ్చారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను భారాన్ని తగ్గిస్తారని ఏటా కేంద్ర బడ్జెట్ ముందు గట్టి ఆశలు పెట్టుకునే మధ్యతరగతి నికరాదాయ వర్గాలకు ఉత్త చేయినే చూపించారు. కొత్త బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయానికి రూ.5 లక్షల 54 వేల కోట్లు కేటాయించారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఇది రూ. 4.39 లక్షల కోట్లే. ప్రభుత్వ పెట్టుబడి నిజంగా పెరిగితే మౌలిక సదుపాయాల రంగంలో అదనపు ప్రాజెక్టులు వస్తాయి. ఆ మేరకు ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

ఈ కేటాయింపులు ఎంత వరకు వాస్తవ రూపం ధరిస్తాయనే దాని మీద అసలు ఫలితం ఆధారపడి ఉంటుంది. కరోనా (కొవిడ్ 19) విజృంభించి ఏడాది కాలంగా దేశాన్ని పీల్చిపిప్పి చేస్తున్నది. పర్యవసానంగా 2020 -21 ఆర్థిక సంవత్సరం 7.7 శాతం వ్యతిరేక వృద్ధి (వృద్ధి క్షీణత) ని చవి చూస్తుందని అంచనా వేశారు. దీని నుంచి బయటపడి 2021-22లో 11 శాతం వృద్ధిని సాధిస్తామని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వే నివేదికలో చెప్పుకున్నది. ఆ స్థాయి వృద్ధిని సాధించడానికి అనువుగా బడ్జెట్ నిర్ణయాలు కనిపించడం లేదు. ఆరోగ్య రంగానికి రూ. 2 లక్షల కోట్లు కేటాయించడం మంచి చర్యే. అయితే వైద్య ఆరోగ్య రంగంలో ఇప్పటికే ప్రైవేటు పాత్ర, ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వాసుపత్రులు దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి. అయినా కరోనా సంక్షోభంలో దేశాన్ని ఆదుకున్నవి ప్రభుత్వ ఆసుపత్రులే. అందుచేత ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని విశేషంగా ప్రోత్సహించవలసి ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆలంబనగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బాగా మెరుగుపరచవలసి ఉంది. వైద్య విద్యలో నాణ్యతను మరింతగా పెంచాల్సి ఉంది. మౌలిక సదుపాయాల కల్పన రంగంలో జాతీయ రహదారుల నిర్మాణానికి విశేష ప్రాధాన్యం ఇవ్వదలచినట్టు బడ్జెట్ పేర్కొన్నది. అయితే ఈ ఏడాది మొదటి అర్ధభాగం ముగిసేలోగా ఎన్నికలు జరుగనున్న తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని నేషనల్ హైవే ప్రాజెక్టులకే బడ్జెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఇప్పటికే ఆర్థిక సంస్కరణల బాటలో మహాజోరు కనబరుస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఆ వేగాన్ని మరింతగా పెంచడానికి నిర్ణయించుకున్న విషయం బోధపడుతుంది. రెండు పబ్లిక్ రంగ బ్యాంకులను ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటుకు కట్టబెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు.

అలాగే జీవిత బీమా సంస్థలో పాక్షికంగా పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయించారు. ఇంకా బిపిసిఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్ వంటి పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటైజేషన్‌ను 2021-22 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. పబ్లిక్ రంగ బ్యాంకుల లోటును భర్తీ చేయడానికి రూ. 20 వేల కోట్లు కేటాయించారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతానికి పెంచారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, ఎల్‌ఇడి బల్బులు, మొబైల్ ఫోన్ల విడి భాగాల దిగుమతిపై సుంకాలను విధించారు. ఇది దేశీయ తయారీ రంగాన్నీ ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. అన్నిటికీ మించి వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల సెస్ పేరిట అనేక వస్తువులపై సుంకాన్ని విధించడానికి తీసుకున్న నిర్ణయం ప్రజల మీద అపరిమితమైన భారాన్ని మోపనుంది. ఈ సుంకం లీటర్ పెట్రోల్ మీద రూ. రెండున్నర, డీజిల్ పైన రూ. 4 పడనుండడం ప్రత్యేకించి గమనించవలసిన విషయం.

ఇది సాధారణ, మధ్యతరగతి ప్రజలను విపరీతంగా బాధించడం ఖాయం. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుకు అప్పగించడంతో పాటు కార్పొరేట్ పన్ను విధించకపోడం సంపన్న వర్గాలకు, కార్పొరేట్ రంగానికి ఎంతో ఆహ్లాదకరమైన అంశాలు. అందుకే నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్ వెలువడిన తర్వాత స్టాక్ మార్కెట్ ఆనందోత్సాహాలతో ఎగిరి గంతు వేసింది. సూపర్ ధనవంతుల సంతోషం ఇందులో ప్రతిబింబించింది.ఏ దేశ అభివృద్ధి అయినా అక్కడ గల సామాన్య జనం ఆనంద నాట్యంలోనే ప్రతిబింబించాలి గాని జనాభాలో గట్టిగా 10 శాతం కూడా ఉండని అతిశ్రీమంతుల ముఖాల్లో వెలుగులు పెంచడంలో కాదు. కరోనా వల్ల ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోయి చెప్పనలవికాని నైరాశ్యంలో కూరుకుపోయిన కొన్ని పదుల కోట్ల అసంఘటితరంగ కార్మికులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిరంగ సన్నజీవుల బాగుకు పాటుపడని ఇటువంటి బడ్జెట్‌లు దేశ వాస్తవ ప్రగతిని సాధించజాలవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News