Saturday, April 27, 2024

భిన్నత్వంలో ఏకత్వమే

- Advertisement -
- Advertisement -

Venkaiah

 

విధి నిర్వహణలో అంకిత భావం అవసరం
మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తి కొనసాగించాలి
పోలీసులకు ప్రజలతో సన్నిహిత్యం పెరగాలి
20వ అఖిల భారత పోలీసు బ్యాండ్ ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

మనతెలంగాణ/హైదరాబాద్: విభన్నత్వంలో ఏకత్వం భారతీయుల విశిష్ట లక్షణమని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే స్పొర్ట్ కాంప్లెక్స్ సముదాయంలో ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని ఏర్పాటు చేసిన 20వ అఖిల భారత పోలీసు బ్యాండ్ ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో భారతీయ పారామిలటరీ దళాలు, పోలీసు దళాలు అంకితభావం ప్రదర్శిస్తున్నారన్నారు.

దేశ అంతర్గత, బహ్య రక్షణతో పాటు శాంతి భద్రతలు, ప్రజలతో సేహ్నపూర్వక బంధాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సామాన్యుడికి పోలీసు సేవలు అందుబాటులో ఉండే విధంగా భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్మార్ట్ పొలీసింగ్, ఫిట్ ఇండియా లాంటి విధానాలను ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. స్మార్ట్ పోలీసింగ్ విధానంలో కేవలం విధానపరమైన అంశాలే కాకుండా కార్యాచరణలో అమలు చేయాలన్నారు.

జాతీయ సమగ్రత, దేశ అంతర్గత రక్షణ పై దేశానికి చేందిన అత్యున్నత పారామిలటరీ దళాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు ప్రాంతాలలో కొందరు ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టిస్తారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అఖిల భారతీయ స్థాయి పారామిలటరీ దళాలు, రాష్ట్ర పోలీసు బృందాల మధ్య నైపుణ్యాలు, అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాల అభ్యసానికి అనువైనవిగా ఉంటాయని తెలిపారు. ఇలాంటి పోటీల ద్వారా ఆయా బృందాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటుకు ఆస్కారం ఉందన్నారు. భారతీయ సంగీతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రాగాలు పారామిలటరీ దళాలు, పోలీసు దళాలకు అనునిత్యం నూతన ఉత్సహాన్ని నింపుతాయన్నారు. ప్రాచీన కాలంలో సంగీతానికి అత్యధికంగా ప్రాధాన్యత ఉండేదని, విశ్వగురు రవీంధ్రనాథ్ టాగూర్ భారతీయల వసుదైక కుటుంబం, సర్వజన సుఖనోభవంతు అనే నినాదాలు, నేటి భారతీయ ప్రజలు జీవనానికి ఉపకరిస్తున్నాయని వివరించారు.

అలనాటి భారతంలో మునీశ్వరులు శౌర్య, వీర, రౌద్ర రసాలను పరిచయం చేశారని వివరించారు. గతంలో పారామిలటరీ దళాలను ప్రోత్సహించేందుకు ఇలాంటి సంగీత కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అదే స్పూర్తితో సికింద్రాబాద్ స్పోర్ట్ కాంప్లెక్స్ కేంద్రంలో దక్షిణ మధ్య రైల్వే ఆర్‌పిఎఫ్ సారధ్యంలో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీలో దేశ వ్యాప్తంగా 27 బృందాలు 1,600 మంది కళాకారులు తమ బృంద, వ్యక్తిగత నైపుణ్యాల ప్రదర్శన ద్వారా జాతీయ స్పూర్తిని చాటారన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రాంతాలు, మతాలు, కులాలు ప్రాతిపదికలు కావన్నారు. అత్యంత కఠినమైన బ్యాండ్ పోటిల్లో ప్రతిభ కనబర్చి విజేతలుగా నిల్చిన వారితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరు అభినందనలు తెలిపారు.

మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో అల్ రౌండ్ ట్రోఫి విజేతగా నిల్చిన సిఆర్‌పిఎఫ్ బృందానికి ప్రాతినిధ్యం వహించిన ప్రమోద్ కుమార్ యాదవ్‌కు ఉపరాష్ట్రపతి ట్రోఫి ప్రధానం చేశారు. అలాగే బ్రాస్ బాండ్‌లో బంగారు పతకం సాధించిన సిఆర్‌పిఎఫ్ బృందానికి ప్రాతినిధ్యం వహించిన మేనేజర్ డిప్యూటి కమిషన్ ప్రమోద్ కుమార్ యాదవ్, బ్రాస్ బ్యాండ్ మాస్టర్ భీంసింగ్‌లకు బంగారు పతకం బహుకరించారు. అనంతరం పైప్ బ్యాండ్ పోటీలో బంగారు పతాకం సాధించిన మహారాష్ట్ర బృందం మేనేజర్ కమాండెంట్ ఆర్.బి.కెనడి బ్యాండ్ మాస్టర్ సంజయ్ బి.కల్యాణిలకు బంగారు పతకం, బుగెలర్స్ విజేతగా నిల్చిన సిఆర్‌పిఎఫ్ మేనేజర్ ప్రమోద్ కుమార్ యాదవ్, మాస్టర్ పవన్‌కుమార్‌లకు బంగారు పతాకాలను ప్రధానం చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసు బ్యాండ్ బృందంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, బిఎస్‌ఎఫ్, చత్తీస్‌ఘడ్, గుజరాత్, సిఆర్‌పిఎఫ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, ఎస్‌ఎస్‌బి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు, దేశ రక్షణకు చెందిన పారామిలటరీ బృందాలు బ్రాస్ బాండ్, పైప్ బాండ్, బుగెలర్స్ లాంటి సంగీత కళారూపాల ప్రదర్శనలు అలరించాయి.

సిఆర్‌పిఎఫ్ బలగాలు 1977 నుండి అందిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. భారతీయ రైల్వేలో ఆర్‌పిఎఫ్ పాత్ర అవసరం తదితర అంశాలపై ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్, దక్షిణ మధ్య రైల్వే జిఎం.గజానన్ మాల్య, అదనపు జనరల్ మేనేజర్ బిబి.సింగ్, చీఫ్ కమిషనర్ మిశ్రా, దక్షిణ మధ్య రైల్వే ఐజి ఈశ్వర్ రావు,మౌలాలీ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ ఎకె.సిన్హా తదితరులు పాల్గొన్నారు.

Venkaiah At closing ceremonies 20th All India Police Band
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News