Thursday, May 9, 2024

తెలంగాణలో గ్రామ న్యాయాలయాలు

- Advertisement -
- Advertisement -

Village Courts

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మహోత్తర నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏ రాష్టంలో లేని విధంగా మొదటి సారిగా రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాలకు శ్రీకారం చుడుతోంది. గ్రామాల్లో సత్వర న్యాయం కల్పించేందుకు గ్రామ న్యాయాలయాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 55 జూనియర్ సివిల్ జడ్జిల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. సిఎం కెసిఆర్ నేతృత్వంలో త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గ్రామ న్యాయాలయాలకు సంబంధించిన ప్రతిపాదనలను సమావేశం ఆమోదం తెలపనుంది. ఈ మేరకు గ్రామ న్యాయాలయాల్లో భర్తీ చేయనున్న వారి జీతభత్యాలను కూడా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న, చిన్న వివాదాలు కోర్టుల వరకు రాకుండా స్థానికంగానే అక్కడికక్కడే న్యాయం లభించాలన్న లక్షంతో ప్రభుత్వం వీటిని నెలకొల్పుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని పలు గ్రామాల్లో చిన్న చిన్న న్యాయ పరిష్కారాల కోసం పెద్దఎత్తున కాలయాపన జరుగుతోంది. ఫలితంగా గ్రామ ప్రజలకు త్వరితగతిని న్యాయం లభించడం లేదు. కోర్టుల్లో జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ న్యాయాలయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పైగా కేసుకు సంబంధించిన ప్రతిసారి గ్రామస్తులు జిల్లా కోర్టులకు వెళ్ళాల్సి వస్తోంది. ఇది వారికి తీవ్ర స్థాయిలో ఆర్ధిక భారం కూడా కలుగుతోంది. ఈ నేపథ్యంలో తొలివిడతగా 55 జూనియర్ పోస్టులను సృష్టించి వాటిని యుద్దప్రాతిపదికన భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ న్యాయాలయాల్లో మొత్తం ఐదు కేటగిరిల్లో పోస్టులను భర్తీ చేస్తుంది.

ఇందులో గ్రామ న్యాయాధికారి (జూనియర్ సవిల్ జడ్జి, ఫస్ట్‌క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ హోదా)కి రూ.27,700 నుంచి రూ. 44,770 చొప్పున ప్రతి నెల జీతాన్ని చెల్లించాలని నిర్ణయించింది. అలాగే హెడ్ క్లర్క్‌కు రూ. 22,900, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టుకు రూ. 15వేలు, స్టేనోగ్రాఫర్‌కు రూ.15వేలు, ఆఫీసు సబ్‌ఆర్డినేట్ (అటెండర్)కు రూ.12వేల చొప్పున జీతాలను చెల్లించనుంది. కాగా ఇదే విషయాన్ని కొన్నాళ్ళ క్రితం సుప్రీం కోర్టు కూడా గ్రామ న్యాయాలయాలను సత్వరమే ఏర్పాటు చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

Village Courts in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News